Green Leadership Award 2025 | హైదరాబాద్‌ను హరితమయం చేసిన కేటీఆర్‌కు 2025 గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు
తెలంగాణలో పట్టణ హరితీకరణ, పర్యావరణ మార్పులపై నాయకత్వం కారణంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు న్యూయార్క్‌లో “గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025” దక్కనుంది. GHMC 977 పార్కులు, 108 లంగ్ స్పేసులు వంటి కార్యక్రమాలు గుర్తింపు పొందాయి.

హైదరాబాద్/న్యూయార్క్:
Green Leadership Award 2025 | తెలంగాణలో స్థిరమైన పాలన, పట్టణ హరితీకరణకు నేతృత్వం వహించినందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి K.T. రామారావు (KTR)కు ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’ దక్కింది. ఈ అవార్డును సెప్టెంబర్ 24న న్యూయార్క్ సిటీలో జరిగే 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ వేదికగా గ్రీన్ మెంటర్స్ సంస్థ అందజేయనుంది. అధికారిక లేఖలో “ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవం” అని నిర్వాహకులు తెలిపారు.
పార్కులు, లంగ్ స్పేస్‌లతో హైదరాబాద్‌కు పచ్చ తోరణం
పట్టణాభివృద్ధి – మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతల్లో ఉండగా KTR ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 977 పార్కులు అభివృద్ధి చేసింది. నగరంలో 108 లంగ్ స్పేసులు/థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, వెర్టికల్ గార్డెన్స్, కాలనీల్లో–వీధుల్లో–మీడియన్‌లపై విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం ద్వారా హరిత వ్యాప్తి పెరిగింది. తెలంగాణ గ్రీన్ కవర్ 24% నుంచి 33% పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ World Green Cities Award గెలుచుకుంది; FAO–Arbor Day Foundation సంయుక్తంగా ఇచ్చే Tree City of the World గుర్తింపును అందుకున్న ఏకైక భారత నగరంగా నిలిచింది.
అవార్డు ప్రదానోత్సవంలో స్థిర పట్టణాభివృద్ధి, స్కూల్–కమ్యూనిటీ పర్యావరణ కార్యక్రమాలు, వాలంటీర్ భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. KTR ఈ వేడుకలో పాల్గొని, తెలంగాణలో అమలైన హరిత ప్రాజెక్టులపై అనుభవాలను పంచుకునే అవకాశముంది.