మరిన్ని ప్రభుత్వ భూముల అమ్మకానికి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నద్ధం
హైదరాబాద్ పరిసరాల్లో మరిన్ని ప్రభుత్వ భూముల వేలానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మోకిలా, మేడిపల్లి, హకీంపేట భూముల విక్రయాలతో వేల కోట్లు సమీకరించాలని లక్ష్యం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్ముతుందని..ప్రజావసరాలకు భూములు లేకుండా చేస్తుందని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..అధికారంలోకి వచ్చాక తాను కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఇప్పటికే రెండున్నరేళ్ల తన ప్రభుత్వ హయాంలో జంట నగరాలు, చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములను అమ్మేసిన రేవంత్ ప్రభుత్వం తాజాగా మరికొన్ని భూముల విక్రయానికి సిద్దమైంది. గతంలో ఉస్మాన్‌సాగర్ పరిధిలోని సుమారు 15.81 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ (TGIC) ద్వారా వేలం వేసి ఒక్కో ఎకరాన్ని దాదాపు రూ.48.6 కోట్లకు అమ్మేసి రూ.768.36 ఆదాయం పొందింది.
అదే దారిలో కొత్తగా మోకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు, హాకీంపేటలో 8.24 ఎకరాల భూమితో పాటు హైదరాబాద్ నగర పరిసరాల్లోని ఏడు ఖాళీ స్థలాల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదలకు సిద్దమైంది. మోకిలా, మేడిపల్లి ప్లాట్ల విక్రయం ద్వారా రూ.400 కోట్లు, హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం, ఏడు ఖాళీ స్థలాల విక్రయం ద్వారా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది.
వేలం వేయనున్న మరో ఏడు ఖాళీ స్థలాలు:
1)శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్లో సర్వే నెంబర్ 174లోని 484 గజాల భూమి
2)గండిపేట మండలం బైరాగిగూడలోని సర్వే నెంబర్ 57లోని 2,420 గజాల భూమి
3)నార్సింగ్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 105లో ఉన్న 5,687 గజాల భూమి
4)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గండిమైసమ్మ మండలం భౌరంపేట గ్రామంలోని సర్వే నంబర్ 694లో ఉన్న 2,420 గజాల భూమి
5)కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం గ్రామంలోని సర్వే నెంబర్ 166,167లో ఉన్న 4,840 గజాల భూమి
6)మేడిపల్లి మండలంలోని పీర్జాదిగూడలోని సర్వే నెంబర్ 199లో ఉన్న 2,057 గజాల భూమి
7) అదే సర్వే నంబర్లో ఉన్న 726 గజాల భూమి
వేలం వేయనున్న తేదీలు :
జూన్ 17 – ఏడు ఖాళీ స్థలాలు
జూన్ 19 – హకీంపేటలోని 8.24 ఎకరాల భూమి
జూన్ 24 – మేడిపల్లిలోని ప్లాట్లు
జూన్ 29 – మోకిలాలోని ప్లాట్లు
25 వేల ఎకరాల అసైన్డ్ భూముల స్వాధీనానికి స్కెచ్
తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక అవసరాలు, సంక్షేమ పథకాలకు నిధులు సమీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూసేకరణ, ప్రభుత్వ భూముల విక్రయాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సాగులో లేని సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములను విడతల వారీగా స్వాధీనం చేసుకోనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 5 వేల ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టగా.. అందులో దాదాపు 3 వేల ఎకరాలను పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి అప్పగించారు. టీజీఐఐసీతోపాటు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), రైల్వే శాఖ సహా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మౌలిక వసతుల కోసం, ఇతర ప్రజా అవసరాల కోసం భూములు కేటాయించాలని రెవెన్యూ శాఖను ఆయా సంస్థలు కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసీ సంస్థ ఒక్కటే దాదాపు 10 వేల ఎకరాల భూమి కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
అసైన్డ్ భూములు అప్పగించిన వారికి డెవలప్ డ్ ప్లాట్లు
భూమిలేని రైతులకు సుమారు 1.40 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కొన్ని దశాబ్దాల క్రితమే కేటాయించారు. అయితే.. హైదరాబాద్ సమీప ప్రాంతాలు, పట్టణ పరిసరాల్లో ఉన్న దాదాపు 25 వేల ఎకరాల ఈ అసైన్డ్ భూములు .. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని తిరిగి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసైన్డ్ భూములను అప్పగించే రైతులకు.. ప్రతీ ఎకరానికి సుమారు 800 చదరపు గజాల డెవలప్‌డ్ ప్లాట్లను ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువ పరంగా చూస్తే ఇది అసలు భూమి కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుందని.. ఈ ప్లాట్లను చట్టబద్ధంగా అమ్ముకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
అసెన్డ్ భూములను కొనుగోలు చేసిన వారికి నోటీసులతో స్వాధీనం
మరికొందరు రైతులు మాత్రం తమ అసైన్డ్ భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లకు విక్రయిస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే అసైన్డ్ భూములను అమ్మడం, బదిలీ చేయడం చట్టపరంగా నిషేధం ఉంది. లబ్ధిదారుడు మరణిస్తే.. ఆ తర్వాతే అతని వారసులకు ఈ అసైన్డ్ భూములు బదిలీ అవుతాయి. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) చట్టం-1977 ప్రకారం.. రూల్స్ అతిక్రమిస్తే.. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పటివరకు సుమారు 3 వేల ఎకరాల అసైన్డ్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు సమాచారం. తుక్కుగూడలో 5 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 24 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇదే తరహాలో మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, కందుకూరు మండలాలతో పాటు పెద్దవీడు, మద్దూరు, సోలిపేట్ వంటి గ్రామాల్లో కూడా స్వాధీనానికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు
ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త ‘భారత్ గౌరవ్’ ప్యాకేజీలు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram