కాంగ్రెస్‌వైపే తెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజల మూడ్ కాంగ్రెస్‌వైపే ఉన్నదని, గెలువబోయేది తామేనని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

– రాబోయేది మా ప్రభుత్వమే
– డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం
– కాలం చెల్లిన బీఆరెస్ సర్కార్
– సీఎం కేసీఆర్ కుటుంబానికి,
4 కోట్ల ప్రజలకు మధ్య పోరు
– అందులో ప్రజలే గెలుస్తారు
– జోడో యాత్ర ఫలితం ఇస్తుంది
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మూడ్ కాంగ్రెస్‌వైపే ఉన్నదని, గెలువబోయేది తామేనని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ప్రజలు విజయం సాధించడం ఖాయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని ఇండిటుడే జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రశ్నలకు రేవంత్ సమాధానమిస్తూ.. ఎంతటి మంచి ఔషధానికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని, అలాగే కేసీఆర్ పరిపాలనకు కూడా కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
గ్రౌండ్ లెవల్లో బీఆరెస్ పునాది బాగా ఉన్నది. ప్రతిసారీ సీఎం కేసీఆర్ గెలుస్తున్నారు కదా! పోయిన ఎన్నికల్లో మీకు 29% ఓట్లు వస్తే, బీఆరెస్‌కు 47% ఓట్లు వచ్చాయి. అలాంటప్పుడు మీ గెలుపు ఎలా సాధ్యమంటారు?
కేసీఆర్ ఎక్సపైరీ మెడిసిన్. ఎంతమంచి మెడిసిన్‌కైనా ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది. అలా కేసీఆర్ ఈసారి ఎక్స్‌పైరీ మెడిసినే. మేం ఎలా గెలుస్తామంటే.. నేను పోటీ చేసిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. 35 లక్షల జనాభా ఉన్న ఆ స్థానంలో బీఆరెస్ 2014లో మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీట్లన్నింటిలో బీఆరెస్ గెలిచింది. కానీ.. మూడు నెలల తర్వాత నేను ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 11,500 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఇదెలా సాధ్యమైందంటే.. ప్రజల మూడ్ కాంగ్రెస్ వైపు ఉంది. ఈసారి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు.
హైదరాబాద్‌లో నేను ప్రజలతో మాట్లాడాను. ఎవరూ అలా అనటం లేదు. కేసీఆర్ హైదరాబాద్‌కు ఐటీ హబ్ ఇంకా ఇలా చాలానే తెచ్చారని అంటున్నారు కదా!
కేసీఆర్ హైదరాబాద్‌కు చేసిందేమీలేదు. ఇది అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, అంటే 1993లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే ఐటీ, ఇంకా అనేక అభివృద్ధి పథకాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు పరిపాలనలో మరికొన్ని జరిగాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఈ రోజున్న మెట్రో, కృష్ణానది నీటి సరఫరా, ఇతర ప్రాజెక్టులు వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్ చేసింది. ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కేసీఆర్ చేసిందేమీలేదు.
గ్రేట్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆరెస్ విజయాలు సాధించింది. మరి ఈ ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారు?
ఒక్క కాంగ్రెస్ పార్టీనే కొట్లాడితే అది కాకపోవచ్చు. కానీ ఈ రోజు ఒక్క కాంగ్రెస్సేకాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారు. అందువల్ల అది సాధ్యమే.
అంటే ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలా?
తెలంగాణను భ్రష్టుపట్టించిన కేసీఆర్ కుటుంబానికి, వారి చేతిలో మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నఎన్నికలు. అందువల్ల ప్రజలు తప్పక గెలిచి తీరుతారు.
గెలుస్తామన్న విశ్వాసం మీకు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత వచ్చిందా? మీ పార్టీ ఇప్పటికీ బలహీనంగానే ఉన్నది. ఈ రెండేళ్లలోనే ఇంత మార్పు వచ్చి మీరు గెలుస్తారని అనుకుంటున్నారా?
రెండేళ్లు అంటే ఎక్కువే. రాజకీయాల్లో, ప్రజల్లో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా కాంగెస్ పట్ల దేశంలో ప్రజల అభిప్రాయం మారుతూ వస్తున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలకు దగ్గరయ్యారు. అది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది. అది కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పని చేసింది. తెలంగాణ ప్రజల్లో కూడా జోడో యాత్ర ప్రభావం ఉంటుంది. రాహుల్‌గాంధీ చార్మినార్‌లో జాతీయ జెండాను ఎగరేసినప్పుడు లక్షల మంది హాజరయ్యారు. అలా తెలంగాణలో కాంగ్రెస్‌కు జోడో యాత్ర కలిసివస్తుంది.
అంటే మీరు ఎంఐఎం కోట పాతబస్తీలో ఎంఐఎంను, ఒవైసీని ఓడిస్తారా?
ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీకి వచ్చిన సానుకూలత ఇప్పటికీ ఉన్నది. మీరు చూస్తూ ఉండండి. ఎంఐఎం, ఒవైసీలను కూడా తప్పకుండా అక్కడి ప్రజలు దూరం పెట్టే రోజు వస్తుంది.
అవినీతిపై మీరు మాట్లాడుతున్నారు. అసలు అవినీతి రేవంత్ రెడ్డిలోనే ఉన్నదని, కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని ప్రచారం జరిగింది.. నిజమేనా?
కాంగ్రెస్‌లో టికెట్లు తీసుకునేవారే ముందు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ వారే కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మాటల్లోని వైరుధ్యాన్ని గమనించాలి. కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే మాపై దుష్పచారం చేస్తున్నారు. టికెట్ల పంపిణీ అంతా పార్టీ ఢిల్లీ హైకమాండ్ చూసుకున్నది.
కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు?
కాంగ్రెస్ పార్టీ అవుతుంది. పార్టీకి చెందిన నాయకులవుతారు. అంతే తప్ప ఫలానా నాయకుడని కాంగ్రెస్ ముందే చెప్పదు.
అంటే.. మీరు నవ్వుతున్నారు కదా! మీరే సీఎం అవుతున్నారా! కేసీఆర్ కూడా కాంగ్రెస్‌కు సీఎం ఫేస్ లేదని చెబుతున్నారు!
నేను సీఎం అవ్వాలని ఎన్నికల్లో కొట్లాడటం లేదు. రాష్ట్రంలో పార్టీని గెలిపించాలనే బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. అంతేకానీ.. సీఎం పదవికోసం కాదు. సీఎం ఎవరన్నది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు హైకమాండ్ నిర్ణయిస్తుంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం. పాత్ర ఉన్నాయా?
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రం. అయితే బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలూ అనధికారికంగా ఒక కూటమిగా ఎన్నికల్లో కలిసి నడుస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ ఇండియా కూటమిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ రెండు పక్షాల మధ్యే పోరు సాగుతుంది.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చితే మీకు నష్టం కాదా!
బీజేపీ చీల్చేది కాంగ్రెస్ ఓట్లను కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయనే బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం తెరవెనుక కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా సాగుతున్నాయి.
బీఆరెస్ అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు?
మా ప్రభుత్వం వస్తే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం. దోషులను శిక్షిస్తాం.
మీరు ఇంతమంచి బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్వ్యూ ఇచ్చారు. డిసెంబర్ 3న లేదా ఆ తర్వాత కూడా ఇస్తారా?
కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో పదిన్నరకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అనంతరం మీకు మా ఇంటివద్ద లంచ్, ఇంటర్వ్యూ దొరుకుతుంది.
అంటే మీకు అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఉందా?
తప్పకుండా. ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాం.