Hyderabad Flooded Roads GHMC Negligence | వరదలా ‘ఉదాశీనత’! సొంత రాష్ట్రంలోనూ తీరని వెతలు!
పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న భవనాలకు అనుగుణంగా నగరంలో వర్షపునీటి పైపులైన్ల ఏర్పాటుతోపాటు.. గుంతలులేని రోడ్లు, చెత్తకుప్పలు లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పై ఉంది. ఇలాంటి కీలకమైన బాధ్యతలను కమిషనర్ మొదలు అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లు విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి.

నిర్లక్ష్యం ‘కుండపోత’ – పార్ట్ 2
Hyderabad Flooded Roads GHMC Negligence | హైదరాబాద్, ఆగస్ట్ 19 (విధాత): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, జోరు వానలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం చేయవచ్చని ఆశించిన పౌరులకు భంగపాటే ఎదురయ్యింది. సమైక్య పాలకుల కన్నా ఘోరంగా స్వరాష్ట్ర పెద్దలు పాలన సాగించి, మూడు నాలుగు ఫ్లైఓవర్లు నిర్మించి డాంబిక ప్రచారం చేసుకున్నారు. వలస పాలనలో నగరంలో వర్షాలు కురిసిన సందర్భంలో వర్షం నీటిలో మురుగునీరు కలగలసి పొంగిపొర్లలేదు. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం సర్వసాధారణమే అయినా.. ఇప్పుడున్నట్టుగా ఆనాడు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు లేవని నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు.
బాధ్యత విస్మరించిన జీహెచ్ఎంసీ!
పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న భవనాలకు అనుగుణంగా నగరంలో వర్షపునీటి పైపులైన్ల ఏర్పాటుతోపాటు.. గుంతలులేని రోడ్లు, చెత్తకుప్పలు లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పై ఉంది. ఇలాంటి కీలకమైన బాధ్యతలను కమిషనర్ మొదలు అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లు విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణ, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవడం వంటి వాటిని గాలికి వదిలేశారని పౌర సమాజం విమర్శిస్తున్నది. వర్షాలు కురిసిన సందర్భాలలో వరదనీరు ఎందుకు నిలిచిపోతున్నది? నిలిచిపోకుండా ఏం చేయాలి? ఇందుకోసం వనరులు ఎలా సమకూర్చుకోవాలి? అనే అంశాలపై లక్ష్యాలు నిర్దేశించుకోలేదని పరిశీలకులు అంటున్నారు. ఒక ఏడాది వానాకాలం కాదు ఏకంగా గత పది సంవత్సరాలుగా ప్రతి వానాకాలంలో వానలు దంచికొడుతున్నాయి. అయినా ఉన్నతాధికారులు ఆత్మపరిశీలన చేసుకోకపోవడం, గురుతర బాధ్యతను మరిచిపోవడం శోచనీయం. పది రోజులకు పైబడి వర్షాలు కుండపోతగా కురుస్తున్నా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మొదలు సర్కిల్ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారు. నగరం ఏమైతే మాకేంటి? మాకేం సంబంధం? అంతా హైడ్రా చూసుకుంటుందంటూ.. మిన్నకుండిపోయారని రాజకీయవర్గాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నా.. పట్టీపట్టనట్టు వ్యవహరించడం, దొడ్డిదారిలో వాటికి అనుమతులు మంజూరు చేసి దండుకోవడం, ఆస్తిపన్ను ముక్కుపిండి వసూలు చేయడం, ట్రేడ్ లైసెన్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడటం, వందల కోట్లు వెచ్చించి రోడ్లు, వీధులను ఊడ్చడం, ప్రతి ఎండాకాలంలో నాలాల్లో, వర్షపునీటి కాలువల్లో పూడిక తీయడం వరకే తమ బాధ్యత అన్నట్టు హైదరాబాద్ అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నదని అంటున్నారు. వర్షాకాలంలో వరదనీటిలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా, గుంతల రోడ్లపై వాహనాలు నడపలేక అరిగోస పడుతున్నా, రాశులుగా చెత్తకుప్పలు కంపుకొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
పదేళ్లుగా పైపులైన్ల విస్తరణ లేదు, కబ్జాల తొలగింపు శూన్యం
గత భారీ వర్షాల అనుభవాల నేపథ్యంలో వరద ప్రవహాన్ని నిలువరించి ప్రయాణాలు సాఫీగా సాగించేందుకు కొత్తగా ఎక్కడ కూడా పైపులైన్లు నిర్మించలేదు. నాలాలు కబ్జాల పాలవుతున్నా కూల్చివేసే సాహసం చేయడం లేదు. తమకు సంబంధం లేదనే విధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు, ఓపెన్ స్పేసెస్, పార్కులు కబ్జాకు గురయ్యాయని చెబుతున్నారు. నగరంలో చెరువులు, కుంటలు, నాలాలకు మధ్య ఇంటర్ లింక్ ఉండేది. ఇలా ఒకదానికి మరొకటి గొలుసుకట్టు ఉండటంతో గతంలో వరద ప్రవాహం ఇంత తీవ్రంగా ఉండేది కాదు. జీహెచ్ఎంసీ కళ్లు మూసుకోవడం, కూల్చివేతలు చేయకపోవడంతో నాలుగు వందల చెరువులు కాస్తా 150కి చేరుకున్నాయి. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అంగీకరించారు. హెచ్ఎండీఏ పరిధిలో లేక్ ప్రొటెక్షన్ విభాగం ఉన్నా పనిచేయడం లేదు. ఇలా ఎవరికి వారు చెరువులు, కుంటలు మాయవుతున్నా నిలువరించే ప్రయత్నాలు మచ్చుకైనా చేయలేదు. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక్క పార్క్ కన్పించదు, ఓపెన్ స్పేస్ చూద్దామంటే భూతద్ధంలో వెతకాలి. శిల్పారామం, శిల్పకళా వేదిక, హైటెక్స్, దుర్గం చెరువు వంటివి ఉన్నాయి. పార్కులు, ఓపెన్ స్పేసెస్ లేకుండా అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగం, భవిష్యత్తులో వరదలు వస్తే దుస్థితి ఎలా ఉంటుందనేది కనీసం ఆలోచించలేదు. ఈ ప్రాంతంలో వెలసిన ఐటీ కంపెనీల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపేణా వేలాది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మెట్రో రైలు, బస్సులు, ప్రైవేటు వాహనాలతో కిటకిటలాడాయి. సైబర్ టవర్స్ నుంచి హైటెక్ సిటీ స్టేషన్ దాటడానికి మూడు గంటల సమయం తీసుకున్నది. అదే విధంగా రాయదుర్గం చేరుకోవడానికి ఇంతే సమయం పట్టిందని ఐటీ ఉద్యోగులు వాపోయారు.
అవసరం లేని ఫ్లైవర్లతో ప్రచారం
నగరంలో మెట్రో రైలు ను విస్తరించకుండా అడ్డగోలుగా ఫ్లైఓవర్లను నిర్మించి ప్రజల మెప్పు పొందేందుకు గత బీఆరెస్ పాలకులు ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మియాపూర్ నుంచి వయా గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం, గోషామహల్ వరకు మెట్రో నిర్మించే పెద్ద రోడ్డు ఉన్నా నిర్మించకుండా ఫ్లైఓవర్లు నిర్మించి మరింత నరకం చూపిస్తున్నారని నగరవాసులు గోసపడుతున్నారు. మియాపూర్ వద్దనుకుంటే లింగంపల్లి వరకు రైలు లైను వేయవచ్చు. అదే విధంగా ఎంజీబీఎస్ నుంచి వయా అంబర్ పేట, ఉప్పల్ జంక్షన్, బోడుప్పల్ దాకా మెట్రో విస్తరించవచ్చు. ఇక్కడ కూడా ఫ్లైఓవర్లు వేసి వందల కోట్ల ప్రజాధనం వృథా చేశారని పట్టణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్ధీకి అనుగుణంగా మెట్రో రైలును విస్తరిస్తే ఇన్ని సమస్యలు ఉండేవి కావని అంటున్నారు. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం ప్రాతిపాదించిన మూడు లైన్లు మినహా కొత్త లైన్లు వేయలేదు. ప్రయాణికుల రద్ధీకి అనుగుణంగా బోగీలను పెంచడంలో ఎల్ అండ్ టీ కంపెనీ మీనమేషాలు లెక్కిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే సాహనం చేయడం లేదు. గత పదేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీ రామారావు మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. తన హయాంలో కీలకమైన వరదనీటి సమస్య, మెట్రో రైలు విస్తరణపై ఏమాత్రం శ్రద్ధకనబర్చలేదు సరికాదు చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా ప్రేక్షకపాత్ర పోషించారనే చెప్పాలి. కనీసం రోడ్లపై వర్షనీరు నిలువ ఉండకుండా ఉండేందుకు వర్షపు నీటి పైపులైన్ల ఆధునీకరణ, విస్తరణకు నిధులు కేటాయించలేదు. ఫార్ములా ఈ రేసు, భారీ భవనాలకు అనుమతులు ఇవ్వడంలో చూపిన శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ పై చూపించలేదని పట్టణ నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయని ఉద్యమ సమయంలో చెప్పి, తీరా రాష్ట్రం సిద్ధించిన తరువాత వలస పాలకుల కన్నా ఘోరంగా పాలించారని నగర పౌరులు దుమ్మెత్తిపోస్తున్నారు. పదేళ్ల పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని వాహనదారులు వాపోతుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
నిర్లక్ష్యం ‘కుండపోత’.. గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం
వరంగల్ ‘వరద’పై స్టడీ…ముంపు ప్రాంతాల రక్షణకు చర్యలు
Interesting Video | తైమూర్ మేక, అమూర్ పులి మధ్య ఆశ్చర్యకర స్నేహం!