మునుగోడు: 18 తర్వాత సమరమే.. ఉపపోరుకు కత్తులు నూరుతున్న పార్టీలు
విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత రావడంతో ప్రచార పర్వంను ఉదృతం చేసేందుకు పార్టీల నాయకత్వం కార్యచరణకు పదును పెడుతున్నాయి. అయితే సెప్టెంబర్ 17న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమైక్యత దినం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుండటం, బీజేపీ విమోచన దినోత్సవాల పేరిట, కాంగ్రెస్ తెలంగాణ విలీన దినోత్సవం పేరిట స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ వేడుకలు ముగిశాక ప్రచారంలో దూకుడు పెంచాలని బావిస్తున్నాయి. ఈ […]

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత రావడంతో ప్రచార పర్వంను ఉదృతం చేసేందుకు పార్టీల నాయకత్వం కార్యచరణకు పదును పెడుతున్నాయి. అయితే సెప్టెంబర్ 17న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమైక్యత దినం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుండటం, బీజేపీ విమోచన దినోత్సవాల పేరిట, కాంగ్రెస్ తెలంగాణ విలీన దినోత్సవం పేరిట స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ వేడుకలు ముగిశాక ప్రచారంలో దూకుడు పెంచాలని బావిస్తున్నాయి.
ఈ దిశగా ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు అనధికారికంగా ఖరారై ఉండడంతో ఆ మూడు పార్టీల నుంచి త్రిముఖ పోటీకి తెర లేచినట్లయ్యింది.
అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిన్న మొన్నటి దాకా క్షేత్రస్థాయిలో కొంత వెనుకబడినప్పటికి అభ్యర్థిని ప్రకటించగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో జోష్ పెంచేందుకు వెంటనే కాంగ్రెస్ సీనియర్లను నియోజకవర్గంలో మండలాల ఇంచార్జీ లుగా బాధ్యతలు అప్పగించారు. ఈనెల 18 నుంచి ఇంటింటి ప్రచారానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం రంగంలోకి దిగాలని నిర్దేశించారు.
గ్రామ గ్రామానికి ప్రతి బూతుకు పది మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేసి ఇంటింటి ప్రచారానికి కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి సెప్టెంబర్17 జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల వారీగా మోహరించి ఇంటింటి ప్రచారం ఉదృతం చేయనున్నారు.
జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో పార్టీ గెలుపుకు కేసీఆర్ స్వయంగా ప్రణాళికాలను అమలు చేయబోతున్నారు. సెప్టెంబర్17లోగా కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారితో సీఎం కేసీఆర్ చర్చలు పూర్తి చేసి, అసమ్మతి లేకుండా గులాబీ కారు ప్రచారం వేగవంతం చేయాలని కేసీఆర్ యోచనగా ఉంది.
ఇక బీజేపీ నుంచి అమిత్ షా సభా పిదప ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డినే పార్టీ ప్రచారం చేస్తూ చేరికల పర్వంలో నిమగ్నమయ్యారు. అయితే బీజేపీ ప్రచార రంగంలో పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులను దించి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తించాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సీలాల్, ఈటల, వివేక్ వంటి వారితో ఒక సమన్వయ కమిటీ వేసి బీజేపీ గెలుపునకు ప్రచా వ్యూహాలను ముందుకు దూకించనుంది. ఏది ఏమైనా సెప్టెంబర్17 వేడుకలు ముగిశాకే ప్రచార పర్వాన్ని హోరెత్తించాలని బావిస్తుండటంతో రాబోయే మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం ఎంత రసవత్తరంగా సాగనుందోనన్న ఆసక్తి నెలకొంది.