CM Revanth Reddy | పవర్ ప్లాంట్ నిర్మాణంలో రూ. 8 వేల కోట్ల కుంభకోణం : సీఎం రేవంత్ రెడ్డి

ఒక్క పవర్ ప్లాంట్ నిర్మాణంలోనే దాదాపు దాదాపు 8వేల కోట్లు కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

CM Revanth Reddy | పవర్ ప్లాంట్ నిర్మాణంలో రూ. 8 వేల కోట్ల కుంభకోణం : సీఎం రేవంత్ రెడ్డి

గంపగుత్తగా బీహెచ్ ఇఎల్ కు కాంట్రాక్ట్
సీవిల్ వర్క్ లన్నీ వాళ్ల బినామీలు, బంధువులకే
బీఆరెస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్
కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లే
ఆగస్ట్ 1,2 తేదీలలో బీఆరెస్ పదేళ్ల పాలపై చర్చకు సిద్దం

విధాత: ఒక్క పవర్ ప్లాంట్ నిర్మాణంలోనే దాదాపు దాదాపు 8వేల కోట్లు కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడూ పవర్ ప్లాంట్స్ కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో వీళ్లు తెలివి ప్రదర్శించి, గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారన్నారు. ఆతరువాత బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వాళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారని ఆరోపించారు. అందులో వేలకోట్ల ఫ్రాడ్ జరిగిందన్నారు.
వేరే రాష్ట్రంలో 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ పిలిస్తే కొరియన్, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయన్నారు. అక్కడ 18శాతం లెస్ కు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకుందన్నారు. తెలంగాణ లో 18శాతం లెస్ కు పనులు చేసే అవకాశం ఉన్నా… ప్రాజెక్టును నామినేషన్ పై బీహెచ్ఈఎల్ కు అప్పగించారని తెలిపారు.

దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్ పై ఆరోపణలు చేశారన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లేనన్నారు. తిన్నింటి వాసాలులేక్కబెట్టే లక్షణాలు మాకు లేవన్నారు. విచారణలో అంతా బయటపడుతుందనే ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు వారు మాట్లాడారన్నారు. ఛత్తీస్ ఘడ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారన్నారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పిందన్నారు. విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను సోమవారం సాయంత్రంలోగా నియమిస్తామని రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు.
విచారణ కమిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా బీఆరెస్ నేతలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చైర్మన్ వైఖరిని కారణంగా చూపుతూ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారని, కానీ కమిషన్ ను రద్దు చేయడం కుదరదు, చైర్మన్ పై అభ్యంతరం ఉంటే చైర్మన్ ను మార్చాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. కోర్టు కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిందని రేవంత్ తెలిపారు.

తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లుగా బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారని, వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు, సంబంధిత ఆస్తులు ఏ ప్రాంతంలో ఉంటే అవి ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని, కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని తెలిపారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు జైపాల్ రెడ్డి తెలంగాణకు ఇప్పించారన్నారు.
జైపాల్ రెడ్డి కృషితోనే తెలంగాణకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఆనాడు 53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని సభకు తెలిపారు. అయితే ఈ వాస్తవాలు దాచి పెట్టి ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయండిఅని రేవంత్ అడిగారు. ఆనాడు నేను సభలో మాట్లాడితే మార్షల్స్ తో నన్ను సభ నుంచి బయటకు పంపించారన్నారు.
బీఆరెస్ నేతలు సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు కానీ అవి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని రేవంత్ తెలిపారు. వీళ్ల ఏలుబడిలో సోలార్ పవర్ కేవలం ఒక మెగావాట్ మాత్రమేనన్నారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదన్నారు. వీళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి అని అన్నారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టును 2015 లో రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టి, 2017 లో ప్రాజెక్టును పూర్తి చేస్తామచి చెప్పి 2022లో పూర్తి చేశారని రేవంత్ అన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.10,515 కోట్లకు పెంచారన్నారు. దీంతో భద్రాద్రి ద్వారా ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ.9కోట్ల73లక్షలు పడుతోందన్నారు. 25వేల కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి,2020లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు కానీ 2024 వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలిపారు. కానీ అంచనా వ్యయం రూ.34,548 కి పెరిగింది, ఇది భవిష్యత్ లో రూ.40వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపు 10వేల కోట్లు యాదాద్రిలో అంచనాలు పెంచారని, అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయని రేవంత్ ప్రశ్నించారు. ఎన్టీపీసీ ద్వారా పవర్ మెగావాట్ ఉత్పత్తికి రూ. 7కోట్ల 38లక్షలు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా మెగావాట్ ఉత్పత్తికి 8కోట్ల 64 లక్షలు అవుతోందన్నారు. వీళ్లు ఎన్టీపీసీకి ధోఖా చేస్తే… ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతించింది కాంగ్రెస్ పార్టీ అని, కావాలంటే రికార్డులు సభ ముందు పెడతామన్నారు.
2015 లో వాళ్లు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు 2023 లో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను సాకుగా చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభను, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది మీరా మా గురించి మాట్లాడేదని రేవంత్ బీఆరెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు తాను అసెంబ్లీలో మాట్లాడానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పై తాను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో… కేసీఆర్ పార్లమెంట్ లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయండి అని అడిగారు. ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది వీళ్లని బీఆరెస్ నేతల నుద్దేశించి అన్నారు.

జర్నలిస్ట్ పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు… వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆమె చానల్ ను గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారన్నారు. ఆనాడు జైల్లో పెట్టినా తాను భయపడలేదన్నారు. అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని, విద్యుత్ పై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రేవంత్ హితవు పలికారు. ఆగస్టు 1, 2న బీఆరెస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దని ప్రకటించారు. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతానని రేవంత్ అన్నారు.