KWDT-II  । కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలను కొత్తగా తేల్చాలి.. : ట్రిబ్యునల్‌ ముందు వైద్యనాథన్‌ వాదనలు

ప్రస్తుతం లోపలి బేసిన్ కేటాయింపు కోసం ఒక చుక్క నీటిని ఏపీ కోరడం లేదని, అన్నీ బయట బేసిన్ కేటాయింపు కోసమేనని తెలిపారు. తెలంగాణ మాత్రం లోపలి బేసిన్ ప్రాజెక్టులకు మాత్రమే నీటిని అడుగుతోందని తెలంగాణ న్యాయవాది వివరించారు. కరువు పీడిత ప్రాంతాల్లో ఒక పంటకు మాత్రమే నీటిని అడుగుతున్నామని, కొత్త ప్రాంతాల్లో తడి పంటలకు కాదని తెలిపారు.

KWDT-II  । కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలను కొత్తగా తేల్చాలి.. :  ట్రిబ్యునల్‌ ముందు వైద్యనాథన్‌ వాదనలు

KWDT-II  । తెలంగాణ నీటి వాటాల విభజనకు కొత్త ఏర్పాటును చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ ముందుకు వాదనలు వినిపించింది. తెలంగాణలో తలసరి నీటి లభ్యత సంవత్సరానికి వ్యక్తికి 422 క్యూబిక్‌ మీటర్లు మాత్రమేనని, ఇదే జాతీయ సగటు, లేదా ఏపీ సగటు చాలా ఎక్కువగా ఉన్నదని తెలిపింది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌ 2లో తుది వాదనలు మార్చి 24, 2025న ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 26 తేదీ వరకూ కొనసాగనున్నాయి. జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌, జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌ తలపాత్ర ట్రిబ్యునల్‌ ఎదుట తెలంగాణ వాదనలను సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్‌కు సూచించిన తదుపరి నిబంధనల పరిధికి సంబంధించిన వివరణతో తన వాదనలను న్యాయవాది ప్రారంభించారు.

ఏపీ, తెలంగాణ మధ్య ఎటువంటి పరస్పర విభజన లేనందున, ఈ ట్రిబ్యునల్ నీటి వాటాల విభజన చేయడానికి ఉద్దేశించిందని సీనియర్ న్యాయవాది వాదించారు. కేడబ్ల్యూడీటీ-1 ఇరు రాష్ట్రాలు విస్తృతంగా అంగీకరించిన కేటాయింపులను చేసిందని, కేడబ్ల్యూడీటీ-2 మాత్రం బేసిన్‌లో ఉన్న అదనపు నీటిని కేడబ్ల్యూడీటీ 1 కేటాయించిన దానికంటే అధికంగా కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్గత ఏర్పాటును కొనసాగించాలని ఏపీ కోరుకుంటోందని, అవి ఏపీకి అనుకూలంగా మారినందున తెలంగాణ ప్రభుత్వం నీటి విభజనకు కొత్త ఏర్పాటును కోరుతున్నదని వెల్లడించారు. నీటి పంపిణీపై జాతీయ, అంతర్జాతీయంగా ఆమోదించిన పాలనాపరమైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా కేటాయింపులు జరపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయని, వాటి ద్వారా వాటి అవసరాలకు తగిన నీరు లభిస్తుందని తెలిపారు. కానీ.. లోటు ఉన్న తెలంగాణ కృష్ణా బేసిన్‌లో అనేక కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నీటి కోసం ఇక్కడి రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బేసిన్‌ వెలుపలకు నీటిని ఏపీ మళ్లించడం తగదని స్పష్టం చేశారు.

పూర్వ ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ఏర్పాటు కింద ఏపీ దాదాపు 330 టీఎంసీలను పెన్నా బేసిన్‌ తదితరాలకు మళ్లిస్తున్నదని చెప్పారు. అక్కడ ఇప్పటికే 344 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, ట్రిబ్యునల్‌లో ఏపీ సమర్పించిన వివరాల ప్రకారం ఇప్పటికే 360 TMC నిల్వలు అందుబాటులో ఉన్నాయని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం నుండి పెన్నా బేసిన్ (బనకచెర్ల)కు గోదావరి జలాల మళ్లింపు తదితరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం లోపలి బేసిన్ కేటాయింపు కోసం ఒక చుక్క నీటిని ఏపీ కోరడం లేదని, అన్నీ బయట బేసిన్ కేటాయింపు కోసమేనని తెలిపారు. తెలంగాణ మాత్రం లోపలి బేసిన్ ప్రాజెక్టులకు మాత్రమే నీటిని అడుగుతోందని తెలంగాణ న్యాయవాది వివరించారు. కరువు పీడిత ప్రాంతాల్లో ఒక పంటకు మాత్రమే నీటిని అడుగుతున్నామని, కొత్త ప్రాంతాల్లో తడి పంటలకు కాదని తెలిపారు. ఈ విచారణకు తెలంగాణ నుంచి వైద్యనాథన్‌తోపాటు.. ఇతర న్యాయవాదులు, అంతర్రాష్ట్ర జలవనరుల యూనిట్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జయదీప్ గుప్తా, ఇతర న్యాయవాదులు, ఇంజినీర్లు హాజరయ్యారు.