Komatireddy Venkat Reddy| కొత్త రచ్చ.. వెంకన్న డమ్మీ మంత్రియేనా…?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ఆర్భాటంగా నిర్వహించిన గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. నగరంలో ఉండి కూడా మంత్రి వెంకట్ రెడ్డి గద్దర్ అవార్డుల పంక్షన్ కు దూరంగా ఉండటం వెనుక మతలబు ఏమిటన్నదానిపై రకరకాల చర్చోపచర్చలు సాగుతున్నాయి. తన శాఖ అవార్డుల ఫంక్షన్ కు వెంకట్ రెడ్డి దూరంగా ఉండటంతో ...ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనను డమ్మీ మంత్రిగా పేర్కొంటూ ట్రోల్స్ కొనసాగుతున్నాయి.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ఆర్భాటంగా నిర్వహించిన గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. నగరంలో ఉండి కూడా మంత్రి వెంకట్ రెడ్డి గద్దర్ అవార్డుల పంక్షన్ కు దూరంగా ఉండటం వెనుక మతలబు ఏమిటన్నదానిపై రకరకాల చర్చోపచర్చలు సాగుతున్నాయి. తన శాఖలో ఓ మంత్రి, ఓ కాంగ్రెస్ నేత అతి జోక్యం నచ్చక వెంకట్ రెడ్డి అవార్డుల ఫంక్షన్ కు దూరంగా ఉన్నారన్న వాదన వినిపిస్తుండగా…శాఖ మంత్రిగా ఉన్న తనను ముఖ్యఅతిధిగా కాకుండా.. విశిష్ట అతిధిగా ఆహ్వానించడం నచ్చకే దూరంగా ఉన్నారని మరో వాదన వినిపిస్తుంది. కారణం ఏదైనా తన శాఖ అవార్డుల ఫంక్షన్ కు వెంకట్ రెడ్డి దూరంగా ఉండటంతో …ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనను డమ్మీ మంత్రిగా పేర్కొంటూ ట్రోల్స్ కొనసాగుతున్నాయి.
సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పూర్తిగా డమ్మీని చేసి, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో అనుమతులపై నిర్ణయాలు జరిగిపోవడమే ఇందుకు నిదర్శనమన్న వాదన వినిపిస్తుంది.
టికెట్ల ధరల పెంపు వివాదంతో శాఖపై కోల్పోయిన పట్టు
గతంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివాదంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చేసిన వ్యాఖ్యలు ఆ శాఖపై ఆయనకు ఎంతపట్టు ఉందన్న వైనాన్ని చాటాయి. తనకు తెలియకుండా సినిమా టికెట్ల ధరల పెంపు జరిగిందని..అసలు ధరల పెంపు జీవో ఎవరిచ్చారో నాకు తెలియదని చెప్పిన వెంకట్ రెడ్డి..మరుసటి రోజు టికెట్ల పెంపు ఇదే చివరి సారి అని.. టికెట్ల ధరలు పెంచాలంటూ మరోసారి సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎవరూ తన వద్దకు రావద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా తన ప్రమేయం లేకుండానే పలు సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం కొనసాగుతునే ఉంది. అదిగాక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్బంగా సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి లేకుండానే జరిగిన సినీ కార్మికుల సమావేశంలో రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల పెంపు, సినీ కార్మికులకు అందులో పర్సంటెజీలకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడం..ఆయన ప్రతిష్టను అప్పట్లో మరింత బలహీనపరిచింది.
అప్పుడు కూడా సినిమాటోగ్రఫీ డమ్మీ మంత్రిగా వెంకట్ రెడ్డిపై ట్రోల్స్ వచ్చాయి. సినిమాటోగ్రఫీ శాఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ, తెరవెనుక కేబినెట్ ర్యాంకుతో ఉన్న ఓ కాంగ్రెస్ నేత ‘షాడో మంత్రి’గా పెత్తనం చలాయిస్తున్నారన్న ప్రచారం సినీ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కొనసాగింది. షోడో నీడలోనే సినీ ఇండస్ట్రీ నిర్ణయాలు, టికెట్ల పెంపు, బెన్ ఫిట్ షోల అనుమతులు వెలువడుతున్నాయన్న చర్చ బలంగా వినిపిస్తునే ఉంది.
గద్దర్ అవార్డుల కమిటీ సైతం డిప్యూటీ సీఎంతోనే భేటీలు
తెలంగాణ గద్దర్ సినీ అవార్డులకు సంబంధించిన కమిటీ, ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాత్రమే సమావేశాలు కొనసాగించడం..సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో దీనిపై పెద్దగా సంప్రదింపులు కొనసాగించకపోవడం కూడా కనిపించింది. ఈ పరిణామాలన్ని కూడా సినీ పరిశ్రమవర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రిగా వెంకట్ రెడ్డిని పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదనడానికి నిదర్శనంగా నిలిచాయి. ఇదే క్రమంలో ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ జరిగిపోయింది. అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావులు మాత్రమే హాజరుకావడం..వెంకట్ రెడ్డి గైర్హాజర్ కావడం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు సినిమాటోగ్రఫి మంత్రిత్వ శాఖలోనే తన పట్టు కోల్పోయారన్న ప్రచారంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న వెంకట్ రెడ్డికి తన పరిధిలోని ఆర్ ఆండ్ బీ శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాకు మంజూరు కాబడిన నిధుల సమాచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించడం ఆయన ప్రతిష్టను మరితం పలచన చేసినట్లయ్యింది.
హ్యామ్ రోడ్ల స్కామ్ ఆరోపణలతో చిక్కుల్లో వెంకట్ రెడ్డి
సొంత మంత్రిత్వశాఖలపై సరైన ఆధిపత్యాన్ని చాటుకోలేక ఎదురవుతున్న అవమానాలకు తోడు.. కొత్తగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం వెంకట్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆయనను మరింత ఇరకాటంలో పడేసింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు తాజాగా ఆర్ అండ్ బీ శాఖలో రూ.18వేల కోట్ల హ్యామ్ రోడ్ల కుంభకోణం జరిగిందని ఆరోపించడం సంచలనం రేపింది. 10శాతం ఎక్సెస్ టెండర్లతో హ్యామ్ రోడ్ల పనుల్లో భారీగా కమిషన్లు దండుకున్నారంటూ హరీశ్ రావు ఆరోపించడం వెంకట్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేదిగా మారింది. హరీశ్ రావు ఆరోపణలను వెంకట్ రెడ్డి త్రోసిపుచ్చినప్పటికి నిప్పు లేనిదే పొగ రాదంటూ ఆయన ప్రత్యర్థులు సన్నాయి నొక్కులు వినిపిస్తున్నారు. ఈ వివాదాలు ఇలా ఉండగానే పీసీసీ చీఫ్ గా టి.జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100సీట్లు వస్తాయంటూ వెంకట్ రెడ్డి మరో వివాదం రేపారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు బీసీయైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత పున్న కైలాష్ ను కూడా ఆయన పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం అంటూ విమర్శలు రేగుతున్నాయి.
నాడు సీఎం పోటీదారు..నేడు మంత్రి పదవి కాపాడుకోవడంలో తంటాలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమనాయకుడిగా ఉన్న ఇమేజ్ తో పాటు ముక్కుసూటి వైఖరితో వెంకట్ రెడ్డి ఓ దశలో పార్టీ సీనియర్లతో పాటు రేవంత్ రెడ్డికి సైతం ప్రధాన పోటీదారుగా నిలిచారు. అప్పట్లో పీసీసీ చీఫ్ పదవి కావాలని, సీఎం పదవి రేసులో సైతం ఉన్నానంటూ ప్రకటించుకున్న వెంకట్ రెడ్డి ఇప్పుడు..తన మంత్రి పదవి నిర్వహణలోనే డిఫెన్స్ లో పడిపోతుండటం విడ్డూరం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన రాజకీయ శైలికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడమే వెంకట్ రెడ్డిని రాజకీయంగా బలహీనం చేసిందన్న వ్యాఖ్యలు సొంత అనుచర వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
తప్పించేందుకు తగ్గిస్తున్నారా..?
మరోవైపు వెంకట్ రెడ్డిని రానున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కేబినెట్ నుంచి తప్పించవచ్చని..ఆయన స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తారని..అందుకే ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్నారన్న వాదన సైతం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన శాఖలలో ఇతరుల జోక్యం పెరిగిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రిగా ఉండి కూడా వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనదైన ప్రత్యేక ముద్రను..ప్రభావాన్ని చూపించలేకపోతున్నారన్న అభిప్రాయాలు ఆయన వర్గీయుల్లోనే వ్యక్తమవుతుండటం ఆసక్తికరం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram