Ramagundam Eart Quake | రామ‌గుండం స‌మీపంలో పొంచి ఉన్న భూకంపం? రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌త‌?

Ramagundam Eart Quake | రామ‌గుండం స‌మీపంలో పొంచి ఉన్న భూకంపం? రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌త‌?

ఇటీవ‌లే తెలంగాణ‌లోని ములుగు స‌మీపంలో భూకంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. దాని ప్ర‌కంప‌న‌లు స‌మీప ప్రాంతాల‌తోపాటు హైద‌రాబాద్‌కూ తాకాయి. అయితే.. తాజాగా 2025, ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మ‌ధ్య‌లో రామ‌గుండంలో ఓ మోస్త‌రు భూకంపం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎపిక్ (ఎర్త్‌కేక్ రిసెర్చ్ అండ్ ఎనాల‌సిస్) హెచ్చ‌రించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దాని తీవ్ర‌త 5.3 గా ఉంటుంద‌ని తెలిపింది. ఆ భూకంపం వ‌ల్ల క‌లిగే ప్ర‌కంప‌న‌లు వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌తోపాటు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అమ‌రావ‌తి, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లోనూ క‌నిపిస్తాయ‌ని త‌మ ప‌రిశోధ‌న‌లో తేలిన‌ట్టువెల్ల‌డించింది.

ఇటీవ‌ల ములుగులో 5.3 తీవ్ర‌తతో భూకంపం వ‌స్తే హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో సైతం ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. అంత‌కు ముందు ఇదే ములుగు జిల్లాలో వంద‌ల హెక్టార్ల అట‌వీ భూమిలో రాత్రికి రాత్రే భారీ స్థాయిలో విధ్వంసంతో వేల చెట్లు కూక‌టివేళ్ల‌తో స‌హా పెక‌ళించుకుపోయాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం భూకంప తీవ్ర‌త త‌క్కువ క‌లిగిన ప్రాంతం (జోన్‌-2)గా వ‌ర్గీక‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ములుగు 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ములుగులో 2024 డిసెంబ‌ర్‌ నెలలో 5.3 తీవ్ర‌త‌తో వ‌చ్చిన భూకంపం.. తెలంగాణలో గ‌త 50 ఏళ్ల‌లో వ‌చ్చిన అత్యంత శక్తిమంతమైన భూకంపం.

1982లో ఉస్మాన్ సాగ‌ర్ జ‌లాశ‌యం స‌మీపంలో సూక్ష్మ భూ కంపం వ‌చ్చింది. 2020లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో వ‌చ్చిన భూ ప్ర‌కంప‌న‌లు భ‌యాందోళ‌న‌కు గురి చేశాయి. అక్టోబర్ 1994 నుంచి నవంబర్ 2017 మధ్య, ఒక్క‌ జూబ్లీ హిల్స్‌లోనే 979 భూకంపాలు నమోదయ్యాయి, వాటిలో అత్యధికంగా 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని రికార్డులు చెపుతున్నాయి. 1969 ఏప్రిల్ 13న భద్రాచలం సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.7. 2024, డిసెంబర్ 4న ములుగు జిల్లాలో వచ్చిన భూకంపం తీవ్రత 5.3. ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల దీని ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌లోని బోరబండ, కార్మికనగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ వంటిచోట్ల 2 నుండి 3 సెకన్ల పాటు స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి.