బీఆర్ఎస్ పార్టీకే మాల సంఘాల జేఏసీ మద్దతు

బీఆర్ఎస్ పార్టీకే మాల సంఘాల జేఏసీ మద్దతు

– మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డిని గెలిపించండి

– తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ రామచందర్

విధాత, మెదక్ ప్రత్యేకప్రతినిధి: రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కారిస్తామన్న బీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు రామచందర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైన ఉన్నది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం శుభసూచికంగా భావిస్తున్నామని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా దళితులు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందడానికి అద్భుతంగా ఉన్నదని, ఎలాంటి పూచీకత్తు లేకుండా దళితబంధు ఇస్తున్నారని తెలిపారు.


రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. మెదక్ లో పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో తాలూకా వైస్ చైర్మన్ అనిల్, కన్వీనర్ నల్లాల కనకరాజు, కో కన్వీనర్ జీ యాదవ్, జిల్లా నాయకులు సుధాకర్, లక్ష్మణ్, కంబాల పోచయ్య, ఇసాక్, నాగేష్, రాము షా, రాజు పాల్గొన్నారు.