రేవంతే సీఎం?

కాంగ్రెస్ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ ల‌భించిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కుర్చీపై స‌స్పెన్స్‌ కొన‌సాగుతున్న‌ది

రేవంతే సీఎం?
  • భట్టి విక్రమార్క, సీతక్క డిప్యూటీలు!
  • నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం
  • నేడో రేపో ప్రకటన.. 6 లేదా 9న ప్రమాణం
  • సీఎం సీటు కోసం ఉత్తమ్‌, భట్టి యత్నాలు
  • తనకంటే తనకే కావాలని డీకే వద్ద పట్టు
  • భట్టికి మద్దతు ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి
  • రేవంత్‌ కింద పనిచేసేది లేదని అల్టిమేటం!
  • ఎమ్మెల్యేలతో మాట్లాడిన పరిశీలకులు
  • సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకు ఇస్తూ తీర్మానం 
  • తీర్మాన ప్రతితో ఢిల్లీకి బయల్దేరిన డీకేసీ
  • పనిచేసేవారికే ప్రాముఖ్యం అంటున్న అధిష్ఠానం

విధాత, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ ల‌భించిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి కుర్చీపై స‌స్పెన్స్‌ కొన‌సాగుతున్న‌ది. శాస‌న‌స‌భా పక్ష నాయ‌కుడిని ఎంపిక చేసేందుకు సోమ‌వారం ఉద‌యం నుంచి కాంగ్రెస్ ప‌రిశీల‌కులు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టారు.

అలా మొద‌లు పెట్టారో లేదో అస‌మ్మ‌తి రాగాలు మొద‌ల‌య్యాయి. బంజారాహిల్స్ లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో బ‌స చేస్తున్న కర్ణాటక ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎన్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీక‌ర్, మ‌ధిర ఎమ్మెల్యే మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మునుగోడు నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి క‌లిశారు. ముఖ్యమంత్రి పదవి తనకు కావాలంటే తనకే కావాలంటూ ఉత్త‌మ్‌, మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. వీరితో పాటు రాజ‌గోపాల్ రెడ్డి కూడా క‌లిసి మ‌ల్లు భ‌ట్టికి మ‌ద్దతు ప్ర‌క‌టించారంటున్నారు.


పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని వీరు తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేయ‌వ‌ద్ద‌ని డిమాండ్ చేశార‌ని పార్టీ వర్గాల కథనం. సుమారు అర‌గంట పాటు వీరు డీకేతో భేటీ అయ్యిన‌ట్లు స‌మాచారం.


పార్టీ నిర్ణయం ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని, ప‌నిచేసిన వారికే ప్రాముఖ్య‌ం ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ విషయంలో అధిష్ఠానం కచ్చితమైన వైఖరితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ త‌రువాత అక్క‌డి నుంచి ఆయ‌న వారితో క‌లిసి గ‌చ్చిబౌలిలోని హోట‌ల్ ఎల్లా వద్దకు చేరుకు డీకే.. పార్టీ ప‌రిశీల‌కుల‌తో క‌లిసి తాజాగా గెలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల‌తో స‌మావేశం అయ్యారు.


ఈ సందర్భంగా శాస‌న‌స‌భా పక్ష నాయ‌కుడి ఎంపిక‌పై అంద‌రూ ఒక ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. అధిష్ఠానం నిర్ణ‌యం ప్ర‌కారం న‌డుచుకుంటామ‌ని ఏక వాక్య తీర్మానం సైతం చేశారు. కానీ.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, అందోల్ ఎమ్మెల్యే దామోద‌ర రాజ‌న‌ర‌సింహ తదితరులు రేవంత్ రెడ్డిని ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించేది లేదంటూ స‌మావేశం నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆయ‌న నాయ‌క‌త్వం కింద ప‌నిచేయ‌లేమ‌ని ప‌రిశీల‌కుల‌కు ఆల్టిమేటం ఇచ్చార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.


తీర్మాన ప్రతిని తీసుకుని ఇతర ప‌రిశీల‌కుల‌తో క‌లిసి డీకే శివకుమార్‌ ఢిల్లీకి ప‌య‌న‌య్యారు. రెండు మూడు గంటల వ్యవధిలో నిర్ణయం వెలువడుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాటు జరుగుతున్నట్టు చెప్పారు. కానీ.. నిర్ణయం వెలువడకపోవడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. అధిష్ఠానం వ‌ద్ద త‌మ వాద‌న‌ను విన్పించేందుకు ఉత్త‌మ్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి, దామోద‌ర రాజ‌నర‌సింహ ఢిల్లీ వెళ్లారు. నాయ‌కుల మ‌ధ్య పార్టీ పెద్ద‌లు ఏకాభిప్రాయం కుదిర్చిన త‌రువాత, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

సీనియర్లంతా డిప్యూటీలు!

సీనియర్‌ నేతల్లో కొందరికి సామాజికవర్గాల వారీగా ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అంశం కూడా ఒక దశలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే.. అందరు డిప్యూటీల్లో తానూ ఒకడినైతే తనకు ప్రాధాన్యం ఏం ఉంటుందంటూ భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారని సమాచారం. అయితే కర్ణాటక తరహాలో ఒకే డిప్యూటీ ఉండాలని అన్నారని తెలిసింది.  

ఆరోతేదీ వరకూ సస్పెన్స్‌

ఈ నెల 6వ తేదీ లేదా 9వ తేదీన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మంత్రి మండలిలో ఎవరు ఉండాలనే విషయంలోనూ ఈలోపే నిర్ణయం జరుగుతుందని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నదని తెలుస్తున్నది. 

రేవంత్‌పై సానుకూలం!

అధిష్ఠానం రేవంత్ రెడ్డినే సీఎంగా ఎంపిక చేసే యోచ‌న‌లో ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు రేవంత్‌రెడ్డి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఒకే ఒక్కడై రాష్ట్రమంతా పర్యటించి ప్రచారసభల్లో పాల్గొన్నారు. గ్రూపుల‌తో సంబంధం లేకుండా ప్ర‌చారం సాగించారు. పార్టీ ఆదేశాల ప్ర‌కారం న‌డుచుకున్నారు. ఈ విషయాల్లో పార్టీ పెద్దలు రేవంత్‌పై సానుకూలంగా ఉన్నారని సమాచారం. 

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన‌ సిఈఓ వికాస్ రాజ్‌

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి వికాస్ రాజ్ రాజ్ భ‌వ‌న్ లో త‌న బందంతో క‌లిశారు. తాజా ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యే అభ్య‌ర్థుల వివ‌రాల‌తో ఉన్న గెజిట్ నోటిఫికేష‌న్ ప్ర‌తిని ను గ‌వ‌ర్న‌ర్ కు అంద‌చేశారు. ఈ మేర‌కు రాజ్‌భ‌వ‌న్‌ రెండో అసెంబ్లీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మూడో అసెంబ్లీ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.