కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఆదిలాబాద్ ఎడారి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఆదిలాబాద్ ఎడారి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చెన్నూర్ బీఎస్పీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.


ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి 2006 లో రూ.900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయినా ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూనిర్వాసితులు పక్కా ఇండ్లు లేక రేకుల షెడ్డుల్లో జీవిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికులు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే అన్ని వనరులున్న చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.


అధికార పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు దొరలకు బానిసలయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనాభాలో 99 శాతం ఉన్న పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి జాగిరి రాజేష్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, విజయ్, జోనల్ మహిళా కన్వీనర్లు అర్చన, భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, మాంతయ్య, సారయ్య, రాజు, చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.