Uttam Kumar Reddy | ఏటా 6లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తమ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం 6 నుంచి 6.30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ముందుకెలుతున్నామని, ఇందుకోసం ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించామని రాష్ట్ర ఇరిగేషన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు

Uttam Kumar Reddy | ఏటా 6లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
కాళేశ్వరంపై కేటీఆర్ గోబెల్స్ ప్రచారం
గొప్పలకు పోయి రీడిజైన్‌తో రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్‌
బీఆరెస్‌పై మండిపడిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కమిషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు నిర్మించబోమని స్పష్టీకరణ

విధాత, హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం 6 నుంచి 6.30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ముందుకెలుతున్నామని, ఇందుకోసం ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించామని రాష్ట్ర ఇరిగేషన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. జల సౌధ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌లతో కలిసి రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని, క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్షించి పనులను పరిశీలించాలని నిర్ణయించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి టార్గెట్ పెట్టుకున్నామని పేర్కోన్నారు. పనుల నిర్వాహణలో నిర్లక్ష్యం, అవినీతి సహించేది లేదని, అటువంటి వాటికి సంబంధించి బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, పంటలు ఇబ్బంది పడితే చర్యలు తప్పవన్నారు. ఆపరేషన్, మెయింటెనెన్సు సమగ్రంగా సమర్థవంతంగా జరగాలన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రతి రోజు కాలువల పరిశీలన, చెరువులు, కాలువల మరమ్మతులు, వరదల నివారణ చర్యలు పరిశీలించాలన్నారు. ఈ ఆర్థిక ఏడాది నీటిపారుదల శాఖలో లోన్స్, జీతాలు ఇతర ఖర్చులు పోను 10820 కోట్లు పనుల కోసం ఉన్నాయని తెలిపారు.రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో కొత్త చాప్టర్ ప్రారంభించాలని.. అది రైతులకు ప్రజలకు మేలు జరగాలని సమీక్ష చేశామని తెలిపారు.

గోబెల్‌ను మించిపోయిన కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ జోసెఫ్ గోబెల్‌ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని, గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ధ్వంసం చేశారంటున్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీఆరెస్‌ అనాలోచిత పనులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇద్దరు మంత్రులపై కేటీఆర్ కు అనుమానం ఉంది అంటున్నారని, కేటీఆర్ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే విచారణ కమిషన్ ను కలిసి సమాచారం ఇవ్వొచ్చన్నారు. కాళేశ్వరం పై జస్టిస్ చంద్ర ఘోష్ విచారణ కొనసాగుతోందని గుర్తు చేశారు. కేటీఆర్ కు ఏమి అనుమానాలు, ఆధారాలు ఉన్నా కమిషన్ కు సమర్పించాలని, తమ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరి అధికార దుర్వినియోగం చేయబోమని, కమీషన్‌ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులు కట్టమని స్పష్టం చేశారు. తమ్మిడి హట్టిని వదిలేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వ చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లాన్, నిర్వహణ, నిర్మాణం లోపభూయిష్టంగా చేపట్టారని ఆరోపించారు. కేటీఆర్ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద అంబేద్కర్, ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం పనులు తలపెట్టిందని గుర్తుచేశారు. తర్వాత బీఆరెస్‌ అధికారంలోకి రాగా, జాతీయ హోదా కూడా అడిగారని, ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ పనులు ఆపేసి.. 30వేల కోట్ల వ్యయం.. 85 వేల కోట్లకు వ్యయం పెంచి, దాని స్థానంలో రీడిజన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును 85వేల కోట్లతో చేపట్టి రాష్ట్ర ఖజనా గుల్ల చేయడంతో పాటు భవిష్యత్తులోనూ ఏటా 15వేల విద్యుత్తు బిల్లులు, ఇంకా మెయింటనెన్స్‌ల ద్వారా ఆ ప్రాజెక్టు నిర్వాహణ ఒక గుదిబండగా మార్చారని విమర్శించారు. 94 వేల కోట్లు ఖర్చు చేసి 93 వేల ఎకరాలు సేద్యంలోకి తీసుకొస్తారా అని, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

నిపుణుల సూచన మేరకే మూడు బ్యారేజీల గేట్ల ఎత్తివేత

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలను ఉపయోగంలోకి తేవాలి అన్నదే ముఖ్యమంత్రి, కేబినెట్‌ సంకల్పమని, ఇదీ ముమ్మాటికీ తెలంగాణా ప్రజల సొత్తు అన్నారు. నిపుణుల సలహా మేరకే మేడిగడ్డలో పంపింగ్ నిలుపుదల చేశామని, పంపింగ్ చేస్తే ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుందని ఎన్డీఎస్‌ఏ నివేదిక పేర్కోందన్నారు. అదే జరిగితే సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కొట్టుకు పోతుందని, సీతారాం ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుందని, 44 గ్రామాలతో పాటు సుప్రసిద్ధ భద్రాచలం ముంపుకు గురౌతుందని తెలిపారు. నిపుణులు సూచనల మేరకు మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ లు గేట్లు తెరచి పెట్టడం జరిగిందన్నారు. అటువంటి నిపుణులతో రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఎన్డీఎస్‌ఏ ను అవమానకరంగా మాట్లాడం కేటీఆర్ కే చెల్లిందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు, నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ కలిగిన బ్యారేజీలు లేవన్నారు. ప్రచారం కోసం, కమిషన్ల కోసం పెద్ద బ్యారేజీలు కట్టి కుంగగొట్టారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటూ కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఆపితే, ప్రమాదం జరిగితే ఎవరు భాధ్యత వహిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. వాటి నుంచి నీళ్లు ఎత్తిపోసినా ఎల్లంపల్లికే రావాలని, అలాంటప్పుడు వాటి నుంచి ఎత్తిపోస్తే అదనపు ప్రయోజనమేంటని, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోత కొనసాగిస్తున్నామన్నారు.

గొప్పలకు..కమిషన్లకే కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం

కేసీఆర్ రీడీజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పచ్చి అబద్ధాలు చెప్పారని, ఐదుగురు రిటైర్డు ఇంజనీర్లతో కమిటీ వేశారని, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దు అని కమిటీ తేల్చిందని, సీడబ్ల్యుసీ నివేదికను కూడా పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు లో సరిపోను పైసలు రావు అనుకున్నారో లేక కాంగ్రెస్ కి పేరు వస్తుందని అనుకున్నారో తెలియదని, కానీ మేడిగడ్డకు మార్చారని గుర్తు చేశారు. 165 టీఎంసీల తుమ్మిడిహేట్టి వద్ద నీళ్ళు ఉన్నా.. నీళ్ళు అక్కడ లేవు అని ప్రచారం చేసి మెడిగడ్డకు ప్రాజెక్టు మార్చారన్నారు. మేడిగడ్డలో ప్రారంభం నుంచే లోపాలు బయపడటగా, మూడు బ్యారేజీల నుంచి లీకేజీల ప్రారంభం అయ్యాయన్నారు. అధికారులు దానిపై లేఖలు రాసినా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వారి అవినీతి బయటపడుతుందన్న భయంతో పట్టించుకోలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టు కట్టలేదని, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ప్రాజెక్టు కట్టారన్నారు. రాష్ట్ర ప్రజలపై శాశ్వత అప్పుల భారం మోపారని విమర్శించారు. రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్‌తోనే మేడిగడ్డ కుంగిందని, ఆ నిర్వాకం ముమ్మాటికీ మాజీ సీఎం కేసీఆర్‌దేనని, ఆయన స్వయంగా డిజైన్ చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారన్నారు. కట్టినప్పుడు, కూలినప్పుడు అధికారంలో ఉన్నది బీఆరెస్ ప్రభుత్వమేనని, కూలిన 47 రోజుల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం బీఆరెస్ పార్టీదేనని, వాస్తవాలను వక్రీకరించడం బీఆరెస్‌కు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని, కమీషన్లకు కక్కుర్తిపడి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని, ఇప్పటికైనా గోబెల్ ప్రచారం ఆపాలని, జరిగిన నష్టానికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్ క్షమపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ హితవు పలికారు. ఐదు ఎండల్లో 65 టీఎంసీల నీళ్లను కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేశారని, మొత్తం 1లక్షా 30 ఎకరాలకు ఐదు ఏళ్లలో నీళ్లు ఇచ్చారని తెలిపారు. లక్ష కోట్ల కుంభకోణంలో కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు ఉన్నారని,బ్యారేజి ప్రారంభం నాటికి సీకెండ్స్ కొట్టుకుపోయాయని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, మాకు రాజకీయ దురుద్దేశాలు లేవని, కాళేశ్వరం లో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాక ఉత్తర తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే దానికి కారణం గత ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.