చట్టం కాదిది.. రైతుల చుట్టం.. ఆర్వోఆర్ ముసాయిదాపై చర్చా కార్యక్రమంలో వక్తలు
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తయారైన ఆర్వోఆర్ చట్టం-2024 (ROR Act-2024) ముసాయిదా తెలంగాణ ప్రజల భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడే విధంగా ఉంటుందని, రైతులకు, భూమి యజమానులకు చుట్టంగా (boon for farmers) మారనుందని పలువురు వక్తలు అభినందించారు

దేశ భూ సంస్కరణలో ఇది విప్లవాత్మకం
స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు
ఈ మూడు అంశాలు కేంద్రంగానే కొత్త చట్టం
భవిష్యత్తుతరాలకు ఉపయోగపడేలా రూపకల్పన
18 రాష్ట్రాల చట్టాల అధ్యయనంతో ముసాయిదా తయారీ
భూధార్, ఆబాదీకి హక్కుల రికార్డుతో ప్రజలకు మేలు
వ్యవసాయేతర భూములకూ కొత్తగా భూ రికార్డు
గ్రామాల్లోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ
ఆర్వోఆర్ ముసాయిదాపై చర్చా కార్యక్రమంలో వక్తలు
సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటికి అభినందనలు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తయారైన ఆర్వోఆర్ చట్టం-2024 (ROR Act-2024) ముసాయిదా తెలంగాణ ప్రజల భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడే విధంగా ఉంటుందని, రైతులకు, భూమి యజమానులకు చుట్టంగా (boon for farmers) మారనుందని పలువురు వక్తలు అభినందించారు. ప్రపంచంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ముసాయిదా రూపకల్పన చేశామని, ప్రజాభిప్రాయం కోసం ప్రజల ముందు పెట్టామని అన్నారు. ఆర్వోఆర్-2024తో రెవెన్యూ సేవలు వేగంగా (revenue services will be available faster) లభ్యమవుతాయని, శాఖ బలోపేతం అవుతుందని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదాపై బేగంపేటలోని టూరిజం ప్లాజాలో (Tourism Plaza in Begumpet) రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతో చర్చా కార్యక్రమం జరిగింది. ప్రజాపాలనలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 తెచ్చి రైతులకు మేలు చేస్తూ, రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ఎంతో కృషి చేశారంటూ వారి సేవలను కొనియాడారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీ లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్, ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు రవీంద్రబాబు, బాలరాజు, రమేశ్ లొలేవార్ మాట్లాడారు.
రాజ్యాంగం తరహాలో కొత్త ఆర్వోఆర్ చట్టం రూప కల్పన: భూమి సునీల్‌కుమార్
భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రూపొందించిన తరహాలోనే కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా ఉందని భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ తెలిపారు. రాజ్యాంగం రూపకల్పన సమయంలోని ప్రపంచ దేశాలలో ఉన్న మంచిని స్వీకరించి, మన రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా.. ఈ చట్టంలో కూడా దేశంలోని 18 రాష్ట్రాలలో ఉన్న ఆర్వోఆర్ చట్టాలను (good provisions of the 18 states) క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో ఉన్న మంచి నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1936, 1948, 1971, 2020లలో మొత్తం నాలుగుసార్లు ఆర్వోఆర్ చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. ఇప్పడు రాబోయే ఐదవ తెలంగాణ ఆర్వోఆర్ -2024 చట్టానికి ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే రెండు దశాబ్దాలను దృష్టిలో ఉంచుకొని చట్టానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. స్వాధీనంలో భూమి (land in possession), చేతిలో పట్టా (title in hand), రికార్డులో పేరు (name in record).. ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు (full land rights) దక్కుతాయన్నారు. ఈ మూడు అంశాల కేంద్రంగానే కొత్త చట్టం ఉండబోతుందన్నారు. వ్యవసాయ భూములకు ఏ విధంగానైతే భూమి హక్కుల రికార్డు ఉంటుందో.. కొత్త చట్టంలో వ్యవసాయేతర భూములకు (non-agricultural lands) కూడా భూమి రికార్డును కొత్తగా అమలు చేయబోతున్నారని వివరించారు. దేశంలో వస్తున్న మార్పులకు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న భూ విధానాలకు అనుగుణంగా కొత్త చట్టం ఉందన్నారు. కొత్త చట్టంపై విమర్శలు చేయడం బదులుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు చేయాలని సునీల్ కుమార్ కోరారు.
కొత్త చట్టంతోనే రైతులకు సేవలు చేరువ: వీ లచ్చిరెడ్డి
గత దశాబ్దకాలంలో తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ (revenue system of Telangana) పూర్తిగా నిర్వీర్యం కావడంతో రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు దూరమయ్యాయని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి అన్నారు. రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందాలంటే కొత్త ఆర్వోఆర్ చట్టంతోనే సాధ్యమవుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో భూ పరిపాలన వ్యవస్థలను (land administration systems) బలోపేతం చేస్తూ రైతులకు భూ సమస్యలను పరష్కరించేందుకే కొత్త చట్టం యొక్క ఆవశ్యకత ఏర్పడిందన్నారు. చట్టం అంటే ఎక్కడో కూర్చొని చేస్తే క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందని చెప్పారు. ప్రజల నుంచే చట్టం రావాలనే దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టిందని తెలిపారు. గత పాలకులు చట్టాన్ని చేసి ప్రజల ముందుకు తెచ్చేవారని, ముసాయిదాను ప్రజల ముందు పెట్టేవారు కాదని గుర్తు చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చి ప్రజాభిప్రాయాల్ని కోరడం అనేది ఒక చరిత్రగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా చట్ట రూపకల్పనలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చట్టం రూపొందించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు కూడా మార్చుకొనే వెసులుబాటు (flexibility to change the regulations) ఈ చట్టంలో ఉందన్నారు. ఈ కొత్త చట్టంతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు అందడంతో పాటు సమస్యలను కూడా అక్కడే పరిష్కరించుకునే విధానం రానున్నది. గ్రామానికో రెవెన్యూ అధికారి కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందించే రోజులు కూడా రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఏ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్ లోని సీసీఎల్ఏకు రావాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కొత్త చట్టంలో అధికార వికేంద్రీకరణ చేశారని, దీంతో గ్రామ, మండల స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
రైతులు కోర్టుల మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు : ప్రొఫెసర్ జీబీ రెడ్డి
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంతో ఏ చిన్న సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీబీ రెడ్డి అన్నారు. రైతులు ప్రతి దానికీ కోర్టుకు వెళ్లడం చాలా ఇబ్బందిగానే కాకుండా భారంగా కూడా ఉందన్నారు. ఇది రైతులకు భారంగా పరిణమించింది. 2020 ఆర్వోఆర్ చట్టంతో అప్పిల్, రివిజన్ చేసే వ్యవస్థ లేదని చెప్పారు. కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ప్రజలకు, రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని చట్టంగా అందుబాటులోకి తెస్తే రైతుల కష్టాలు తీరుతాయని, అత్యున్నమైన చట్టంగా చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, భూ యజమానులకు ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. ప్రజాభిప్రాయం తరువాత ఈ ముసాయిదాను వెంటనే చట్టంగా చేసి అమల్లోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్ సరిత, వైస్ ప్రెసిడెంట్లు శకుంతల, శ్రీనివాస్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాములు, సెక్రటరీ జనరల్ ఎల్ పూల్‌సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధా, కోశాధికారి శ్రీనివాస శంకర్ రావు పాల్గొన్నారు.