చలిలో 17 కిలోమీటర్లు నడిచి.. అధికారులను కలిసిన 60 మంది బాలికలు

విధాత: హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులు, అనుదినం సమస్యల చిక్కుముడులు, చెప్పుకుంటే పంట్టించుకొనే వారు లేక ఆ బాలికలు ప్రాణాలకు తెగించారు. జిల్లా కలెక్టర్‌కు చెప్పుకుంటేనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో రాత్రిపూట 17 కిలోమీటర్లు నడిచారు. విద్యార్థుల అవస్థను చూసిన వారంతా ఆడబిడ్డలకు ఎంత కష్టం.. ఎంత కష్టం అని కన్నీరు పెట్టుకొన్నారు. ఝార్ఖండ్‌ సింగ్‌భూమ్ జిల్లా ఖాంట్‌పానీ ప్రాంతంలో కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్‌ పాఠశాల బాలికలవి చెప్పుకొంటే తీరని కష్టాలు. పురుగుల అన్నం, ఎర్రని […]

చలిలో 17 కిలోమీటర్లు నడిచి.. అధికారులను కలిసిన 60 మంది బాలికలు

విధాత: హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులు, అనుదినం సమస్యల చిక్కుముడులు, చెప్పుకుంటే పంట్టించుకొనే వారు లేక ఆ బాలికలు ప్రాణాలకు తెగించారు. జిల్లా కలెక్టర్‌కు చెప్పుకుంటేనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో రాత్రిపూట 17 కిలోమీటర్లు నడిచారు. విద్యార్థుల అవస్థను చూసిన వారంతా ఆడబిడ్డలకు ఎంత కష్టం.. ఎంత కష్టం అని కన్నీరు పెట్టుకొన్నారు.

ఝార్ఖండ్‌ సింగ్‌భూమ్ జిల్లా ఖాంట్‌పానీ ప్రాంతంలో కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్‌ పాఠశాల బాలికలవి చెప్పుకొంటే తీరని కష్టాలు. పురుగుల అన్నం, ఎర్రని వేడినీళ్లే చారుగా అన్నం పెడ్తారు. ఇదేంటని అడిగితే.. హాస్టల్‌ వార్డెన్‌ అదిరింపులు, బెదిరింపులు. అది కూడా పెట్టకుండా వేధింపులు. స్నానాలకు, టాయిలెట్లలో నీరు కరువు. కనీస అవసరాలు తీర్చాలని వార్డెన్‌ను అడిగితే పట్టింపు లేక పోగా అనునిత్యం వేధింపులు, దౌర్జన్యాలు.

చిన్నపిల్లలను నేలపైనే పడుకోవాలని వార్డెన్‌ హూంకరింపులు. ఎవరైనా అడిగితే బెత్తం దెబ్బలు. ఉన్నతాధికారులు హాస్టల్‌ సందర్శనకు వస్తే.. వారిముందు అంతా సజావుగా ఉన్నదని చెప్పాలని విద్యార్థులకు బెదిరింపులతో వేధింపులు. ఒక రోజు కాదు, ఏడాదంతా అనునిత్యం సమస్యల వలయంలో విద్యార్థులు దుర్భర జీవితం భరించలేక ఉన్నతాధికారులకు చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

ఉదయం పూట ఉన్నతాధికారులకు చెప్పుకోవటానికి పోయే అవకాశం లేదు. కాబట్టి రాత్రి పూటే జిల్లా కేంద్రానికి పోవాలని విద్యార్థినులు నిర్ణయించుకొన్నారు. ఖాంట్‌పానీ నుంచి జిల్లా కేంద్రం ఛాయిబాసాకు కాలినడకన బయలు దేరారు. రాత్రి పూటే 17కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

రాత్రి పూట 60మంది బాలికలు 17 కిలోమీటర్లు నడిచి వచ్చిన ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. ఉన్నతాధికారులు విద్యార్థులను కలుసి సమస్యలు పరిష్కరిస్తామని అనునయించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించటానికి ముందుకు వచ్చారు. హాస్టల్‌లో రోజూ వారీ సమస్యల పరిష్కారం కోసం బాలికలు ఇంతటి త్యాగం చేయాల్సి రావటం పట్ల అధికారులు, నేతలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి.