ప్రతి వాగ్దానాన్నీ నిజం చేశాం: మంత్రి జగదీశ్ రెడ్డి

- తుంగతుర్తిలో ప్రశాంత వాతావరణం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: చెప్పిన ప్రతి మాటను, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిజం చేసిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తరపున సోమవారం మంత్రి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అంతకుముందు అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో కిషోర్ కుమార్ కు బీ ఫారంను అందజేశారు. అనంతరం శంఖం పూరించి ప్రచార పర్వానికి తెరలేపారు. అర్వపల్లిలో తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
రేషన్ ద్వారా అందరికీ సన్నబియ్యం, సబ్సిడీ ద్వారా 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయాలు కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. 2014 ముందు కక్ష్యలు, కార్పణ్యాలతో రక్తమోడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే అన్నారు. కిషోర్ హయాంలో నియోజకవర్గం సస్యశ్యామలం అయిందన్నారు. పారిశ్రామిక హబ్ ను నెలకొల్పి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం అన్నారు. కిషోర్ ను మరోసారి ఆశీర్వదించి, తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సంపదను పెంచుతాం.. ప్రజలకు పంచుతాం!
విధాత, సూర్యాపేట: సంపదను పెంచి, ప్రజలకు పంచాలన్నదే కేసీఆర్ నినాదం అని సూర్యాపేట శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర టౌన్ షిప్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. 2014కు ముందు, 2014 నుంచి ఈ రోజు వరకు సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే సూర్యాపేట అగ్రస్థానంలో ఉందన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెడికల్ కాలేజ్, మహా ప్రస్థానం, ట్యాంక్బండ్ వంటి నిర్మాణాలు సూర్యాపేటకే తలమానికంగా మారాయన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అన్న మంత్రి, దీని ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఇటీవల వచ్చిన ఐటీ పరిశ్రమను కూడా రాబోయే రోజుల్లో 5000 మందికి విస్తరిస్తానని తెలిపారు. ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ప్రజలంతా సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.