నిర్భందాన్ని అధిగ‌మించి స‌డ‌క్ బంద్‌

నిర్భందాన్ని అధిగ‌మించి స‌డ‌క్ బంద్ జ‌రిగింది. నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటూ అఖిల‌ప‌క్షం జాతీయ ర‌హ‌దారుల‌పై ర‌స్తారోకో చేప‌ట్టింది.

నిర్భందాన్ని అధిగ‌మించి స‌డ‌క్ బంద్‌
  • రోడ్ల‌పైకి వ‌చ్చిన అఖిల‌ప‌క్షం
  • కోదండ‌రాం, మ‌ల్లుర‌వి, సంప‌త్‌కుమార్‌, రియాజ్‌ల హౌస్ అరెస్ట్‌
  • సూర్యాపేట‌, సిద్దిపేట‌. జ‌డ్చ‌ర్ల‌, ఖ‌మ్మం, స‌రూర్‌న‌గ‌ర్ త‌దిత‌ర చోట్ల ర‌స్తారోకోలు
  • విద్యార్థుల్లో ఉన్న మాన‌సిక ఆందోళ‌కు ప్ర‌వ‌ళిక మృతి అద్దం ప‌డుతోంది: కోదండ‌రామ్‌

విధాత న్యూస్‌ నెట్ వ‌ర్క్‌: నిర్భందాన్ని అధిగ‌మించి స‌డ‌క్ బంద్ జ‌రిగింది. నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటూ అఖిల‌ప‌క్షం జాతీయ ర‌హ‌దారుల‌పై ర‌స్తారోకో చేప‌ట్టింది. నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌న్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే అని నిన‌దించింది. గ్రూప్‌-2ప‌రీక్ష‌తో పాటు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువ‌తి ప్ర‌వ‌ళిక ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా వేయ‌డంతో తీవ్ర‌మాన‌సిక ఒత్తిడికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలియ‌డంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. నిరుద్యోగుల‌కు అండ‌గా అఖిల ప‌క్షం చేప‌ట్టి ఆందోళ‌న నిర్భందం మ‌ధ్య జ‌రిగింది. హైద‌రాబాద్‌లో తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షులు ప్రొఫెసర్ కోదండ‌రామ్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లుర‌వి, మ‌రోనేత రియాజ్‌, గ‌ద్వాల జిల్లా శాంతి న‌గ‌ర్‌లో మాజీ ఎమ్మెల్యే సంప‌త్‌కుమార్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. విప‌క్షాల నేత‌ల‌కు ఫోన్‌లు చేసి ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డినందున ర‌స్తా రోకోలు చేస్తే సీరియ‌స్ కేసులు ఉంటాయ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షులు కోదండ‌రాం తెలిపారు. అయితే దీనిపై ఎన్నికల ప్ర‌ధానాధికారిని, అడిష‌న‌ల్ డీజీపీల‌ను సంప్ర‌దిస్తే అలాంటిదేమి ఉండ‌ద‌ని తెలిపార‌న్నారు. అయితే స్థానిక పోలీసులు అతి ఉత్సాహం చూపించార‌ని అన్నారు. వ‌రుస‌గా పోటీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌డం, పేప‌ర్‌లీకేజీల ప్ర‌భావం విద్యార్థుల‌పై తీవ్రంగా ఉంద‌ని కోదండ‌రాం అన్నారు. విద్యార్థుల్లో ఉన్న మాన‌సిక ఆందోళ‌న‌కు ప్ర‌వ‌ళిక మృతి అద్దం ప‌డుతుంద‌న్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 200 మంది నిరుద్యోగులు భ‌విష్య‌త్‌పై ఆశ‌లు కొర‌వ‌డి చ‌నిపోయార‌ని, ఇవ‌న్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లేన‌ని కోదండ‌రాం ఆరోపించారు.

 

టీఎస్పీఎస్సీని బోర్డును రద్దు చేసి కొత్త క‌మిషన్ ఏర్పాటు చేసి, ఖాళీగా ఉన్న అన్ని పోస్ట్ లకు నోటిికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తు చేప‌ట్టిన‌ స‌డ‌క్‌బంద్ సూర్యాపేట‌, స‌రూర్‌న‌గ‌ర్‌, సిద్దిపేట‌, షాద్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం ల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో విజ‌య‌వంతంగా జ‌రిగింది. దీంతో జాతీయ ర‌హ‌దారుల‌పై భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు, రాస్త‌రోకోలు నిర్వ‌హించారు. జాతీయ ర‌హ‌దారుల‌పై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళ‌న కారుల‌ను అరెస్టు చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. కాగా వ‌రంగ‌ల్‌లో క‌లెక్ట‌ర్ కు విన‌తి ప‌త్రం అందించారు.

సిద్దిపేటలో

టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, పీడీఎస్‌యుల అధ్వర్యంలో బాబు జగ్జివన్ రామ్ చౌరస్తా నుండి రంగాధంపల్లి అమర వీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.త్రి టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మోహన్ ,పీడీఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్,ప్రజాఫ్రంట్ నాయకుడు సత్తయ్యలు మాట్లాడుతూ టిఎస్పీఎస్సి బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ అసమర్థత వల్ల హైదరాబాద్ చిక్కడపల్లి హాస్టల్ లో ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని,ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడ్డారని ,అన్ని పోటీ పరీక్షలను లీక్ చేసి,వాయిదాలు వేసి నిరుద్యోగులను మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు.


 


తక్షణమే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి ని విధుల నుండి తొలగించిన తర్వాతనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వన్ టైమ్ రిజిష్టర్ చేసుకున్న ప్రతి నిరుద్యోగి కి 3 లక్షల రూపాయల నష్టరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను గుర్తించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

వ‌రంగ‌ల్‌లో..

టీఎస్‌పీ‌ఎస్‌సీ పై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థి యువజనులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. టీఎస్‌పీ‌ఎస్‌సీ నిర్లక్ష్యంపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినతి పత్రాన్ని గేటుకు పెట్టారు. అనంతరం నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా నిలవాలని అన్నారు. ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా టీఎస్‌పీ‌ఎస్‌సీ సభ్యులను తొలగించి ప్రక్షాళన చేయాలన్నారు. అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా ఉపాధ్యాయ పోస్టులు 13,500 కు పెంచాలని కోరారు. పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని అన్నారు.