Cloudburst Explained | క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?
అసాధారణ వర్షపాతం లేదా భారీ వర్షపాతానికి ప్రత్యేక కారణాలు ఉంటాయా? ఒక్క రోజులో ఎన్ని సెంటిమీటర్ల వర్షపాతం కురిస్తే భారీ వర్షపాతంగా నిర్ణయిస్తారు? ఎన్ని సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షపాతమని పిలుస్తారు? ఇటీవల కాలంలో తరచుగా వినిపించే పదం క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? దీనికి కారణం ఏంటి?

హైదరాబాద్, ఆగస్ట్ 29 (విధాత):
Cloudburst Explained | తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని అర్గొండలో 43 సెం.మీ.వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో 32 సెం.మీ., మెదక్ జిల్లా సర్ధానలో 30.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అసలు అసాధారణ వర్షపాతం లేదా భారీ వర్షపాతానికి ప్రత్యేక కారణాలు ఉంటాయా? ఒక్క రోజులో ఎన్ని సెంటిమీటర్ల వర్షపాతం కురిస్తే భారీ వర్షపాతంగా నిర్ణయిస్తారు? ఎన్ని సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షపాతమని పిలుస్తారు? ఇటీవల కాలంలో తరచుగా వినిపించే పదం క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? దీనికి కారణం ఏంటి? అంటే వాతావరణంలో మార్పులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే క్లౌడ్ బరస్ట్‌తో ఎక్కడ, ఎప్పుడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?
అతి తక్కువ ప్రాంతం (చిన్న ప్రాంతం)లో గంట వ్యవధిలో 100 మి.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. గాలి స్వల్పంగా వేడెక్కడం, దీనితో గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి కుండపోత వర్షానికి కారణమవుతున్నది. ఎత్తైన పర్వతాలు కూడా క్లౌడ్ బరస్ట్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగి, గాలి 7 శాతం అధికంగా తేమను కలిగి ఉంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అస్తవ్యస్త పట్టణీకరణ, అడవులను నరికివేయడం, చిత్తడి నేలలు తగ్గిపోవడం, భూమిలో నీరు ఇంకకుండా నిరోధించడం కూడా క్లౌడ్ బరస్ట్ కు కారణమనే అభిప్రాయాలున్నాయి. తేమతో నిండిన గాలులు (రుతుపవన గాలులు) పర్వతాల వద్ద గాలిని కలిసినప్పుడు ఘనీభవనం ఏర్పడి మేఘాల విస్పోటం లేదా క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతోందని వాతావరణ అధ్యయనాలు చెబుతున్నాయి. భారత వాతావరణ శాఖ డాటా ప్రకారం దేశంలో కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలలో తరచుగా ఇలాంటి కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి.
క్లౌడ్ బరస్ట్ ఎలా ఏర్పడుతోంది?
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన చల్లని గాలులు వీస్తాయి. వర్షం పడే పరిస్థితి ఉన్నా వేడి వాతావరణంతో మేఘాలు ఇంకా ఘనీభవిస్తాయి. అయితే ఇవి బరువు పెరిగి ఏదో ఒక సమయంలో విస్పోటం చెందుతాయి. అలా భారీ వర్షానికి కారణం అవుతాయి. తక్కువ టైంలోనే ఎక్కువ వర్షం రికార్డు కావడానికి ఈ మేఘాలు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఎక్కువ భూమిపై భారీ వర్షం కురిస్తే ప్రభావం లేదా నష్టం అంతగా ఉండదు. తక్కువ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురిస్తే తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలు, లోయలలో, భారీ వర్షం కురిస్తే ఆకస్మిక వరదలు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గాలి తేమను ఎక్కువగా నిల్వ చేసుకొనేందుకు సామర్థ్యం పొందుతుంది. ఇది కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారీ వర్షాలు ఎక్కువగా ఎక్కడ కురుస్తాయి?
తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో గాలులు పైకి లేచేలా కొండలు ఉంటే క్లౌడ్ బరస్ట్‌కు కారణం కావచ్చు. కొండ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, ఎత్తైన ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హిమాలయాలు, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కుంభవృష్టి కురుస్తుంది. మేఘాలు బరువెక్కి ఏదో ఒకచోట పేలిపోతాయి. ఇవి ఎక్కువ కొండ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. రాడార్ డాటా, ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాల ద్వారా క్లౌడ్ బరస్ట్ జరిగే ప్రమాదాన్ని గుర్తించే అవకాశం ఉంది. అయితే అవి ఎక్కడ విస్ఫోటం చెందుతాయనేది అంచనా వేయలేకపోతున్నారు.
తెలంగాణలో ఇలాంటి వర్షాలు కురిశాయా?
తెలంగాణలో ఇప్పటివరకు క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా వాతావరణ శాఖ రికార్డులు లేవు. అయితే అసాధారణ వర్షపాతం నమోదైంది. గంట వ్యవధిలో కాకుండా గంటల వ్యవధిలో వర్షం నమోదైంది. 2020 అక్టోబర్ లో హైదరాబాద్ లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 2000లో 24 సెం.మీ. 2016లో 15, 2019లో 24 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 65. నుంచి 11.5 సెం.మీ వర్షపాతం నమోదైతే భారీ వర్షపాతంగా పరిగణిస్తారు. 11.5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురిస్తే అతి భారీ వర్షపాతం అంటారు. క్లౌడ్ బరస్టులు ఎక్కువగా ఎత్తైన ప్రాంతాల్లో వస్తుంటాయి. 2022 గోదావరి పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని భారత వాతావరణ శాఖ తోసిపుచ్చింది.