నేడు వైఎస్సార్టీపీ సమావేశం.. ఒంటరి పోరుకు నిర్ణయం?

వైఎస్సార్టీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎన్నికల్లో వ్యూహాలపై చర్చించేందుకు కార్యవర్గం గురువారం లోటస్ పాండ్‌లో భేటీ కానుంది

నేడు వైఎస్సార్టీపీ సమావేశం.. ఒంటరి పోరుకు నిర్ణయం?

విధాత: వైఎస్సార్టీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం గురువారం లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో భేటీ కానుంది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటికే పలు పర్యాయాలు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. షర్మిల పార్టీ విలీనాన్ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె ఏపీ రాజకీయాలకే పరిమితమైతే విలీనానికి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగదలుచుకున్న షర్మిల తన పార్టీ విలీన ప్రక్రియపై రాష్ట్రస్థాయిలో భిన్నాభిప్రాయలు ఉండటంతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివశంకర్ ద్వారా చర్చలు ముందుకు తీసుకెళ్లారు.

అనంతరం స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ విలీన ప్రక్రియ ఇక లాంఛనమేనని అంతా భావించారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ ఒత్తిడికి తలొగ్గి షర్మిల పార్టీ విలీనంపై మౌనంగా ఉండిపోయింది. తన పార్టీ విలీనం కోసం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు కోసం ఎదురుచూసిన షర్మిల నవంబర్ 30 వరకు డెడ్‌లైన్ కూడా పెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కాంగ్రెస్ నుంచి విలీనం దిశగా ఆహ్వానం లేకపోవడంతో ఇక ఒంటరి పోరుకే సిద్ధం కావాలని షర్మిల నిర్ణయించుకుంది. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు.. ఏదైనా పార్టీతో సీట్ల సర్ధుబాటుతో వెళితే మంచిదా అన్నదానిపై చర్చించేందుకు వైఎస్సార్టీపీ పార్టీ కార్యవర్గం కీలక భేటీ నిర్వహిస్తున్నది.

కాగా ఈ ఎన్నికల్లో షర్మిల తాను మొదటి నుంచి చెబుతున్నట్లుగా పాలేరు నుంచే పోటీ చేస్తారా లేక కొత్తగా సాగతున్న ప్రచారం మేరకు మిర్యాలగూడ సీటు నుంచి లేక, గ్రేటర్ పరిధిలో మరో స్థానం నుంచి పోటీ చేస్తారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుండి పోటీ చేయవచ్చని, అలాగే వైఎస్ విజయమ్మ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా వినిపిసున్నది. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేయవచ్చన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరందుకుంది. షర్మిల, విజయమ్మల పోటీపై పార్టీ కార్యవర్గ భేటీలో స్పష్టత రానుంది.