పదేళ్లలో ఏం పని చేశావ్?: ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని అడ్డగించిన జనం

– తిరుగు ముఖం పట్టిన బీఆరెస్ అభ్యర్థి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలకు అడుగడుగునా అవమానాలు, నిరసన సెగలు తగులుతున్నాయి. పదేళ్ల కాలంలో మా గ్రామానికి ఏం పని చేసావ్ అంటూ గ్రామ పొలిమేరలోనే జనం అడ్డుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని తానూర్ మండలం జౌలాకే గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే, బీఆరెస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రచారానికి వెళ్లారు. గ్రామం పొలిమేరలోనే స్థానిక ప్రజలు ప్రచార వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రచార కాన్వాయ్ అడ్డుకొని నిరసన తెలియజేశారు. పది సంవత్సరాల కాలంలో ఏం పని చేశావని నిలదీశారు. కనీస మౌళిక సదుపాయాలు, సీసీ రోడ్డు, తాగునీరు ఇవ్వలేదని నిరసన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు, కొత్తగా ఇప్పించిన పెన్షన్లు ఏమీ లేవని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నాని ఎమ్మెల్యేను కడిగేశారు. ఇదే మండలంలో వారం రోజుల క్రితం ఇదే అంశాలపైన విఠల్ రెడ్డి అనుచరులు ప్రచారానికి వెళ్తే, రోడ్డు మీద నిలదీశారు. సీసీ రోడ్లు, మంచినీళ్లు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదని, మా ఊరికి ఆయన ప్రచారం అవసరం లేదని తిరిగి పంపించారు. వరుస ఘటనలతో బీఆరెస్ లో ఆందోళన నెలకుంది. గెలుపుపై అంతర్మథనంలో పడ్డట్టు సమాచారం.