అమెరికాకు, ఇండియాకు మధ్య తేడా ఇదీ! ఆలోచన రేకెత్తించిన మహిళ వ్యాఖ్యలు

అమెరికా అంటే డాలర్‌ డ్రీమ్స్‌.. విలాసవంతమైన జీవితాలు.. పెద్ద పెద్ద జీతాలు అనేది సాధారణంగా ఉండే అభిప్రాయం. ఈ డబ్బులు, విలాసాల కోసమే అమెరికాలో పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని అనుకుంటారు

అమెరికాకు, ఇండియాకు మధ్య తేడా ఇదీ! ఆలోచన రేకెత్తించిన మహిళ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అంటే డాలర్‌ డ్రీమ్స్‌.. విలాసవంతమైన జీవితాలు.. పెద్ద పెద్ద జీతాలు అనేది సాధారణంగా ఉండే అభిప్రాయం. ఈ డబ్బులు, విలాసాల కోసమే అమెరికాలో పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని అనుకుంటారు. కానీ.. ఒక మహిళ అమెరికాకు, ఇండియాకు మధ్య ఉన్న తేడాలను చెబితే.. నెటిజన్లు అభినందనల వర్షం కురిపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టిన మహిళ.. ఇండియాలో, అమెరికాలో నాణ్యమైన జీవనం విషయంలో తన అభిప్రాయాలను విస్పష్టంగా పంచుకున్నది. ‘ఏదో షాప్‌ నుంచి సరుకులు ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడం, పనిమనిషిని పెట్టుకుని ఇంటి పనులు చేయించుకోవడం లగ్జరీ జీవితంగా తాను అనుకునేదాన్ని. కానీ.. అమెరికాకు వెళ్లిన తర్వాత పరిశుభ్రమైన గాలి, చక్కని రోడ్లు నిజమైన నాణ్యమైన జీవనంగా అనిపించాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఊహించిన విధంగానే ఆమె పోస్టుపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు ప్రతికూల స్పందనలు వ్యక్తం చేశారు.

‘అమెరికాలో ఇది నాకు 11వ రోజు. నిన్న సాయంత్రం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇది మీలో కొందరిని ప్రేరేపించవచ్చు. ఒకరి అభిప్రాయంతో కూడిన ఆన్‌లైన్‌ టెక్ట్స్‌ మిమ్మల్ని ప్రేరేపించిందంటే.. అది మీరు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, మీ సొంత శక్తి కోసం దానిని రక్షించుకోవాలి’ అని నిహారికా కౌర్‌ సోధి అనే ఎక్స్‌ యూజర్‌ రాశారు. ఆ తర్వాత ఆమె ఇండియాలో విలాసవంతమైన జీవితం అని తాను భావించిన అంశాలు రాశారు. ‘క్విక్‌ ఫుడ్‌ డెలివరీస్‌, పది నిమిషాల్లో సరుకుల డెలివరీ, చౌకగా దొరికే పనిమనుషులు. కానీ.. అమెరికా వెళ్లిన తర్వాత కనీసావసరాలైన ‘నాణ్యమైన గాలి’, ‘నిరంతరాయ విద్యుత్తు సరఫరా’, ‘పరిశుభ్రమైన నీరు’, ‘పెద్ద ఎత్తున పచ్చదనం’, ‘మంచి రోడ్లు’ అసలైన నాణ్యమైన జీవితం అని నాకు అర్థమైంది. రెండు దేశాల్లోని నాణ్యమైన జీవితాల గురించి మరిన్ని ఆలోచనలు పంచుకున్న సోధి.. ఏది ఏమైనా.. నాణ్యమైన జీవితం, విలాసవంతమైన జీవితం గురించి ఇది మారిన నా నిర్వచనం.

పైవాటిలో దేనినైనా నేను ఎప్పటికైనా పొందగలనో లేదో. కానీ.. ఆ ఆలోచన మాత్రం నా మనసులో తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ ఆమె తన పోస్టును ముగించింది. ఈ పోస్టు షేర్‌ చేసిన దగ్గర నుంచి 3.8 లక్షల వ్యూస్‌ వచ్చాయి. 2800 మంది ఈ పోస్టును ఇష్టపడుతున్నట్టు ఎమోజీ పెట్టారు. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించేవారు, వ్యతిరేకించేవారి మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగింది. ‘వందశాతం నేను ఆమెతో ఏకీభవిస్తాను. ఈ అభిప్రాయం చెప్పడానికి ధైర్యం కావాలి. సివిక్‌ సెన్స్‌ అనేది పెద్ద స్థాయిలో నిరాదరణకు గురైంది.’ అని ఒకరు స్పందించారు. భారతదేశంలోని ఏ నగరం నుంచైనా 50 కిలోమీటర్ల దూరంలో మీరు అటువంటి జీవితాన్ని పొందవచ్చు’ అని మరొకరు రాశారు. ‘రెండు చోట్లా సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. ఒకే చోట అన్నీ కుదరవు’ అని ఇంకొకరు పేర్కొన్నారు. నాకు అవి కావాలని అనిపించినప్పుడు ఏ అమెరికాకో, బ్రిటన్‌కో పర్యాటకుడిగా వెళ్లి ఎంజాయ్‌ చేస్తా. కానీ.. అక్కడే ఉండేవారు భారతదేశంలో లైఫ్‌ను మిస్‌ అవుతారు’ అని ఒక యూజర్‌ స్పందించారు.