Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 240 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport )లో రూ. 240 కోట్ల విలువ చేసే బంగారం( Gold ) పట్టుబడింది. అంటే 413 కిలోల బంగారం అన్నమాట. అయితే ఇదేదో ఒక్క రోజులోనే పట్టుబడింది అనుకుంటే పొరపాటే.

Shamshabad Airport | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రతి రోజు బంగారం పట్టుబడుతూనే ఉంటుంది. విదేశాల నుంచి నగరానికి వచ్చే కొంతమంది ప్రయాణికులు బంగారం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అయితే గత ఆరేండ్ల కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 240 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు ఇటీవలే తెలిపింది.
ఈ నెల 19న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గత ఆరేండ్ల నుంచి ఇప్పటి వరకు 413 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దీని విలువ రూ. 240 కోట్లు అని స్పష్టం చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు.
ఆరేండ్లలో రూ. 5975 కోట్ల విలువ చేసే బంగారం స్మగ్లింగ్
జాతీయ స్థాయిలో 2019 నుంచి 2025 వరకు 10,619 కిలోల బంగారం పట్టుబడిందని, దీని విలువ రూ. 5975 కోట్లు ఉంటుందని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఆరేండ్ల కాలంలో అక్రమంగా బంగారం తరలిస్తూ 5,689 మంది అరెస్టు అయ్యారని తెలిపారు. ఇందులో 16 మందికి జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.