కాళేశ్వరంతో పండించింది లక్షల టన్నుల వరి కాదు..కనీవినీ ఎరుగని వేల కోట్ల అవినీతి!
అద్భుతమన్నారు! అపురూపమన్నారు! నదిని ఎత్తిపోశామని గొప్పలకు పోయారు! కేసీఆర్ తన మెదడు కరగదీసి డిజైన్ చేసినట్టు గర్వంగా

- నాలుగేళ్లలో ఎత్తిపోసింది 163 టీఎంసీల నీళ్లే
- కానీ.. రాష్ట్రమంతటా కాళేశ్వరం నీళ్లేనని గొప్పలు
- పండిన ప్రతి పంట కాళేశ్వరం ఖాతాలోకే!
విధాత, హైదరాబాద్: అద్భుతమన్నారు! అపురూపమన్నారు! నదిని ఎత్తిపోశామని గొప్పలకు పోయారు! కేసీఆర్ తన మెదడు కరగదీసి డిజైన్ చేసినట్టు గర్వంగా ప్రకటించారు! గంగమ్మ కొండకెగసిందన్నారు! పల్లం తెలిసిన నీళ్లు ఎదురెక్కాయని చెప్పారు. ప్రతి కాల్వలోనూ పారింది కాళేశ్వర గంగేనన్నారు! ఆఖరుకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ పొలంలోకి సాగు నీరు పారినా.. ఏ రిజర్వాయర్‌లోకి నీళ్లు ఎగిసిపడినా.. వాన పడిన నీళ్లయినా.. వాగు పొంగిన నీళ్లయినా.. అది ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాల కాళేశ్వర గంగేనని నమ్మించారు! ఆ నీళ్లతోనే లక్షల టన్నుల వరి పండిందన్నారు! నిజానికి కాళేశ్వరంతో పండించింది వరి కాదు.. కనీ వినీ ఎరుగని రీతిలో వేల కోట్ల అవినీతిని!! మరి నీళ్లపారించలేదా? అంటే పారించారు! నాలుగేళ్లలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా ఎత్తిపోసిన నీరు 163 టీఎంసీలు. అందులో కూడా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు గత నాలుగేళ్లలో ఎత్తిపోసిన నీళ్లు అక్షరాలా 130 టీఎంసీలు! ఈ నీళ్లతో ఎన్ని కోట్ల ఎకరాలు పండించవచ్చో 80 వేల పుస్తకాలు చదివిన వారే చెప్పాలి! ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటినే ఎత్తిపోసుకునే అవకాశం కానీ, అవసరం కానీ లేకపోయినా.. ఆగమేఘాల మీద మూడో టీఎంసీని ఎత్తిపోసే పని మొదలు పెట్టారు. నిజానికి పండిన పంటకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎటువంటి సంబంధం లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీనికంటే తుమ్మడిహట్టి వద్ద బరాజ్ కట్టి మిడ్‌మానేరుకు నీటిని తరలించి ఉంటే.. ఇంత ఖర్చు కూడా అయి ఉండేది కాదని అంటున్నారు. కానీ.. వేల కోట్ల అవినీతికి పాల్పడేందుకు వీలుగానే ఈ కట్టడాన్ని చేపట్టారని పరిశీలకులు చెబుతున్నారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు నాణ్యతపై చూపకపోవడంతో అదికూడా కుంగిపోయిందని చెబుతున్నారు. మొత్తంగా భారీ అవినీతి జరిగిందే తప్ప.. ఒరిగిందేమీ లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అబద్ధాలతో వాస్తవాలను మసకబార్చారని మండిపడ్డారు.
ఎత్తిందెంత.. పోసిదెంత?
నాటి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు 163 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలో ఎత్తి పోశారు. ఇందులో 2019-20లో 53 టీఎంసీలు, 2020-21లో 48 టీఎంసీలు, 2021-22లో 32 టీఎంసీలు ఎత్తి పోశారు. 2022 ఏప్రిల్లో 3 టీఎంసీలు, 2023లో 26 టీఎంసీలు గోదావరి నుంచి లిఫ్టు చేశారు. అంటే మొత్తం 163 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. ఇందులో 130 టీఎంసీల నీటిని మాత్రమే మిడ్‌మానేరుకు తరలించారు. ఎత్తి పోసిన నీళ్ళల్లో కూడా 26 టీఎంసీల వరకు కిందకు వదిలి పెట్టాల్సి వచ్చింది. ఇక ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి వదిలినవి చూస్తే.. 2019లో 63 టీఎంసీలు, 2020లో 189 టీఎంసీలు, 2021లో 472 టీఎంసీలు, 2022 జూన్ 30 వరకు 440 టీఎంసీలు, 2023లో సుమారు 400 టిఎంసీలు.. మొత్తం మొత్తం 1165 టీఎంసీలు వదిలేశారు. మరోవైపు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ప్రతిపాదిస్తే.. సృష్టించింది మాత్రం 1,62,144 ఎకరాలు మాత్రమే!
పండిన పంటలకు కాళేశ్వరానికి సంబంధం లేదు: కోదండరాం
రాష్ట్రంలో నాటి బీఆరెస్ ప్రభుత్వం చెప్పినట్టు పండిన పంటలకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తేల్చి చెప్పారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ ప్రాజెక్ట్ సరిగ్గా నాలుగేళ్లకే కుంగిందని అన్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగిన తరువాత కేంద్రం నుంచి వచ్చి పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే మూడు రకాల లోపాలను చూపించారని కోదండరాం తెలిపారు. 1)కాళేశ్వరం డిజైన్‌లో లోపాలున్నాయి. 2)నిర్మాణంలో లోపాలున్నాయి. 3)నాణ్యత పాటించలేదు.. అంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చిందన్నారు. కాళేశ్వరం కుంగిపోయిందని, దీనికి మరమ్మత్తులు చేయడం కరెక్ట్ కాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. నిపుణుల కమిటీ వేసి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ నిర్మించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని కోదండరాం స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పండిన పంటలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నాలుగేళ్లలో సుమారు 160 టీఎంసీలు ఎత్తి పోసి, అవే నీటిని కిందకు వదిలారని, అలాంటప్పుడు కాళేశ్వరం నీటితో ఎలా పంటలు పడించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని, ఎండిన బోర్లలోకి నీళ్లు కూడా వచ్చాయని, దీంతో పంటలు పండాయన్నారు. Bangladesh ప్రాజెక్ట్‌కు కాలువలే తవ్వనప్పుడు ఆయకట్టు ఎక్కడిదని, కాలువలు లేకుండా పంటలకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తరవాతనే నిర్ణయం తీసుకోవాలన్న కోదండరాం, దీనిని వదిలేసి తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ముందే తుమ్మిడిహట్టి దగ్గర కట్టి, మిడ్ మానేరుకు నీళ్లు తీసుకు వచ్చి ఉంటే ఇంత ఖర్చు అయ్యేది కాదన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద ఒక్కటి కట్టకుండా కింద మూడు కట్టుకున్నారని, వాటిలోనూ ఎక్కడా ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. దీనిని పరిశీలించిన వివిధ ఇంజినీర్లు చెపుతున్న ప్రకారమే సులువుగా రూ.20 వేల కోట్లు దుర్వినియోగం అయి ఉంటుందని కోదండరాం చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద అయితే ఇంత ఖర్చు కాకపోయేదని అన్నారు.