ఆధిపత్యాన్ని దిక్కరించిన వీర వనిత చిట్యాల ఐలమ్మ
విధాత, నల్లగొండ: భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల ఆగడాలను ఎదిరించి నిలిచిన వీరవనిత చిట్యాల(చాకలి) ఐలమ్మ అని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున అన్నారు. ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగినదని అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ విద్యావంతుల వేదిక, కేవీపీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న ఐలమ్మ […]

విధాత, నల్లగొండ: భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల ఆగడాలను ఎదిరించి నిలిచిన వీరవనిత చిట్యాల(చాకలి) ఐలమ్మ అని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున అన్నారు. ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగినదని అన్నారు.
శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ విద్యావంతుల వేదిక, కేవీపీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ..
నిజాం నిరంకుశంగా పరిపాలిస్తున్న కాలంలో, వారి అందండలతో దొరలు, భూస్వాములు నిమ్న వర్గాల ఇండ్లలోకి ప్రవేశించి అనేక అకృత్యాలకు ఒడి కట్టేవారన్నారు. స్వతహాగా తమ భూములను తాము సాగు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న పేద వర్గాల ఎదుగుదలను జీర్ణించుకోలేని దొరలు పేదలను అణగదొక్కడానికి అనేక ప్రయత్నాలు చేసేవారన్నారు. అలాంటి వారి ఆగడాలను అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది అన్నారు.

కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజలను దొరలు అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ అణచివేస్తున్న సమయంలో చాకలి ఐలమ్మ గ్రామ గ్రామాన తిరిగి సాయుధ పోరాటపు జ్వాలలను తెలంగాణ ప్రజలకు అందించి చైతన్యవంతం చేయడంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.
నేడు చాకలి ఐలమ్మను స్మరించుకోవడం అంటే అన్యాయానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడడమేనని, తెలంగాణ సమాజానికి వారు అందించిన స్ఫూర్తి వెలకట్టలేనిదన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, జాతీయ మాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, మాల మహానాడు రేఖల సైదులు తదితరులు పాల్గొన్నారు.