కోహెడ పండ్ల మార్కెట్ భూమికి కాంగ్రెస్ ఎసరు: హరీశ్ రావు
కోహెడ ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మే కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. రైతుల భవిష్యత్తుపై ఆందోళన.
విధాత, హైదరాబాద్ : రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు మరో బాంబు పేల్చారు. కొహేడ పండ్ల మార్కెట్ లో జరిగిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు,
భూముల చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని, రూ.10 వేల కోట్ల రూపాయలు దండుకొనేందుకు
నాదర్ గుల్, కోహెడ భూములపై గద్దల్లా కాంగ్రెస్ నాయకులు వాలిపోతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 200 ఎకరాల భూమిని కోహెడ పండ్ల మార్కెట్ కు సేకరించిందని.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నామని తెలిపారు. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నపుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాతో కొట్లాడి రూ.10 కోట్లను ఫ్రూట్ మార్కెట్ కోసం చేసిన భూసేకరణలో భాగంగా ఇక్కడ రైతులకి ఇప్పించారని గుర్తు చేశారు. జీవో 216 ప్రకారం రూ.350 కోట్ల డబ్బులను మార్కెట్ కోసం బ్యాంక్ అకౌంట్‌లో ఉంచాం అని, ఇప్పటికి అలాగే ఉన్నాయన్నారు. జీవో నెంబర్ 11ను 2020 సంవత్సరంలో మార్కెట్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోహెడ మార్కెట్ ను నోటిఫై చేశారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని నిర్ణయించి అంతర్జాతీయ నిపుణులతో రూ.1,000 కోట్లతో డీపీఆర్ తయారు చేశాం అన్నారు.
మార్కెట్ నిర్మించకుండా భూ విక్రయాల కుట్ర
కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ అన్ని తయారు చేశాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని అమ్మాలని చూస్తుంది అని హరీశ్ రావు ఆరోపించారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్ ను నిర్మించాలని మా ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. డబ్బులు, డీపీఆర్ అన్ని సిద్దంగా ఉన్న క్రమంలో మార్కెట్ నిర్మాణం కోసం టెండర్లు పిలవకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను దళారులకు కట్టబెట్టి.. లక్షలాది మంది రైతుల పొట్ట కొట్టేందుకు సిద్దమైందన్నారు. టీజీఐసీసీ ద్వారా కేరళ లోని కార్పోరేట్లకు భూములను కట్టబెట్టే కుట్ర రేవంత్ ప్రభుత్వం చేస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కంటే దళారులే ముఖ్యమా అని ప్రశ్నించారు. కోహెడ భూములను స్వాధీనం చేసుకొని అమ్మేసుకుని…కోహెడలో తలపెట్టిన ఫ్రూట్ మార్కెట్ ను ఎక్కడో గుట్టల్లో దిల్ సంస్థ భూముల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.
వివాదాల్లో దిల్ భూములు
దిల్ భూములకు కోహెడ మార్కెట్ తరలింపుతో మార్కెట్ నిర్మాణం జరగకుండా రేవంత్ సర్కార్ పథకం వేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. దిల్ భూముల్లో మాకు వాటా ఉందని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించిందని, హైకోర్టులో కేసు వేసిందని, ఇందులో థర్డ్ పార్టీని అనుమతించవద్దని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. 233 ఎకరాలదిల్ భూముల్లో ఇప్పటికే ఓఆర్ఆర్ కు 33ఎకరాలు పోగా, 25ఎకరాల్లో గుడి ఉందని, అందులో నుంచే రోడ్డు పోతుందని, 4ఎకరాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కేటాయించారని, 40ఎకరాలలో దళితులు సాగు చేసుకుంటున్నారని హరీశ్ రావు వెల్లడించారు. దళితులకు పరిహారం ఇవ్వకుండా అక్కడి భూములను తీసుకోలేరని, పైగా హౌసింగ్ బోర్డు వాళ్లు 1500కోట్లను మార్కెటింగ్ శాఖను అడుగుతున్నారని తెలిపారు.
ప్రోహిబిషన్ లో పెట్టి భూ దందా
కోహెడ పక్కనే రాందాసు పల్లిలో సర్వే నెంబర్ 41లో 1200ఎకరాలను ప్రోహిబిషన్ లో పెట్టి సెటిల్ మెంట్ దందాకు తెరలేపారని.. దీంతో అక్కడి రైతులు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు ధరణి మాటునా భూములను ప్రోహిబిషన్ లో పెట్టామని చెప్పిన రేవంత్ రెడ్డి భూభారతి పేరుతో వాటి నిషేధం తొలగించకుండా రెండున్నరేళ్లుగా ఏం చేస్తున్నాడని…పైగా వారి కన్ను పడిన భూములను ప్రోహిబిషన్ లో పెట్టి సెటిల్ మెంట్లు, కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కోహెడ పండ్ల మార్కెట్ ను కట్టాలని మేం డిమాండ్ చేస్తూ రైతులలో కలిసి పోరాడుతామని, మార్కెట్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొరవ తీసుకోవాలని కోరారు. రెండేళ్లు పాటు పోరాటాల ద్వారా ఈ కోహెడ మార్కెట్ భూములను కాపాడుకుందాం అని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఈ కొహెడ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందాం అని హరీశ్ రావు రైతులకు సూచించారు.
ఇవి కూడా చదవండి :
మందుబాబులపై యుద్దం ఎఫెక్ట్..తెలంగాణలో లిక్కర్ ధరల పెంపు?
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి : కేరళం సీఎం పినరయి స్ట్రాంగ్ కౌంటర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram