KTR’s Invitation | సుస్వాగతం సామ్​ ఆల్ట్​మన్​.. హైదరాబాద్‌ ‘ఓపెన్‌ఏఐ’కి సరైన గమ్యం : కేటీఆర్​

భారత్​లో తాము మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన OpenAI సీఈఓ సామ్​ ఆల్ట్​మన్​ సంకల్పాన్ని మాజీ మంత్రి కేటీఆర్​ స్వాగతించారు. దాన్ని హైదరాబాద్​లో నెలకొల్పాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.

KTR’s Invitation | సుస్వాగతం సామ్​ ఆల్ట్​మన్​.. హైదరాబాద్‌ ‘ఓపెన్‌ఏఐ’కి సరైన గమ్యం : కేటీఆర్​

హైదరాబాద్ : KTR’s Invitation | OpenAI భారత్‌లో తన మొదటి ఆఫీస్‌ ఏర్పాటు చేయనున్నట్లు CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రకటించగానే, హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా పరిశీలించమని మాజీ IT మినిస్టర్‌, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి ముందడుగు వేసిన ఆయన వైఖరి దేశవ్యాప్తంగా అభినందనీయమైంది.

కేటీఆర్ తన లింక్డిన్​ పోస్ట్​లో, “హైదరాబాద్‌ ఓపెన్‌ఏఐకి సరైన గమ్యం. ఈ నగరం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణ కేంద్రంగా నిలిచింది.

ఇక్కడ ఇప్పటికే T-Hub, WE-Hub, T-Works, ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ వంటి వేదికలు పనిచేస్తున్నాయి. అందుకే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్‌కామ్ వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఎంచుకున్నాయి.

ఈ నగరానికి ఉన్న టెక్నాలజీ ప్రతిభ, స్టార్టప్ స్ఫూర్తి దేశంలోనే ప్రత్యేకం. తెలంగాణ గత ప్రభుత్వం ముందుచూపుతో 2020ని ‘AI సంవత్సరం’గా ప్రకటించి, అనేక AI ప్రాజెక్టులను ప్రారంభించింది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెలంగాణను కృత్రిమ మేధ రాజధానిగా నిలిపేందుకు అనేక చర్యలు చేపట్టాయి.

అందుకే హైదరాబాద్ ప్రతిభ, ఆవిష్కరణ, వివిధ రంగాలలో ప్రపంచంతో ఉన్న సంబంధాలు, రాబోయే కృత్రిమ మేధ విప్లవానికి దారి చూపగలదని నేను నమ్ముతున్నాను”. అని ప్రకటించారు.

కేటీఆర్ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా హైలైట్ అయింది. “ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రానికి పెట్టుబడులు  రప్పించడానికి ముందుకు రావడం నిజమైన నాయకత్వం” అని నెటిజన్లు ప్రశంసించారు. “పార్టీల మధ్య విభేదాలు పక్కనబెట్టి, రాష్ట్ర ప్రయోజనాలే ముందు అనే భావనను కేటీఆర్ చూపించారు” అని పలువురు అభిప్రాయపడ్డారు. “తన సందేశంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా కలుపుకుని మాట్లాడటం ఆయన మేధోపరిణితికి నిదర్శనం” అంటూ ఇంకో నెటిజన్​ ప్రశంసించాడు.

హైదరాబాద్‌ టెక్ ఎకోసిస్టమ్‌ ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన నేపథ్యంలో, OpenAI వంటి గ్లోబల్ AI లీడర్‌ను ఆకర్షించేందుకు ప్రతిపక్షంలో నుంచే కేటీఆర్ చేసిన పిలుపు ఆయనలోని తెలంగాణ దృక్కోణానికి సాక్ష్యంగా నిలిచింది. రాజకీయాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించే రాజనీతిజ్ఞుడిగా కేటీఆర్ మరోసారి నిరూపించుకున్నారు.