‘ఎన్డీఏ’కు ‘ఇండియా’ సవాల్‌!

మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి తనకు తిరుగులేదని అనుకుంటున్న పలు రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తున్నదా? బీహార్‌, మహారాష్ట్రలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కాషాయపార్టీకి కాంగ్రెస్‌ చెక్‌ పెట్టిందా?

‘ఎన్డీఏ’కు ‘ఇండియా’ సవాల్‌!

తిరుగులేదనుకునే రాష్ట్రాల్లో ఎదురుగాలి!
బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ చెక్‌
మూడో దశలో 93 సీట్లకు ముగిసిన పోలింగ్‌
గుజరాత్‌లో రాజ్‌పుత్‌లలో వ్యతిరేకత
కర్ణాటకపై ప్రజ్వల్‌ ఉదంతం ప్రభావం
ఉత్తరాదిలోనూ ఎన్డీయేకు సవాల్‌
ప్రధాని దక్షిణాది యాత్రలు అందుకేనా?
నాలుగో దశ తర్వాతే అంచనాలపై స్పష్టత

(విధాత ప్రత్యేకం)

మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి తనకు తిరుగులేదని అనుకుంటున్న పలు రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తున్నదా? బీహార్‌, మహారాష్ట్రలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కాషాయపార్టీకి కాంగ్రెస్‌ చెక్‌ పెట్టిందా? మోడీ, షాల మిషన్‌ సౌత్‌ ఈసారి బెడిసి కొడుతుందా? 2014, 2019లలో గుజరాత్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీకి ఈసారి ఆ ఘనత సాధ్యమేనా? ఉత్తరాదిలో నష్టాన్ని దక్షిణాదిలో పూడ్చుకోవడానికే ప్రధాని పదే పదే ఇక్కడికి పర్యటిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నది.

మూడో దశలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. వాస్తవానికి ఈ విడుతలో 94 స్థానాలకు పోలింగ్‌ జరగాలి. కానీ సూరత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం, ఆ స్థానంలోని బీజేపీ మినహా మిగిలిన అభ్యర్థులు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంతో ఆ స్థానం ఏకగ్రీవమైంది. గుజరాత్‌లో 25 స్థానాలకే పోలింగ్‌ జరిగింది. అక్కడి మొత్తం 26 స్థానాలను 2014, 2019లో బీజేపీనే గెలుచుకున్నది.

కానీ ఈసారి అక్కడ రాజ్‌పుత్‌ల నుంచి ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల రాజ్‌పుత్‌లపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలే దీనికి కారణమని అంటున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలు ఏకంగా బీజేపీ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజ్‌పుత్‌లు 17 శాతం దాకా ఉంటారు. సౌరాష్ట్రలో వీరి ప్రభావం ఉంటుంది. అందుకే నష్టనివారణ కోసం ప్రధాని ఆ వర్గానికి చెందిన రాజవంశీకులను కలిసి వాళ్లను శాంతపరిచే ప్రయత్నం చేశారని అంటున్నారు.

1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, గత రెండుసార్లు ఆ రాష్ట్రంలో మొత్తానికి మొత్తం లోక్‌సభ సీట్లు కైవసం చేసుకున్న పార్టీకి ఈసారి కష్టాలు తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గుజరాత్‌ నమూనాతోనే అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ) తొలి పది స్థానాల్లోనూ గుజరాత్‌ లేదన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. మోదీ నమూనా పోయి అక్కడ ఇప్పటికీ కులం, మతం ఆధారంగానే ఓట్లు అడిగే పరిస్థితిలోనే ఉన్నదన్నది అన్నది అర్థమౌతున్నది.

కర్ణాటకపై ప్రజ్వల్‌ ఉదంతం ప్రభావం

కర్ణాటకలో 28 స్థానాలుండగా రెండో ఫేజ్‌లో 14 స్థానాలకు పోలింగ్‌ జరగగా.. మూడో ఫేజ్‌లో మిగిలిన స్థానాలకు పోలింగ్‌ జరిగింది. గత ఎన్నికల్లో 25 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి. పార్టీలో సీనియర్‌ నేతల మధ్య అంతర్గత విభేదాలతో లోక్‌సభ ఎన్నికల్లో గెలువడం కష్టమనే ఉద్దేశంతోనే గాలిజనార్దన్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకున్నారనే చర్చలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ఎన్నికలను ప్రభావం చేసే లింగాయత్‌, వొక్కలిగ సామాజిక వర్గాల మెజారిటీ ఓట్లు బీజేపీకే పడేలా యడ్యూరప్ప తనయుడు విజేయేంద్రకు పార్టీ పగ్గాలు అప్పగించింది. వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నది.

ఎన్నికలకు ముందు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపులు, ఆయన దౌత్య పాస్‌పోర్ట్‌తోనే దేశం విడిచి వెళ్లడం బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. ఈ పరిణామాలు ఎక్కడ బీజేపీ పుట్టి ముంచుతాయోనన్న కలవరం ఆ పార్టీ నేతల్లో ఉన్నది. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ప్రజ్వల్‌ను సహించకూడదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రజ్వల్‌ ఉదంతం బీజేపీ+జేడీఎస్‌ ఓటు బ్యాంకుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 25 సీట్లు గెలుచుకున్న కాషాయపార్టీకి ఈసారి ఎన్నికల్లో భారీగా కోత పడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

ఉత్తరాదిలోనూ ఎన్డీయేకు సవాల్‌

ఇక మూడో దశలోనే కీలకమైన మహారాష్ట్రలో 11 చోట్ల, యూపీలో 10 చోట్ల, బీహార్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 7, బెంగాల్‌లో 4 చోట్ల పోలింగ్‌ జరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌+ఎన్సీపీ (శరద్‌పవార్‌)+ శివసేన (యూబీటీ) కూటమి మహా వికాస్‌ అఘాడీ, బీహార్‌లో ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహా ఘట్‌బంధన్‌, యూపీలో ఎస్పీ+కాంగ్రెస్‌ల కూటమి నుంచి బీజేపీకి సవాల్‌ ఎదురవుతున్నదని పరిశీలకులు అంటున్నారు. బెంగాల్‌లో అధికార తృణమూల్‌తో పాటు కాంగ్రెస్‌+వామపక్షాల కూటమి వల్ల అక్కడ త్రిముఖ పోరు తప్పేలా లేదు.

2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు జట్టుకట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. కాంగ్రెస్‌, వామపక్ష కూటమి బలం పుంజుకోవడం తృణమూలతోపాటు ప్రధానంగా బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆ ప్రభావం గత ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీపై పడుతుందా? లేక 22 సీట్లు గెలుచుకున్న తృణమూల్‌పై పడుతుందా? అన్నది చూడాలి. మొత్తంగా మూడో దశ పోలింగ్‌ తర్వాత ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వడమే కాదు.. సవాల్‌ విసిరిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

ప్రధాని దక్షిణాది యాత్రలు అందుకేనా?

ఉత్తర భారతదేశంలో పరిస్థితిని అంచనా వేసిన కారణంగానే ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించడానికి పదే పదే పర్యటిస్తూ ప్రయత్నం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో 2022 మే నుంచి 2024 ఏప్రిల్‌ 17 వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలలో 146 సార్లు పర్యటించడం.. ఉత్తరాదిలో ఆ పార్టీకి వచ్చే సీట్లపై నమ్మకం లేదనే సంకేతాలు ఇస్తున్నదని అంటున్నారు.

2019లో బీజేపీ ఏపీ, కేరళ, తమిళనాడులో ఒక్క సీటూ గెలువలేదు. మొదటి రెండు దశల్లో కేరళ, తమిళనాడులలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఈసారి కూడా అక్కడ గత ఫలితాలే పునరావృతమయ్యేలా ఉన్నది. ఇక ఏపీలో 6 చోట్ల, తెలంగాణలో 17 చోట్ల ఆ పార్టీ పోటీ చేస్తున్నది. వీటికి మే 13న పోలింగ్‌ జరగనున్నది. బీజేపీ పోటీ చేస్తున్న 23 చోట్ల ఎన్ని గెలుచుకుంటుంది? తెలంగాణలో గతంలో గెలిచిన 4 సీట్లను నిలబెట్టుకోగలదా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే రాష్ట్రంలో బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకే బీజేపీ బలం పెరిగిందనే వాదన ఉన్నది. ఇవాళ ఆయన గెలుపు కోసం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోసం మాజీ గవర్నర్‌ తమిళి సై రావాల్సి వచ్చింది. తెలంగాణలో ప్రధాని, అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా కేంద్రమంత్రలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వచ్చారు. కానీ ఆ పార్టీ కచ్చితంగా ఈ సీట్లలో గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నది.

తెలంగాణలో పరిస్థితేంటి?

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయన్న చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏ పార్టీ ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? అన్న దాన్ని బేరీజు వేసుకుని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ 2018లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 119 స్థానాలకు 88 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ నాలుగు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాలకే పరిమితమైంది. 2014లో 63 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పుడే 11 లోక్‌సభ సీట్లలో విజయకేతనం ఎగురవేసింది.

అంటే 2014లో గెలుచుకున్న 11 సీట్లనే తిరిగి నిలబెట్టుకోలేకపోయింది. ఈసారి కోల్పోయిన సీట్లు కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చినవి కావడం గమనార్హం. ఆ రెండు సీట్లలో ఒకటి కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి కవిత ఓడిపోవడం. కనుక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ అన్నవి మాత్రమే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేవు. ఎందుకంటే పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, అనుకూలతలపై ప్రజల తీర్పు ఉంటుంది. ఐదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు ప్రామాణికం అవుతుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ నాయకత్వంలో వచ్చిన మార్పు కూడా ఈసారి ఎన్నికల్లో కనిపిస్తుంది. కనుక ఒకటి రెండు అంశాల ఆధారంగానే ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. రెండు దశల పోలింగ్‌ ముగిసింది. మూడో దశ పోలింగ్‌ ఈ నెల 7న నాలుగో దశ మే 13న జరగనున్నది. ఆ తర్వాత మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ అనేదానిపై క్లారిటీ రానున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.