Outsourcing Employees | ఔట్ సోర్సింగ్‌పై గంద‌ర‌గోళం.. మల్లగుల్లాల్లో ఉద్యోగ నేతలు

Outsourcing Employees | సచివాలయంలోకి శాశ్వత ఉద్యోగులు వస్తున్నారనే కారణంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించవద్దంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ నేతలతో చర్చించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది.

Outsourcing Employees | ఔట్ సోర్సింగ్‌పై గంద‌ర‌గోళం.. మల్లగుల్లాల్లో ఉద్యోగ నేతలు
  • డిప్యూటీ సీఎంకు తెల‌వ‌దు
  • సీఎం రేవంత్ రెడ్డి కలవరు
  • ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో గుబులు

Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల‌ను అకార‌ణంగా తొల‌గించి వేస్తున్నార‌ని, వారిని కొన‌సాగించాల‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఫ‌లితం ద‌క్కేలా క‌న్పించ‌డం లేదు. ఈ విష‌య‌మై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కను ఉద్యోగ సంఘాల నాయ‌కులు క‌ల‌వ‌గా, వారిని తీసివేస్తున్న విష‌యం తన‌కు తెలియ‌ద‌ని అన్నారని ఉద్యోగులే చెబుతున్నారు. గ‌త రెండు వారాలుగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోసం ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా లేదా అనేది తెలియ‌డం లేదు.

బిక్కు బిక్కుమంటూ ఉద్యోగం 

స‌చివాలయంలో శాశ్వ‌త ఉద్యోగులు వ‌చ్చారంటూ త‌మ‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ ఉద్యోగం చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. త‌మ‌ను ఆదుకోవాల‌ని స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నాయ‌కుల‌తో పాటు, మిగ‌తా సంఘాల నాయ‌కుల‌ను కూడా వేడుకుంటున్నారు. విష‌య తీవ్ర‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సంఘం నాయ‌కులు కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిశారు. వారిని తొల‌గించ‌వ‌ద్ద‌ని, స‌ర్ధుబాటు చేయాల‌ని కోర‌గా, త‌న‌కు అలాంటి విష‌యం తెలియ‌ద‌ని చెప్పి అక్క‌డితో ముగించారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు. దీంతో సంఘం నాయకులు కూడా మౌనం వ‌హించారంటున్నారు. ఆర్థిక శాఖ‌కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి తొల‌గింపులో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని బ‌హిరంగంగా ఆరోపిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌త ఇస్తే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కలిసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు రెండు వారాలుగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా స‌ఫ‌లీకృతం కావ‌డం లేదు. ఈ మ‌ధ్య‌లో ఆయ‌న జ‌పాన్ ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌డం, ఇత‌ర‌త్రా బిజీ షెడ్యూల్ కార‌ణంగా అపాయింట్‌మెంట్‌ దొర‌క‌డం లేదంటున్నారు. ముఖ్య‌మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, స్ప‌ష్ట‌త ఇస్తే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Bhu Bharathi | అలా చేస్తే అసైన్డ్‌ పట్టాలు రద్దు : మంత్రి పొంగులేటి
Telangana | ఆర్థిక దిగ్బంధంలో రేవంత్‌ సర్కార్‌! ఆదాయానికీ.. ఖ‌ర్చుల‌కు కుద‌ర‌ని పొంత‌న‌
Revanth Reddy | సీఎంవో ప్ర‌క్షాళ‌న వెనుక మ‌త‌ల‌బేంటి?