హర్యానా సంక్షోభం దేనికి సంకేతం?

సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు విడుతల పోలింగ్‌ ముగిసి నాలుగో విడుత పోలింగ్‌ మే 13న జరగనున్న సమయంలో హర్యానా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

హర్యానా సంక్షోభం దేనికి సంకేతం?

మైనార్టీలో పడిపోయిన నాయబ్‌సింగ్‌ సర్కార్‌
బల నిరూపణకు గవర్నర్‌కు దుష్యంత్‌ లేఖ
మెజార్టీకి ఇద్దరు సభ్యులు తక్కువతో కాంగ్రెస్‌
ఎన్నికల వేళ అధికార బీజేపీకి షాక్‌
పంజాబ్‌, ఢిల్లీ, యూపీలపై ప్రభావం!

(విధాత ప్రత్యేకం)

సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు విడుతల పోలింగ్‌ ముగిసి నాలుగో విడుత పోలింగ్‌ మే 13న జరగనున్న సమయంలో హర్యానా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ముందు లోక్‌సభ సీట్ల పంపకంలో బీజేపీ, జేజేపీ మధ్య చర్చలు బెడిసికొట్టాయి. దీంతో కూటమి విచ్ఛిన్నమైంది. ప్రభుత్వానికి దుష్యంత్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సీఎం సీటు కోల్పోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో నాయబ్‌ సింగ్‌ సైనీని బీజేపీ అధిష్ఠానం కుర్చోబెట్టింది. ఆయన సీఎం అయిన నాటి నుంచే ప్రభుత్వ మనుగడపై అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌ సింగ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది. సమయం సందర్భం కోసం ఎదురుచూస్తున్న జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌.. ముఖ్యమంత్రి సైనీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేయడమే కాదు, ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.

బలనిరూపణలో ఏదైనా జరగొచ్చు

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌతాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. ఇందులో బీజేపీకి 40 మంది సభ్యుల బలం ఉన్నది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోక్‌హిత పార్టీ ఏకైక సభ్యుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయినా ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు కావాలి. ఇక కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులున్నారు.

జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అయినా కాంగ్రెస్‌ బలం 43గానే ఉన్నది. అధికారంలోకి రావాలంటే మరో స్వతంత్ర ఎమ్మెల్యే, ఐఎన్‌ఎల్‌డీ సభ్యుడు మద్దతు ఇవ్వాల్సి ఉన్నది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే సర్కార్‌ మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేదని సైనీ అంటున్నా బల నిరూపణ సమయంలో ఏదైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బీజేపీకి ఎన్నికల వేళ సవాల్‌

2019లో రాష్ట్రంలోని 10 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు ఈ రాజకీయ సంక్షోభం పెద్ద సవాల్‌ విసిరింది. అటు పంజాబ్‌, ఇటు ఢిల్లీకి మధ్య ఉండే హర్యానా రాష్ట్ర రాజకీయ పరిణామాల ప్రభావం ఆ రెండు రాష్ట్రాలపై పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. పంజాబ్‌లో 13, ఢిల్లీలో 7, హర్యానాలో 10 మొత్తం 30 స్థానాలలో ఈ ప్రభావం ఉంటుంది. మే 25న ఆరో దశలో హర్యానా, ఢిల్లీలోని మొత్తం స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో పంజాబ్‌లోని 13 స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనున్నది.

జాట్‌ల కోట హర్యానా

ఎమ్మెల్యేల రాజీనామాలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో బీజేపీ మెజారిటీ కోల్పోయింది. కాబట్టి సైనీ సర్కార్‌ బలాన్ని నిరూపించుకునేలా తక్షణమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలి. సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్‌ నేత భూపిందర్‌సింగ్‌ హుడా చర్యలు చేపట్టాలని దుష్యంత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. హర్యానా జాట్‌ కమ్యూనిటీకి బలమైన కోటగా పేరుగాంచింది. ఓటర్లలో ఈ సామాజికవర్గం 29 శాతం ఉంటారు. ఓటింగ్‌లో వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

దీనికితోడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో మిగిలిన రాష్ట్రాల రైతులకంటే.. పంజాబ్‌, హర్యానా రైతులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతుల నిరవధిక నిరసనతో చిక్కుల్లో ఉన్న బీజేపీకి దుశ్యంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందిగా మారాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చింది.

ఆ సమయంలో హర్యానా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుష్యంత్‌ఫై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కూడా అందుకు ఒప్పుకొన్నది. అంతేకాకుండా వారికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చింది’’ అని అన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో రైతుల కనీస మద్దతు ధరతోపాటు నిరుద్యోగం వంటివి ప్రధానాంశాలు అయ్యాయి. దీన్నిబట్టి అక్కడ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నాలుగు, ఐదో దశ ఎన్నికలపై ప్రభావం!

మూడు దశల్లో ఎన్డీఏ కూటమికి నిరాశాజనక ఫలితాలే రావొచ్చు అనే వాదనలు వినిపిస్తున్న సమయంలో మే 13న జరగనున్న నాలుగో దశలో ఏపీ (25), బీహార్‌ (5), ఝార్ఖండ్‌, (4), మధ్యప్రదేశ్‌ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17), యూపీ (13) , బెంగాల్‌ (8), జమ్ముకశ్మీర్‌ (1).. పది రాష్ట్రాలు\ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 96 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మే 20న జరగనున్న ఐదో దశలో బీహార్‌ (5), ఝార్ఖండ్‌ (3), మహారాష్ట్ర (13), ఒడిషా (5), యూపీ (14), బెంగాల్‌ (7), జమ్ముకశ్మీర్‌ (1), లద్దాఖ్‌ (1).. ఎనిమిది రాష్ట్రాలు\ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 49 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది.

నాలుగో, ఐదో దశల్లో జరిగే రాష్ట్రాల్లో యూపీ, మధ్యప్రదేశ్‌ మినహా ఎన్డీఏ కూటమికి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు తక్కువే. ఈ సమయంలో హర్యానా సంక్షోభం ఆరో, ఏడో దశల్లో జరిగే 114 నియోజకవర్గాలపై ఎంతో కొంత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అంతిమమంగా అది కాషాయపార్టీకే ఎక్కువ నష్టం చేస్తుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.