వరంగల్ ‘వరద’పై స్టడీ…ముంపు ప్రాంతాల రక్షణకు చర్యలు
వరద ముంపునుంచి వరంగల్ నగరాన్ని రక్షించేందుకు అవసరమైన శాశ్వత చర్యలపై తాజాగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక ఆదివారం నగరంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

- వరంగల్ ‘వరద’పై స్టడీ
- వరద తీవ్రత అంచనాకు ప్రణాళిక
- సంబంధిత శాఖలతో సమన్వయం
- సహజ నీటి ప్రవాహం కోసం డ్రైన్లు
- ముంపు ప్రాంతాల రక్షణకు చర్యలు
- చెరువులను పరిశీలించిన శశాంక
- పాల్గొన్న గ్రేటర్ కమిషనర్ చాహాత్
విధాత ప్రత్యేక ప్రతినిధి: వరద ముంపునుంచి వరంగల్ నగరాన్ని రక్షించేందుకు అవసరమైన శాశ్వత చర్యలపై తాజాగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక ఆదివారం నగరంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా భద్రకాళి, చిన్నవడ్డేపల్లి, కట్టమల్లన్న చెరువు ప్రాంతాలను గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వరద ముంపును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు.
ప్రతి యేటా ముంపు బాధలు
భారీ వర్షం కురిసిందంటే నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోజుల తరబడి జలదిగ్భంధంలో చిక్కుకుని తీవ్ర అవస్థలపాలవుతున్నారు. ఆస్థి, ఆరోగ్య నష్టాలను చవి చూస్తున్నారు. ప్రజావసరాలకు తగిన విధంగా నగరంలో అభివృద్ధి లేక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నగరంతోపాటు జనాభా పెరుగుతోంది. నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వర్షం నీరు, మురుగు నీరు వెళ్ళేందుకు అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రామ్ వాటర్ వ్యవస్థలు లేకపోవడం ఫలితంగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. నగరాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్య పై ప్రతీ యేటా రాష్ట్రస్థాయి, గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హామీలివ్వడం తప్ప ఆచరణాత్మక కార్యక్రమం చేపట్టడంలో విఫలమవుతున్నారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే ముంపు తప్పడంలేదు.
ప్రత్యేకాధికారి పరిశీలన
వరంగల్ నగరం ముంపుకు గురికాకుండా ప్రణాళిక ప్రకారం శాశ్వత చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ వివరాలు తెలుసుకున్నారు. 12 మోరీల వద్ద వరద నీటి ప్రవాహం, చిన్న వడ్డపల్లి చెరువును, కట్ట మల్లన్న చెరువును పరిశీలించారు. వరద నీటి వల్ల చిన్న వడ్డెపల్లి చెరువు ముంపునకు గురయ్యే ఎస్ ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించే విషయాలను తెలుసుకున్నారు. అక్కడే సూచనలు చేశారు.
వరద అంచనాపై అధ్యయనం
వరద నీటిని అంచనా వేసేందుకు భద్రకాళి బండ్ ఇన్లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం ఎంత? ఎంత ఇన్ ఫ్లో వస్తుంది ? ఎంత ఔట్ ఫ్లో వెళుతుంది? లెవెల్స్ ఇంత కచ్చితంగా ఉన్నప్పటికీ ఎందుకు ఔట్ ఫ్లో వెళుతుంది? వంటి విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్నారు. సక్రమంగా వరద లెవెల్స్ , సామర్ధ్యాన్ని నిర్వహిస్తూ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోకు అనుగుణంగా భద్రకాళి నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపునకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్య లు చేపట్టాలన్నారు. గ్రీన్ ఏరియా లోకి నీరు చేరకుండా, లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావితం కాకుండా చూడాలని, నీరు ప్రవహించే గరిష్ఠ సామర్ధ్యాన్ని దృష్టిలోపెట్టుకొని డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. కట్ట మల్లన్న చెరువు నుండి చిన్న వడ్డేపల్లి చెరువుకు నీరు చేరే క్రమంలో మధ్యలో గల లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన డ్రైన్ లు, స్ట్రాం వాటర్ డ్రైన్ లు లేకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని చెప్పారు. ఇన్ ఫ్లో వచ్చినప్పుడు గేట్ లెవెల్స్ నిర్వహించేందుకు ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో మేజర్ డ్రైన్స్ నిర్మిస్తే సహజ ప్రవాహం వెళ్ళిపోయే అవకాశం ఉందన్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ప్రతి చెరువుకు సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కు సమాచారం ప్రజలకు చేరేవిధంగా కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలన్నారు. వాతావరణ మార్పులను ఆలారం ద్వారా తెలియజేస్తూ నియంత్రించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ రవికుమార్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్. గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళిక అమలవుతుందా?
ప్రతి సంవత్సరం జరిగినట్లుగా పరిశీలన, ప్రణాళిక రూపొందించడానికే అధికారులు పరిమితమవుతారా? ఈ సారైనా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అమలు చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ హయంలో కూడా నగరం తీవ్రమైన జలదిగ్భంధానికి గురైనప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెలికాప్టర్లో సందర్శించి వరద ముంపు నుంచి కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. తదుపరి ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలోనైనా ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని వరంగల్ వాసులు ఆశిస్తున్నారు.