సీఎం కేసీఆర్.. ఇది రాసిపెట్టుకో.. ఖమ్మంలో పదికి పదీ కాంగ్రెస్‌కే

- రాష్ట్రంలో 80-82 స్థానాల్లో గెలుస్తాం
- పాలేరు సభలో నీ పక్కన ఉన్నది
- ఏ పార్టీ నుంచి గెలిచినవారో తెలుసా?
- ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసిన
- ప్రజాస్వామ్యం గురిచి మాట్లాడుతారా?
- సంపద నాకు, నీకు ఎలా వచ్చిందో
విధాత: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇది రాసిపెట్టుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 82 సీట్లు వస్తాయని, అవి ఇంకా పెరగవచ్చునని చెప్పారు. వైరాలో కాంగ్రెస్ పార్టీనే పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎవరు ఎన్ని డబ్బు సంచులతో వచ్చినా, కుతంత్రాలతో వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ధరణి పోర్టల్ ను,నిన్ను,నీ తొత్తుల్ని తరిమి, నిన్ను ఇంటికే పరిమితం చేస్తామన్నారు. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటో తెలుసా? అని నిలదీశారు. సంపద నాకు.. నీకు ఎలా వచ్చిందో తేల్చుకుందాం… నేను తడి బట్టలతో వస్తా.. నీవు వస్తావా? భగవంతుడు శిక్ష మీకు వేస్తాడో లేదా నాకు వేస్తాడో చూద్దాం.. తేదీ మీరు చెప్పండి.. నేను వస్తా అని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్‌కు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. పాలేరు సభలో సీఎం అవాకులు చెవాకులు పేలారని, దీనికి తుమ్మల గట్టిగానే కౌంటర్ ఇచ్చారని చెప్పారు. సభలో తన పేరు ప్రస్తావించకుండా టార్గెట్ చేసి మాట్లాడారన్నారు.
తన పేరు ప్రస్తావించి ఉంటే.. తన సత్తా ఏమిటో తెలిసేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా డబ్బు, మదం అనే పదాలు వాడారన్నారు. కందాళ ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి బీఆరెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సభలో నీ పక్కన కూర్చున్న వాళ్లు ఏ పార్టీలో గెలిచారో మీకు తెలిసే మాట్లాడారా? అని సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారిని కొనుక్కొని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
డబ్బు అధికార మదంతో మాట్లాడేదే మీరని అన్నారు. తాను వ్యవసాయం, కాంట్రాక్టులు చేసి సంపాదించిన ఆస్తులన్నీ అఫిడవిట్‌లో చూపిస్తున్నానని తెలిపారు. మరి నీ ఆస్తిని నువ్వు చూపించగలవా? కేసీఆర్‌ను పొంగులేటి ప్రశ్నించారు. మీ అయ్య ఏమైనా కోటిశ్వరుడా? ఇన్ని కోట్లు నీకు ఎలా వచ్చాయి? అని నిలదీశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంపాదించావని ఆరోపించారు. దేశంలో కేసీఆర్ అంతటి పనికి రాని ముఖ్యమంత్రి లేడన్నారు. మేడిగడ్డ మేడిపండు చందంగా మారిందని పొంగులేటి అన్నారు. మీ పతనానికి చివరి మెట్టు మేడిగడ్డ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆరెస్‌కు ఏటీఎం కార్డని నడ్డా, అమిత్‌షా అంటూనే ఉన్నారన్నారు.