సంక్షేమం గట్టెక్కిస్తుందా…!
సంక్షేమం... అధికార బీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా లేని బీజేపీ ఈ మూడుపార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి

- ఓటర్లు 3.26 కోట్లు – లబ్ధిదారులు 3.1 కోట్లు
- రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలు అమలు
- లబ్ధిదారుల ఎంపికపై అసంతృప్తి
- అందరికి అందని ఇల్లు, దళిత బంధు
- దరఖాస్తుల వద్దనే ఆగిన బీసీలకు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి
సంక్షేమం… అధికార బీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా లేని బీజేపీ ఈ మూడుపార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. బీఆరెస్ పార్టీ దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం కూడా అమలుచేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెపుతున్నది. రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచామని చెప్పుకుంటున్నది. అలాగే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నది. అయితే దీనికి మించిన సంక్షేమం అమలు చేస్తామని కాంగ్రెస్ చెపుతున్నది. ఈ మేరకు మ్యానిఫెస్టో కూడా విడుదల చేసింది. బీసీనే సీఎంను చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల వేళ ఎవరి సంక్షేమం మాటను ప్రజలు నమ్ముతారన్నదే అసలు ప్రశ్న…
87.56 లక్షల కుటుంబాలు, 2.80 కోట్ల మందికి రేషన్ బియ్యం
38,49,155 మందికి అన్నిరకాల పెన్షన్లు
60.54 లక్షల మందికి రైతు బంధు
లక్ష్యం 2.72 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు- ఇచ్చింది లక్షలోపే
దళిత బంధు మొదటి విడత 38,323 మందికి లబ్ధి
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న బీఆరెస్ పార్టీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించామని చెపుతున్నది. ఈ మేరకు 87.56 లక్షల కుటుంబాలకు చెందిన 2.80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని, 38 లక్షల 49 వేల 155 మందికి అన్ని రకాల ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నామని చెపుతున్న సర్కారు… రైతుకు ధీమా కోసం 60.54 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని చెపుతున్నది. రాష్ట్రంలో 2019 నాటికి 2.72 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటివరకు నిర్మించి ఇచ్చింది కేవలం లక్షలోపు మాత్రమే.
ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓట్ల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా పార్టీలు ఒకరిని మించి ఒకరు హామీలు ఇస్తున్నారు. ఇలా నగదు పంపిణీని ఒక ప్రవాహంలా చేశారు.
అయితే ఈ సంక్షేమ పథకాలే పార్టీలకు ఓట్లు రాలుస్తాయా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి తాజాగా సంక్షేమ పథకాలే గుదిబండగా తయారయ్యాయి. ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆశావహుల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసమే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో 2019 నాటికి 2.72 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 2024 నాటికి మరో 3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇస్తామని బీఆరెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.22 వేల కోట్లు ఖర్చుఅవుతాయని అంచనావేసింది. కానీ వాస్తవంగా రూ.12,272.61 కోట్లతో 1,94,858 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటివరకు 1,48,521 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, లబ్ధిదారులకు ఇచ్చింది మాత్రం కేవలం లక్ష లోపు మాత్రమే ఉంటాయని సమాచారం. లబ్ధిదారుల ఎంపిక కష్టం కావడంతో నిర్మించిన ఇండ్లు కూడా ఇవ్వలేదని తెలిసింది. అయితే ఒక ఊర్లోనో, బస్తీలోనో ఇల్లు లేని వాళ్లు చాలా మంది ఉంటే ఒకరిద్దరికే ఇండ్లు రావడంతో మిగతా వాళ్లు వ్యతిరేకత పెంచుకున్నారన్న చర్చ జరుగుతోంది.
నల్లగొండ జిల్లా మల్లెపల్లికి చెందిన ఒక మహిళా కూలి ‘విధాత’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘అయ్యా మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు.. వారందరికి పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలున్నారు. అంతా వేరు పడ్డారు కానీ ఒక్కటే ఇల్లు ఇచ్చిండ్రు.. రోజు ఇంటి వద్ద కొట్లాట జరుగుతుంది’ అంటూ వాపోయింది. మాల్ సెంటర్‌లో ఒక టీ అమ్ముకునే వ్యక్తి మాట్లాడుతూ ‘బీఆరెస్ వాళ్లకే పథకాలు ఇచ్చుకున్నారని అన్నాడు.. అలాంటప్పుడు వాళ్లకు బీఆరెస్ వాళ్లే ఓట్లేస్తారు.. మా ఓట్లు ఎందుకు’ అని ప్రశ్నించాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకువచ్చిందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కొద్దిగా ముందు 2021 ఆగస్టు16వ తేదీన బీఆరెస్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నియోజకవర్గం అంతా అమలు చేసినా, రాష్ట్రంలో మొదట ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి మాత్రమే వర్తింపజేశారు.
ఇలా మొదటి విడతలో 38,323 మందికి లబ్ధి చేకూరింది. రెండవ విడతలో 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందించాలని నిర్ణయించినా చివరి సమయంలో ఈ నిర్ణయం జరగడంతో పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. లబ్ధిదారుల కేటాయింపే తక్కువగా ఉంది. దీంతో ఊరికి ఒక్కరిద్దరికి కూడా దళిత బంధు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పథకానికి పది మంది అర్హులుంటే ఒక్కరికే లబ్ధి జరగడంతో మిగతా వాళ్లంతా వ్యతిరేకం అవుతున్నారన్న చర్చ గ్రామస్థాయిలో జరుగుతున్నది. పైగా బీఆరెస్ కార్యకర్తలకే దళిత బంధు పథకం ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే తీరుగా బీసీ బంధు పథకానికి దరఖాస్తులు తీసుకున్నారు కానీ పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే వందల సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో విమర్శల పాలైంది.
గృహలక్ష్మి పథకం కింద ఇంటి జాగా ఉన్న వారికి రూ.3 లక్షల నగదు ఇస్తామని దరఖాస్తులు ఆహ్వానించారు. ఇది ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగా జరిగింది. దీంతో దరఖాస్తుదారులను ఎంపిక చేసి పథకం డబ్బులు సరిగ్గా అందించలేక పోయింది. ఇలా ఆయా పథకాల లబ్ధిదారుల కంటే అవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీంతో సర్కారు తీరుపై క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రైతులకు రైతు బంధు, రైతు బీమా దిగ్విజయంగా అమలు చేస్తున్నా… ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో రైతులు సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలకు ముందు కొంత మందికి మాఫీ జరిగినా రాష్ట్రంలో అందరికి అమలు కాలేదని తెలుస్తోంది. ఇలా పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పథకాలు ఎన్ని అమలు చేసినా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్‌క్తమవుతోందని అంటున్నారు.
ప్రభుత్వంపై వివిధ పథకాల లబ్ధిదారులు కూడా అసంతృప్తితో ఉన్నారని, మరో వైపు సీఎం కేసీఆర్ ఎవరినీ కలువడన్న చర్చ గ్రామ స్థాయిలో కూడా జరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతుందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. ప్రజల ఆలోచనా సరళిని పరిశీలిస్తే పథకాలు, ఆర్థిక లబ్ధి కన్నా.. ఆత్మగౌరవం అనే తీరుగా చర్చ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పథకాల ప్‌ంభావం ఏమేరకు ఉంటుందన్న చర్చ విస్త్రృతంగా జరుగుతోంది.