జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

విధాత,హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా భారీ వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా విపత్తుల నిర్వహణా శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయితీరాజ్, రహదారులు, పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్ధితి గురించి ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తున్న హనుమకొండ, వరంగల్ , జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ విభాగం నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాజీవనానికి ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం లేకుండా చేయాలని అధికారులను మంత్రి గారు ఆదేశించారు.