Telangana: నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవం

విధాత : తెలంగాణ శాసన మండలికి ఇటీవల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజవర్గాలు, ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైన నూతన ఎమ్మెల్సీలు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలోని తన ఛాంబర్ లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బీజేపీకి చెందిన కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, అదే జిల్లాల పట్టభద్రుల నియోజవర్గం ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
అనంతరం నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు డి. శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ లు, సీపీఐ నేతలు , పలువురు ఆయా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.