కబ్జాల పర్వంలో ఆరితేరిన అధికార పార్టీ నేతలు: MCPI(U) నేత‌లు

హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు పేదల స్వాధీనంలోని ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలి టెక్స్టైల్ పార్క్ కింద భూములు కోల్పోయిన రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి ముగిసిన ఎంసిపిఐ(యు) పాదయాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూకబ్జాలలో అధికార పార్టీ నాయకులు ఆరితేరారని ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక […]

కబ్జాల పర్వంలో ఆరితేరిన అధికార పార్టీ నేతలు: MCPI(U) నేత‌లు
  • హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
  • పేదల స్వాధీనంలోని ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలి
  • టెక్స్టైల్ పార్క్ కింద భూములు కోల్పోయిన రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
  • ముగిసిన ఎంసిపిఐ(యు) పాదయాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూకబ్జాలలో అధికార పార్టీ నాయకులు ఆరితేరారని ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు లేదని విమర్శించారు.

ఈరోజు వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికై గత ఎన్నికల హామీల అమలు కోసం ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. వెంకట్రామ టాకీస్, కాశిబుగ్గ, పోచం మైదాన్, ఎంజీఎం మీదుగా కలెక్టరేట్ వరకు పాద‌యాత్ర నిర్వహించారు.

ప్రకటనలకే కలెక్టరేట్‌ పరిమితం

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అజంజాహి మిల్లులో పలుమార్లు ప్రకటనలు గుప్పిస్తూ నేటికీ తట్టెడు మట్టి కూడా తీయకపోవడం సిగ్గుచేటని విమ‌ర్శించారు. ఈ సందర్భంగా కాశిబుగ్గ సెంటర్లో నగర కార్యదర్శి కామ్రేడ్ గడ్డం నాగార్జున అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. పేరుకు వరంగల్ జిల్లా అని ప్రకటించినా అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలు హనుమకొండ జిల్లాలో ఉండడం శోచనీయం అన్నారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రణాళికలు లేకపోవడం సరికాదన్నారు. వరంగల్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ పట్టాలిస్తామని ప్రకటించినా జరిగింది శూన్యమన్నారు.

మెగా టెక్స్టైల్ పార్క్ కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ఎత్తివేసి ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇస్తామని చెప్పడం ఎన్నికల కోసమే అన్నారు. పోడు రైతులకు హ‌క్కుపత్రాలు అందని ద్రాక్ష గానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలని వారు డిమాండ్ చేశారు.

ప్రజా పోరాటాలను మరింత ఉధృతపరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సాధించేందుకు ఎంసిపిఐ(యు) శక్తివంచన లేక పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాఘసుధ, కనకం సంధ్య, జిల్లా నాయకులు కందికొండ కుమారస్వామి, ఎండి ఇస్మాయిల్, అప్పనపురి నర్సయ్య, మాలి ప్రభాకర్, గుగులోత్ అరుణ్ నాయక్, గూడ సురేష్, మార్త నాగరాజు, బైరి మణమ్మ, వంశీ, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.