Kavitha vs KTR | అన్నయ్య కేటీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు : ఎమ్మెల్సీ కవిత

అన్నయ్య కేటీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు ..మీడియాలో వచ్చిన పుకార్లపై స్పందిస్తూ ఆమె ఒక జాతీయ టీవీ చానెల్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు

Kavitha vs KTR | అన్నయ్య కేటీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు : ఎమ్మెల్సీ కవిత

“అన్నయ్య కేటీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. మేమిద్దరం మధ్య బంధం ప్రత్యేకమైనది” అని BRS మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా మీడియాలో వచ్చిన పుకార్లపై స్పందిస్తూ ఆమె ఒక జాతీయ టీవీ చానెల్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

“నాకు ఏం సమస్య లేదు… ఇది నేను ఇప్పటికే రెండుసార్లు చెప్పాను. మళ్లీ చెబుతున్నాను” అని ఆమె తేల్చిచెప్పారు. తనపై, తన రాజకీయ స్థిరత్వంపై, పార్టీకి తన విలువపై కొంతమంది స్వార్థపరులు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. “ఇది నాతో పాటు మరికొందరిపై కూడా జరుగుతోంది. కాని నా విషయం మాత్రం బయటకు వచ్చింది, ఎందుకంటే వారు నాన్నకి రాసిన నా లేఖను లీక్ చేశారు” అని అన్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి (KCR) లేఖలు రాయడం చిన్నప్పటి నుంచే తన అలవాటని ఆమె పేర్కొన్నారు. “పదో తరగతిలో నుంచే నేను నాన్నకి రాస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ బంధం అందరికీ కనిపించేలా మారింది” అని తెలిపారు.

మే నెలలో లీక్ అయిన లేఖ కారణంగా కవిత–కేటీఆర్ మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆ లేఖలో KCRను “దేవుడు”గా, ఆయన చుట్టూ ఉన్నవారిని “దయ్యాలు”గా పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు కేటీఆర్‌పై మోపిన వ్యాఖ్యలుగా భావించినవారు ఉన్నారు. అయితే ఆ లేఖపై ఆమె వివరణ ఇస్తూ, అది తండ్రికి రాసిన వ్యక్తిగత ‘ఫీడ్‌బ్యాక్’ అని, ప్రతి సంవత్సరం అలాంటి పత్రాలు రాయడం తమ కుటుంబపు సంప్రదాయమేనని తెలిపారు. వరంగల్ సభలో KCR చేసిన ప్రసంగం తక్కువ సమయంలో ముగిసిందని, అది బీజేపీపై మరింత దూకుడుగా ఉండాల్సిందని తన అభిప్రాయాన్ని లేఖలో వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆమె ధృవీకరించారు.

ఆ సమయంలోనే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు, BRSను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరుగుతున్నాయన్న వార్తలు షికార్లు చేశాయి. అందుకు సంబంధించి తనపై కుట్రలు జరిగాయని ఆమె గతంలోనే వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయాల్లో కేటీఆర్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనుద్దేశించే ఆ ఆరోపణలు జరిగాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ తాజాగా ఇంటర్వ్యూలో కవిత ఈ అంశాలన్నింటినీ ఖండిస్తూ, “అన్నయ్యపై నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. మా మధ్య బంధం బలంగా ఉంది” అని స్పష్టం చేశారు. పార్టీలోని మరికొంతమంది నేతల్ని కూడా లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. “ఇలాంటి కుట్రదారులను ఎక్కడివారిని అక్కడే ఉంచాల్సిన అవసరం ఉంది” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో కవిత తన అన్న కేటీఆర్‌తో ఉండే బంధంపై క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. లేఖల లీక్, రాజకీయ విలీన ప్రచారాల మధ్య ఆమె స్పందన పార్టీకి అవసరమైన స్పష్టతను తీసుకువచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో భద్రంగా తన స్థానాన్ని నిలుపుకునేందుకు, తన పున:రాజకీయ ప్రస్థానానికి ఇది కీలక సమయంగా మారిందని విశ్లేషణలు చెబుతున్నాయి.