TELANGANA | నా కూతురు హత్యపై విచారణ జరిపించాలి..మావోయిస్టు రాధ తల్లి పోచమ్మ డిమాండ్
నా కూతురు నీల్సో(రాధ) హత్యపై అనేక సందేహాలున్నాయని, ఆమెను పోలీసులు చంపారా మావోయిస్టులు చంపారా తేల్చేందుకు ప్రభుత్వం విచారణ జరిపించాలని తల్లి పోచమ్మ డిమాండ్ చేశారు.

విధాత, హైదరాబాద్ : నా కూతురు నీల్సో(రాధ) హత్యపై అనేక సందేహాలున్నాయని, ఆమెను పోలీసులు చంపారా మావోయిస్టులు చంపారా తేల్చేందుకు ప్రభుత్వం విచారణ జరిపించాలని తల్లి పోచమ్మ డిమాండ్ చేశారు. రాధను కోవర్టుగా ఆరోపిస్తూ అందుకే ఆమెను చంపేశామంటూ మావోయిస్టు పేరిట వెలువడిన ప్రకటనపై అనుమానాలున్నాయన్నారు. రాధ కోవర్టు కాదని, ఆమె పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి మా కుటుంబానికి లక్షల రూపాయలు పంపించారన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, తమకు ఒక్క రూపాయి కూడా పంపలేదని స్పష్టం చేశారు. నా కూతురు ఏడేళ్ల క్రితం ఇళ్లు వదిలి పోయిందని, తిరిగి శవమై ఇంటికి చేరిందన్నారు. మధ్యలో ఆమె నుంచి మాకు ఎలాంటి సమాచారం, ఫోన్ లేదన్నారు. మీ కూతురు ఇంటికి వస్తుందని మూడు రోజుల క్రితం పోలీసులు మాకు చెప్పారని, ఇప్పుడు రాధ శవాన్ని అప్పగించారని, నా కొడుకు, కూతురు ఇన్ ఫార్మర్లు కాదని పోచమ్మ వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కొడుకు సూర్యప్రకాశ్ తమతోనే ఉన్నారన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగుచూసిన మావోయిస్టు రాధ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. రాధ తల్లి పోచమ్మ సహా కుటుంబ సభ్యులు ఆమె హత్యతో తీవ్ర విషాదంలో మునిగారు. కోవర్టుగా మారి పార్టీ నాయకత్వంపై దాడికి పోలీసులకు సహరించేందుకు సిద్ధపడినందునే రాధను ప్రజాభిప్రాయం మేరకు శిక్షించామని మావోయిస్టు ఏవోబీ కార్యదర్శి గణేశ్ పేరిట లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖ పోలీసుల సృష్టియేనని, తన కూతురును ఎవరో చంపారో ఎందుకు చంపారో ప్రభుత్వం తేల్చాలని తల్లి పోచమ్మ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాధ వ్యవహారం విప్లవ సంఘాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.