కాంగ్రెస్‌లో మైనంపల్లి చిచ్చు! మొన్న కంఠారెడ్డి.. నిన్న నందికంటి

కాంగ్రెస్‌లో మైనంపల్లి చిచ్చు! మొన్న కంఠారెడ్డి.. నిన్న నందికంటి

విధాత, కాంగ్రెస్‌ పార్టీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి చేరిక చిచ్చు రేపుతున్నది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లికి ఆ పార్టీ అధిష్టానం మల్కాజిగిరి సీటును, ఆయన కుమారుడు రోహిత్‌రావుకు మెదక్‌ సీటును ఇస్తామని వెల్లడించింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి కాంగ్రెస్‌ నేతలు పార్టీపై తిరుగుబాటు చేస్తూ ఒక్కోక్కరు పార్టీ వీడుతున్నారు.



రోహిత్‌రావుకు మెదక్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వనున్న నేపధ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మొన్న కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టారు. సోమవారం మేడ్చల్‌ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేకు పంపినట్లుగా వెల్లడించారు.



మల్కాజిగిరి కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని మొన్నటిదాకా శ్రీధర్‌ భావించారు. మైనంపల్లి చేరికతో అసంతృప్తితో ఉన్న శ్రీధర్‌ను రెండు రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించుకుని రాహుల్‌గాంధీ బుజ్జగించినప్పటికిని ఆయన సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరుగదన్న భావనతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై కేసులు మోపి వేధించిన మైనంపల్లిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో పాటు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనుండటం తనను బాధించిందని శ్రీధర్‌ వెల్లడించారు.