‘నిషేధం’ పేరుతో పైవాళ్ల దందా! హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్
మహానగరం హైదరాబాద్ చుట్టుపక్కల నిషేధిత భూముల దందా జోరుగా సాగిపోతున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు నిషేధిత జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదు. ఎందుకు అమలు చేయడం లేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నిస్తే, పైవాళ్ళు చెప్పాలి అని తప్పించుకుంటున్నారని బాధిత రైతులు, యజమానులు వాపోతున్నారు.

నిషేధిత భూములంటూ బుకాయింపు
మనవాడైతే ఓకే.. లేదంటే ముప్పుతిప్పలే
జిల్లా కలెక్టర్ తీరుపై బాధితుల ఆగ్రహం
బాలాపూర్ మండలంలోనూ ఇదే తంతు కొనసాగిస్తున్న అధికారులు
460 ఎకరాల భూములపై కొన్నేళ్లుగా వివాదం
ఆ భూములు మావేనంటున్న వక్ఫ్
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందన్న రైతులు
ఇక్కడా కోర్టు తీర్పులకు దిక్కే లేదు!
ఆయన ఒక జిల్లా కలెక్టర్. ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్ట ప్రకారం పనిచేయాలి. దరఖాస్తుదారుల విన్నపాలు న్యాయబద్దంగా ఉంటే వాటిని పరిష్కరించాలి. న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నట్లయితే పరిశీలించి అమలు చేయాలి. నిషేధిత భూముల అంశంలో బాధితులకు న్యాయం చేయకుండా, ఆదేశాలు అమలు చేయకుండా పై వాళ్ల పక్షాన ఉండడం న్యాయస్థానం తీర్పులను అపహాస్యం చేయడమే. హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచి, సుప్రీంకోర్టు నిషేధిత భూముల విషయంలో బాధిత రైతులు, యజమానులకు అనుకూలంగా తీర్పులిచ్చి, 3 నెలల్లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బేఖాతర్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ పైవాళ్లు చెప్పినట్లు నడుచుకుంటున్నారా, చట్టానికి లోబడి పనిచేస్తున్నారా అనేది నిషేధిత భూముల విషయంలో సుస్పష్టమవుతున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, మే 25 (విధాత) : మహానగరం హైదరాబాద్ చుట్టుపక్కల నిషేధిత భూముల దందా జోరుగా సాగిపోతున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు నిషేధిత జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదు. ఎందుకు అమలు చేయడం లేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నిస్తే, పైవాళ్ళు చెప్పాలి అని తప్పించుకుంటున్నారని బాధిత రైతులు, యజమానులు వాపోతున్నారు. ఈ భూముల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోకపోవడం, పై పెచ్చు పైవాళ్ళు అంటూ బుకాయిస్తున్న తీరు చట్టాలకే మచ్చతెచ్చే విధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో తమ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని ఒకరు గతంలో హైకోర్టు సింగిల్ జడ్జిను ఆశ్రయించగా, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి నిషేధిత జాబితాలో పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమలు చేస్తూ, సదరు భూములను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ ఆదేశాలను పునః పరిశీలించాలని, తప్పుడు వివరాలు సమర్పించారని బాధితులు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జడ్జి, నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించారు. ఆ ప్రకారంగానే ఆదేశాలు ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించగా, వాటిని సమర్పించకపోవడంతో నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని బాధితలు జిల్లా కలెక్టర్‌ను కోరగా, తొలుత పరిశీలిస్తామని చెప్పి పంపించారని అంటున్నారు. ఆ తరువాత వెళ్లి అడగ్గా, పై వాళ్లు చెప్పాలని, అప్పుడే అమలు చేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బేఖాతర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలపూర్ మండలంలోని గ్రామంలో కూడా
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంని ఓ గ్రామంలో 460 ఎకరాల భూమిపై కొన్నేళ్ళుగా వివాదం నడుస్తున్నది. ఈ భూములు తమవేనంటూ తెలంగాణ వక్ఫ్ బోర్డు వాదిస్తుండగా, తమకు ఓఆర్‌సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్) ఉందని అనుభవదారులు అయిన రైతులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వీ శేషాద్రి (ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి) పనిచేసిన సమయంలో అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులను పరిశీలించి, 460 ఎకరాలను వక్ఫ్ భూములుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు వక్ఫ్ బోర్డు, అనుభవదారులను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు పంపించింది. ఈ నోటీసులను చూసిన భూ యజమానులు, న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవి వక్ఫ్ భూములు కావని, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేశారు. మూడు నెలల వ్యవధిలో తీర్పును అమలు చేసి తమ భూముల్లోకి వక్ఫ్ బోర్డు అధికారులు రాకుండా నిరోధించాలని అనుభవదారులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రంతో పాటు ఉత్తర్వు పత్రాలను జతపర్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ వక్ఫ్ బోర్డు డివిజన్ బెంచ్ కు వెళ్లగా, బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మూడు నెలల వ్యవధిలో అమలు చేయాలని, ఈ భూములతో వక్ఫ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇవి ముమ్మాటికీ వక్ఫ్ భూములేనంటూ మళ్ళీ సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, మూడు నెలల వ్యవధిలో రైతులకు భూములు అప్పగించాలని చెబుతూ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ భూములపై హైకోర్టు సింగిల్ జడ్జ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు ఇలా మూడు కోర్టులు తీర్పులు ఇచ్చినా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమలు చేయకుండా తొక్కి పెట్టేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలుపర్చాలని జిల్లా కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పని జరగడం లేదని బాధితులు చెబుతున్నారు. వక్ఫ్ భూములని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగానే వెంటనే అమలు చేశారని, రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత భూముల జాబితాలో పెట్టారని, సుప్రీంకోర్టు వక్ఫ్ భూములు కాదని తీర్పునిచ్చినా తమకు భూములు అప్పగించం లేదని బాధితులు వాపోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయరా అని జిల్లా కలెక్టర్ ను అడిగితే, పై వాళ్లు అంటూ తప్పించుకుంటున్నారని చెబుతున్నారు.
కోర్టులు అంటే లెక్కేలేదు, పైవాళ్లే సుప్రీమా?
నిషేధిత భూములు, వక్ఫ్ భూములపై హైకోర్టు సింగిల్ జడ్జ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పెడచెవిన పెడుతున్నారని సమాచారం. తీర్పు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నా వారి మొర ఆలకించడం లేదు. కోర్టు ఆదేశాలు తమకు ముఖ్యం కాదని, పైవాళ్ళే తమకు సుప్రీం అనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌పై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం ప్రకారం, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఉన్నధికారులు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తున్నారు.