మార్పు కోరుతున్న తెలంగాణ ప్రజలు!
వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నా.. బీఆరెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో బలమైన వ్యతిరేకత గూడుకట్టుకున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

- 6 గ్యారెంటీలను జనంలోకి తీసుకెళ్లిన కాంగ్రెస్
- ఆ పార్టీ సంక్షేమ పథకాలపైనా ఓటర్లలో భరోసా
- బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటేనన్న వాదన
- విస్తృతంగా జనంలో ప్రచారం చేసిన కాంగ్రెస్
- అనేక పోల్ సర్వేల్లోనూ కాంగ్రెస్‌కే మొగ్గు
- ధృవీకరిస్తున్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నా.. బీఆరెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో బలమైన వ్యతిరేకత గూడుకట్టుకున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆరెస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చామని, ఇక చాలని గ్రామాల్లో బాహాటంగానే చర్చలు జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో అనేక సర్వేలు సైతం మార్పుపై గట్టి సంకేతాలే ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ సర్వేలు సైతం వాటికి సరిపోలి ఉన్నట్టు తెలుస్తున్నది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న వాదనను ధృవీకరించేలా ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాలకు సంబధించి, ప్రత్యేకించి ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సఫలమైందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగించక తప్పదనే భావన ఉన్నదని, అందువల్లే కాంగ్రెస్ వచ్చినా సంక్షేమ పథకాలు ఆగబోవనే
ధీమాతో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రజానీకం ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను కోరుకుంటుందని, కానీ.. రాష్ట్రంలో ఇవే కొరవడ్డాయని అంటున్నారు. వ్యతిరేకత పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా బీఆరెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ నేతలు చేసిన ఉక్రోషపూరిత ఉపన్యాసాలు అందుకు సంకేతమని అంటున్నారు. చివరాఖరికి సీఎం కేసీఆర్.. పదేళ్లు సీఎంగా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ నా తరహాలో ఇంతకాలం ముఖ్యమంత్రిగా లేరు.. ఈ కీర్తి చాలు నాకు.. అని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపైనా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చలు నడిచాయి. ప్రచారం చివరి రోజున హుజూరాబాద్ బీఆరెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి.. తనను ఓడిస్తే భార్యాబిడ్డలతో కలిసి ఉరి వేసుకుంటానని ఓటర్లను బెదిరించే దాకా వెళ్లారు.
మూడు పార్టీలూ ఒక్కటేనన్న ప్రచారం
బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం.. ఈ పార్టీలు ఒక్కటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లింది. ఎక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నా.. అక్కడ ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం సిద్ధపడుతున్న తీరును సమర్థవంతంగా వివరించగలిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల ఇండియా టు డే సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్, బీజేపీ, ఎంఐంలు ఒక కూటమి, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితి ఒక కూటమి అని చెప్పారు. ఈ రెండు కూటముల మధ్యనే ఎన్నికల పోరాటం జరుగుతుందని స్పష్టం చేశారు.