Telangana Bhu Bharathi । అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ బిల్లు.. ప్రధానాంశాలు ఇవే!

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ మేరకు బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Telangana Bhu Bharathi । అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ బిల్లు.. ప్రధానాంశాలు ఇవే!

Telangana Bhu Bharathi । తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. బుధ‌వారం అసెంబ్లీలో భూభార‌తి బిల్లును ఆయన ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ 1971లో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆర్వోఆర్ చ‌ట్టం 49 ఏళ్ల‌పాటు ఉప‌యోగ‌ప‌డింద‌ని, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఏడేళ్ల పాటు ప్ర‌జోప‌యోగంగా ఉప‌యుక్త‌మ‌య్యింద‌ని తెలిపారు. త‌ర్వాత అర్ధ‌రాత్రి నాలుగు గోడ‌ల న‌డుమ రూపొందిన ధ‌ర‌ణి చ‌ట్టం వ‌ల‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోగా ల‌క్ష‌లాది స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింద‌ని అన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో లెక్క‌లేన‌న్ని ఇబ్బందులు ఎదురయ్యాయ‌ని వివరించారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క త‌మ పాద‌యాత్ర‌ల సంద‌ర్బంగా ధ‌ర‌ణిని అరేబియా సముద్రంలో క‌లుపుతామ‌ని ఇచ్చిన హామీని ప్ర‌జ‌లు విశ్వ‌సించి, తమను గెలిపించారని చెప్పారు. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసి భూభార‌తికి రూపకల్పన చేశామని వివరించారు. తాము ఆగ‌స్టు 2న ముసాయిదాను ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మేగాక ప్రజాప్రతినిధులతోపాటు మేధావులు, కవులు, విశ్రాంత అధికారులు, ప్రజల స‌ల‌హాలు సూచ‌న‌లు స్వీకరించామని తెలిపారు. భూభారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నందువల్లే బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో జాప్యం జ‌రిగింద‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

ప్రధానాంశాలు
• 2020 చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి, భూ-భారతి ద్వారా సరిదిద్దడం.
• (ఏ) పార్టు-బీలోని 18 లక్షల ఎకరాల సమస్యకు పరిష్కారం.
• (బి) గ్రామీణప్రాంతాల్లో ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం కనుగొనడం.
• (సీ) రాబోయే రోజుల్లో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం.
• రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు.
• వారసత్వం… వంశపారంపర్య భూములు..
• సేల్ డీడ్, వారసత్వం … కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ అధికారాలు ఆర్డీవో ….
• సాదా బైనామా … : 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం…
• భూధార్ : దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ తరహాలో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్.
• జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు : 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధానం కొనసాగింపు. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి నియామకం.
• ల్యాండ్ ట్రిబ్యునల్స్: భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై నిర్ణయం.
• సీసీఎల్ఏ ద్వారా రివిజన్: ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నాం.
• ప్రభుత్వ అధికారులపై చర్యలు: ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.

పూర్తి వివరాలకు పీడీఎఫ్‌ కాపీలు చూడండి..

Telugu – ROR Bill, 2024

Telangana Bhu Bharathi (RoR) Bill, 2024 (Final)