Richa Chadda | రాహుల్‌ గాంధీ ‘ప్రేమ’ను కోరిన బాలీవుడ్‌ తార.. దేనిపైనంటే..

హైదరాబాద్‌లోని 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అటవీ భూములను కాపాడాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్‌గాంధీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ రిచా చద్ధా కూడా చేరారు.

Richa Chadda | రాహుల్‌ గాంధీ ‘ప్రేమ’ను కోరిన బాలీవుడ్‌ తార.. దేనిపైనంటే..

Richa Chadda | హైదరాబాద్‌లోని 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అటవీ భూములపై తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ భూములను కాపాడాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్‌గాంధీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ రిచా చద్ధా కూడా చేరారు. 400 ఎకరాల అటవీ భూములను అమ్మకానికి పెట్టడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె తీవ్ర విమర్శలు కురిపించారు. గొప్ప జీవ వైవిధ్య భూమిగా ఉన్న కంచ గచ్చిబౌలి అటవీ భూముల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భూములను ఎట్టిపరిస్థితిలో అమ్మనీయబోమని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఏప్రిల్‌ 2, 2025న కూడా అక్కడ ఆందోళన చేస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులపై తెలంగాణ పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. విద్యార్థులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.

పోలీస్‌ వ్యాన్‌లోకి విద్యార్థులను ఈడ్చుకెళుతున్న వీడియోలపై రిచా చద్ధా తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు. ‘హే @RahulGandhi. ప్రేమ చాలా ఎక్కువైపోయింది. ప్రకృతిపైనా కొంత ప్రేమ చూపించు’ అని రిచా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ఆ పోస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్‌ ఖాతాను కూడా ఆమె ట్యాగ్‌ చేశారు.

పోలీసులతో విద్యార్థుల ఘర్షణ
యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, బుల్డోజర్లతో భూమిని క్లియర్‌ చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ‘పోలీస్‌ గో బ్యాక్‌’, ఆవాజ్‌ దో హమ్‌ ఏక్‌ హై’ అంటూ విద్యార్థులు, ఫ్యాకల్టీ పెద్ద పెట్టున నినదిస్తూ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విద్యార్థి సంఘం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. రాత్రంతా విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ఎదుట బైఠాయించి, అక్కడే చాపలు పరుచుకుని నిద్రించారు.