ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: మంత్రి పొన్నం

వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్: వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల వర్షా కాలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు ,సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్ , విద్యుత్ , ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సెలవులు రద్దు చేసుకోవాలన్నారు. సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థత చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ఉమ్మడిగా, కలసికట్టుగా కదలాలని చెప్పారు. వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ తాను ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏమైనా జోక్యం అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని మంత్రి తెలిపారు. వ్యర్థాలను చెరువులు, నాలాల్లో వేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.

వర్షాకాలంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన మాన్సూన్ సంబంధిత పనులు, రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్‌వర్క్స్, డీ –సీలింగ్, రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు, క్యాచ్‌పిట్ పనులు, హైడ్రా సమన్వయంతో చేపడుతున్న పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మంత్రికి వివరించారు. సీవరేజ్, స్టార్మ్ వాటర్ కలిసే ప్రదేశాలను గుర్తించి వాటిని వేరు చేసే ఓవర్ ఫ్లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంత్రి కి తెలిపారు.