Aarogyasri | ఆగ‌స్టు 31 నుంచి ఆరోగ్య శ్రీ సేవ‌లు బంద్‌? సర్కార్‌కు ప్రైవేట్‌ హాస్పిటళ్ల అల్టిమేటం!

Aarogyasri | రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయా? ఇప్పటికే ప్రభుత్వం నుంచి తమకు 14 వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటళ్లు చెబుతున్నాయి. వీటిని ఆగస్ట్‌ 31 నాటికి చెల్లించని పక్షంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి.

Aarogyasri | ఆగ‌స్టు 31 నుంచి ఆరోగ్య శ్రీ సేవ‌లు బంద్‌? సర్కార్‌కు ప్రైవేట్‌ హాస్పిటళ్ల అల్టిమేటం!

హైద‌రాబాద్‌, ఆగ‌స్ట్‌ 22 (విధాత‌):

Aarogyasri | ఆరోగ్య శ్రీ సేవ‌లను ఈ నెల 31 తేదీ నుంచి బంద్ చేయాల‌ని తెలంగాణ (telangana) రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్‌  (private hospitals) నిర్ణయించాయి. ఆరోగ్య‌శ్రీ (arogya sri) బ‌కాయిలు దాదాపు రూ.1400 కోట్ల (rs 1400 crore) వ‌ర‌కు పేరుకు పోయాయి. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం మేర‌కు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంగా బిల్లులను పెండింగ్ పెట్టడంతో ప్రైవేట్ నెట్‌వర్క్‌ ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవ‌లు బంద్ పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఈ నెల 31వ తేదీలోపు (31st august) బ‌కాయిలు (dues) చెల్లిస్తేనే తాము వైద్య‌సేవ‌లు అందిస్తామ‌ని ప్రైవేట్ ఆసుప‌త్రులు స్ప‌ష్టం చేస్తున్నాయి.

తెలంగాణ‌లో వైద్య ఖ‌ర్చులు భ‌రించ‌లేని పేద ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌శ్రీ వరంగా మారింది. అదే సమయంలో అనేక హాస్పిటల్స్‌కు కూడా అది అందివచ్చిన అవకాశంగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయకుండా ఆరోగ్య శ్రీ మీద ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేయడంపై మేధావుల నుంచీ విమర్శలు కూడా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పైసా ఖ‌ర్చు లేకుండా పేద‌ల‌కు కార్పోరేట్ వైద్యం అందించాల‌న్న ఉద్దేశంలో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. నేరుగా ప్రజలకు లబ్ధి కలిగించే పథకం కావడంతో నాటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆరోగ్య శ్రీని కొన‌సాగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం పరిమితిన రూ.5 ల‌క్ష‌ల ఏకంగా రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచారు. దీంతో మ‌రిన్ని సమస్యలకు ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్సలు అందుతున్నాయి.

పేద ప్ర‌జ‌లు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హితంగా అత్యంత ఖ‌రీదైన వైద్య‌సేవ‌లు పొందుతున్న ఈ పథకానికి నేడు ఆప‌ద వ‌చ్చింది. ప్ర‌భుత్వం స‌కాలంలో వైద్య‌సేవ‌లు అందించే నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు బిల్లులు చెల్లింపులు చేయాలి. అలా బిల్లుల చెల్లింపు స‌కాలంలో జ‌రిగితే నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య‌శ్రీ వైద్య‌సేవ‌లు కొన‌సాగిస్తాయి. కానీ ఏడాదికి పైగా ఆరోగ్య‌శ్రీ వైద్య సేవ‌ల బిల్లులు బకాయి పెట్టడంతో దీనిపై ఆధారపడిన అనేక హాస్పిటళ్లు దివాలా తీసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక్కో ఆసుప‌త్రికి రాష్ట్ర ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న చిన్న ప్రైవేట్ ఆసుప‌త్రులు కోట్లాది రూపాయ‌ల బ‌కాయిల‌ను త‌ట్టుకునే ప‌రిస్థితిలో లేవు. కొన్ని కార్పొరేట్ ఆసుప్ర‌తులు మిన‌హా చాలా ఆసుప‌త్రులు బ‌కాయిలు స‌కాలంలో రాక వైద్య సేవ‌లు కొన‌సాగించే ప‌రిస్థితిలో లేవ‌ని ఒక ప్రైవేట్ ఆసుప‌త్రి య‌జ‌మాని తెలిపారు. ఏడాది కాలంగా ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తిరిగి వైద్య సేవ‌లు అందించే ప‌రిస్థితి ఉంటుంద‌ని అన్నారు. వైద్య రంగంలో నెల‌కొన్న పోటీని త‌ట్టుకోవాలంటే ఆధునిక సౌక‌ర్యాలు ఉండాల‌ని, వాట‌న్నింటికీ అత్య‌ధికంగా ఖ‌ర్చు అవుతుంద‌ని చెపుతున్నారు. ఇలాంటి ఖ‌ర్చులు త‌ట్టుకోవాలంటే తమకు కనీసం రావాల్సిన బిల్లులు చెల్లిస్తే చాల‌ని అంటున్నారు. బిల్లులు చెల్లించ‌కుంటే విధి లేని ప‌రిస్థితిలో వైద్య సేవ‌లు బంద్ చేయ‌డం మిన‌హా త‌మ‌కు మ‌రో మార్గం లేద‌ని ప్రైవేట్ ఆసుప‌త్రుల యాజమన్యాలు చెబుతున్నాయి.