ఎన్నికల వేళ భారీగా బదిలీలు
ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది

విధాత: ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ లిస్టు భారీగానే ఉన్నది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కీలక అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఒకేసారి నలుగురు కలెక్టర్లను, 13మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేయాలని ఆదేశించింది.
పలువురు నాన్ క్యాడర్ అధికారులను కూడా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. వారి స్థానంలో వారి కిందిస్థాయి అధికారులను నియమించాలని సూచించింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఈసీ ఆదేశించింది. వారితోపాటు రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఆదేశించింది.
ఎన్నికల నేపథ్యంలో ఎక్సయిజ్, కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే కారణంగా తక్షణమే ప్రత్యేకంగా ముఖ్య కార్యదర్శిని నియమించాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకూ ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ నాగరాజులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది.
గురువారం సాయంత్రం 5 గంటల లోపు ప్యానల్ పంపాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అధికార వ్యవస్థపై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఆ ఫిర్యాదులతో పాటు షెడ్యూల్ అనంతరం అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు వీలుగా ఈ బదిలీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. అధికారుల పనితీరుపై సమీక్షించిన ఈసీ.. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం.
అధికార పార్టీతో అంటకాగుతున్న అధికారులను, ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వారిని బదిలీ చేసినట్లుగా కనబడుతున్నది. ముఖ్యంగా బదిలీల ఆదేశాలలో మునుగోడు ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ వంటి వాటిపై అందిన ఫిర్యాదులను ఈసీ ప్రస్తావించడం గమనార్హం. ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఒకేసారి భారీస్థాయి బదిలీలు చేపట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికార బీఆరెస్ తమకు అనుకూలమైన అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆయా అధికారులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించినట్లు భావించాల్సి వస్తోంది. అయితే ఈ బదిలీ వేటు నిర్ణయం కూడా తొలి దశగానే చెబుతున్నారు. మరికొందరు అధికారులపై కూడా ఆరోపణలు ఉన్నందున అవసరమైతే వారిపైనా బదిలీ వేటు పడే అవకాశం లేకపోలేదని చర్చ సాగుతోంది. ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన వారిలో రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డిలు ఉన్నారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌శాఖ సంచాలకులు ముషారఫ్ అలీ బదిలీకి ఆదేశాలు జారీ చేసింది.