Telangana Rising Debt | సంక్షోభం అంచున తెలంగాణ? రిజర్వ్ బ్యాంకు హెచ్చరికలు పట్టని పాలకులు

తెలంగాణ బ‌డ్జెట్ అప్పులు 2026 మార్చి 31వ తేదీ నాటికి రూ.5 ల‌క్ష‌ల కోట్లు దాటే అవ‌కాశం ఉంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ అంచ‌నా వేసింది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 27.5 నుంచి 28.1 శాతం మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితి 25 శాతం కంటే అద‌నంగా ఉంద‌ని పేర్కొన్న‌ది. పైగా సొంత ఖ‌ర్చుల కోసం మార్కెట్ రుణాల‌పై ఆధార ప‌డ‌టాన్ని త‌ప్పు ప‌ట్టింది. బ‌డ్జెట్ లోటు ప్ర‌తి ఏటా పెరుగుతున్న‌దని పేర్కొన్నది.

Telangana Rising Debt | సంక్షోభం అంచున తెలంగాణ? రిజర్వ్ బ్యాంకు హెచ్చరికలు పట్టని పాలకులు
  • ప్రమాదకర రాష్ట్రాల జాబితాలో చేరే ప్రమాదం
  • ఇప్పటికే ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని దాటి రుణాలు
  • 2026 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.5 లక్షల పైనే
  • బడ్జెటేతర రుణాలూ దండిగానే…
  • ఆర్థిక క్రమశిక్షణ పాటించకుంటే కాశ్మీర్, పంజాబ్ సరసన చేరే ప్రమాదం
  • వచ్చే ఆదాయంలో 51 శాతం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే సరి

విధాత, హైదరాబాద్:
Telangana Rising Debt | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణ సమాజాన్ని కలవర పెడుతోంది. ఆదాయం దండిగా ఉన్నా.. ఆర్థిక సంక్షోభం అంచుల్లోకి ఎందుకు వెళుతున్నామనేది మిస్టరీగా మారుతున్నది. వస్తున్న ఆదాయానికి… చేస్తున్న ఖర్చులకు పొంతనకురడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్నది. జనవరి 2026లో విడుదలైన “State Finances: A Study of Budgets of 2025-26” నివేదికలో ఎఫ్‌ఆర్‌బీఎం ప‌రిమితికి మించి తెలంగాణ రుణాలు తీసుకుంటున్న‌ద‌ని, ఇది ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ద‌తి కాద‌ని హెచ్చ‌రించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులు మార్చి 2026 నాటికి జీడీపీలో 29.2 శాతానికి చేరే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం సూచించిన 20 శాతం ప‌రిమితి కంటే చాలా ఎక్కువ అని తేల్చిచెప్పింది. అప్పుల ఊబిలో పంజాబ్‌, రాజ‌స్థాన్‌, కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఏపీ, తెలంగాణ త‌దిత‌ర రాష్ట్రాలు స‌త‌మ‌త‌మ‌వుతున్నాయని నివేదిక పేర్కొన్న‌ది. పంజాబ్ అప్పు జీఎస్‌డీపీలో 40శాతం ఉంది. ప‌శ్చిమ బెంగాల్ 39 శాతం, తెలంగాణ 27.5 శాతం ఉంది. వాస్త‌వంగా రుణాలు జీఎస్‌డీపీలో 20 శాతం మాత్ర‌మే ఉండాలి కానీ, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తమది డెవలపింగ్‌ స్టేట్‌ కాబట్టి.. రుణాలు తెచ్చుకోవ‌డానికి ప‌రిమితిని మ‌రో 5 శాతానికి పెంచాల‌ని కోరి.. 20 నుంచి 25 శాతానికి పెంచుకున్నారు. దీనివ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లపై రుణ భారం పెరిగింది కానీ మేలు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ‌లో పెట్టుబ‌డి వ్య‌యం మెరుగుగా ఉన్న‌ప్ప‌టికీ మార్కెట్ రుణాల‌పై ఆధార ప‌డ‌డం పెరుగుతోంద‌ని ఆర్‌బీఐ హెచ్చ‌రించింది. ఉచిత ప‌థ‌కాల ప్ర‌భావంతో ముఖ్యంగా వ్య‌వ‌సాయ రుణాల మాఫీ, ఉచిత విద్యుత్‌, న‌గ‌దు బ‌దిలీ వంటి సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై భారం ప‌డి… మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై పెట్టే పెట్టుబ‌డులను త‌గ్గిస్తున్నాయ‌ని పేర్కొన్న‌ది. ఇది మంచి ప‌ద్ధతి కాద‌ని తెలిపింది.

అప్పుల్లో టాప్ 10 రాష్ట్రాలు ఇవే..
రాష్ట్రం : రుణం
త‌మిళ‌నాడు : రూ.9.55 ల‌క్ష‌ల కోట్లు
ఉత్త‌ర ప్ర‌దేశ్ : రూ. 8.57 ల‌క్ష‌ల కోట్లు
మ‌హారాష్ట్ర : రూ. 8.12 ల‌క్ష‌ల కోట్లు
క‌ర్ణాట‌క : రూ.7.25 ల‌క్ష‌ల కోట్లు
ప‌శ్చిమ బెంగాల్ : రూ.7.14 ల‌క్ష‌ల కోట్లు
రాజస్థాన్ : రూ.6.20 లక్ష‌ల కోట్లు
ఆంధ్ర ప్ర‌దేశ్ : రూ.5.62 ల‌క్ష‌ల కోట్లు
మ‌ధ్య ప్ర‌దేశ్ : రూ.4.55 ల‌క్ష‌ల కోట్లు
తెలంగాణ : రూ.4.22 ల‌క్ష‌ల కోట్లు
కేర‌ళ : రూ.4.20 ల‌క్ష‌ల కోట్లు

తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ఆర్‌బీఐ

2025-26లో ఆర్థిక లోటు జీఎస్‌డీపీలో 3. శాతం ల‌క్ష్యంగా రూ.54010 కోట్లు నిర్దేశించుకోగా… 2025 డిసెంబ‌ర్ నాటికే రూ.65,930 కోట్ల‌కు చేర‌డం ప‌ట్ల ఆర్‌బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల‌కు ప్ర‌భుత్వం గ్యారెంటీలు ఇవ్వ‌డం వ‌ల్ల కంటింజెంట్ ల‌య‌బిలిటీస్ జీడీపీలో 12 శాతం చేరింద‌ని, ఇది ఆరోగ్యక‌రం కాద‌ని తెలిపింది. రాష్ట్రానికి వ‌స్తున్న ఆదాయం, ఖ‌ర్చుల మ‌ధ్య ప్ర‌తి నెల నాలుగైదు వేల కోట్ల రూపాయ‌ల వ్య‌త్యాసం ఉంద‌ని తెలిపింది. వాస్త‌వంగా రాష్ట్ర అవ‌స‌రాల‌కు ప్ర‌తి నెల రూ.22,500 కోట్లు అవ‌స‌ర‌మైతే వ‌చ్చే ఆదాయం కేంద్ర గ్రాంట్లు, కేంద్రం నుంచి వ‌చ్చే ప‌న్నుల్లో వాటా సొమ్ముతో స‌హా క‌లిపి రూ. 18,500 కోట్లు మాత్ర‌మే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం గ‌తంలో వెల్ల‌డించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది.
తెలంగాణ ఆదాయంలో 51 శాతం నిధులు జీతాలు, పెన్ష‌న్లు, వ‌డ్డీల‌కే ఖ‌ర్చవుతున్నాయి. రాబ‌డి క‌న్నా ఖ‌ర్చులు ఎక్కువ‌గా పెర‌గ‌డంతో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ తెలంగాణ‌ను హెచ్చ‌రించింది. బ‌డ్జెటేత‌ర అప్పుల‌ను త‌గ్గించుకోవాల‌ని లేదంటే దీర్ఘ కాలంలో ఆర్థిక స్థిర‌త్వానికి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రించారు. ఆర్థిక లోటును భ‌ర్తీ చేసుకోవ‌డానికి 76 శాతం నిధుల‌ను మార్కెట్ రుణాల ద్వారా సేక‌రిస్తున్నార‌ని ఇది వ‌డ్డీ భారాన్ని పెంచుతుంద‌ని రాష్ట్రాల తీరుపై ఆర్‌బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

బ‌డ్జెట్ అప్పులు మార్చి నాటికి రూ. 5 ల‌క్ష‌ల కోట్లు దాటే అవ‌కాశం

తెలంగాణ బ‌డ్జెట్ అప్పులు 2026 మార్చి 31వ తేదీ నాటికి రూ.5 ల‌క్ష‌ల కోట్లు దాటే అవ‌కాశం ఉంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ అంచ‌నా వేసింది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 27.5 నుంచి 28.1 శాతం మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితి 25 శాతం కంటే అద‌నంగా ఉంద‌ని పేర్కొన్న‌ది. పైగా సొంత ఖ‌ర్చుల కోసం మార్కెట్ రుణాల‌పై ఆధార ప‌డ‌టాన్ని త‌ప్పు ప‌ట్టింది. బ‌డ్జెట్ లోటు ప్ర‌తి ఏటా పెరుగుతున్న‌దని పేర్కొన్నది. డిసెంబ‌ర్ 2025 నాటికే బ‌డ్జెట్ అంచ‌నాల కంటే 22 శాతం ఎక్కువ లోటు ఉండ‌డం ప‌ట్ల ఆర్‌బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి స‌బ్సీడీల భారం అంచ‌నాల‌ను మించి పోతుంద‌ని, దీని వ‌ల్ల అప్పుల చెల్లింపు కోసం ప‌ని చేసే క‌న్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్‌(CSF) తెలంగాణ‌లో కేవ‌లం 1.8 శాతం (రూ.8,019 కోట్లు) మాత్రమే ఉంద‌ని, దీని వ‌ల్ల రీపేమెంట్‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని తెలిపింది. మ‌రో వైపు బ‌డ్జెటేత‌ర అప్పులు కూడా 2025 మార్చి నాటికి రూ. 2,41,528 కోట్ల‌కు చేరుకున్నాయ‌ని ఆర్‌బీఐ గుర్తు చేసింది. అప్పులు చేస్తున్న తీరు, ఖ‌ర్చు చేస్తున్న ప‌ద్ద‌తిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆర్‌బీఐ విద్య‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి నిధులు కేటాయించ‌డంలో ఇత‌ర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వ‌రుస‌లో ఉంద‌ని ప్ర‌శంసించింది.

అయితే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌డంలో తెలంగాణ నిర్ల‌క్ష్యంగా ఉంద‌ని ఆర్‌బీఐ భావిస్తోంది. దేశంలో కేవ‌లం మూడు రాష్ట్రాలు మాత్ర‌మే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తున్నాయ‌ని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం ప‌రిమితికి లోబ‌డే రుణాలు తీసుకుంటున్నాయ‌ని, పైగా తీసుకున్న రుణాల‌ను త‌గ్గించుకోవ‌డానికి ఒక ప్ర‌ణాళిక ఏర్పాటు చేసుకొని ప‌ని చేస్తున్నాయ‌ని తెలిపింది. అలా జీఎస్‌డీపిలో 20 శాతం ప‌రిమితికి లోబ‌డి ఒడిశా 12.7 శాతం, గుజ‌రాత్ 17.9 శాతం, మ‌హారాష్ట్ర 19 శాతం మాత్ర‌మే రుణాలు తీసుకున్నాయి. ఇది ఇలా ఉండ‌గా ఆర్థిక అరాచ‌కానికి మారు పేరుగా జ‌మ్ము కశ్మీర్‌, పంజాబ్‌, నాగాలాండ్‌, ప‌శ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలున్నాయ‌ని చెప్పిన ఆర్‌బీఐ.. జీఎస్‌డీపీ ప‌రిధి దాటి అడ్డ‌గోలుగా రుణాలు తీసుకున్న‌టాప్ 10 రాష్ట్రాల జాబితాను కూడా వెల్లడించింది. తెలంగాణ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించ‌క పోతే ఈ రాష్ట్రాల స‌ర‌స‌న చేరే ప్ర‌మాదం ఉంద‌ని కూడా హెచ్చ‌రించింది. పైగా తెలంగాణ చిన్న రాష్ట్ర‌మే అయిన‌ప్ప‌టికీ అప్పులు చేయ‌డంలో జ‌నాభా, విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రాల స‌ర‌స‌న చేర‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం మ‌ని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

జీఎస్‌డీపీలో అత్య‌ధికంగా రుణాలు తీసుకున్న టాప్ 10 రాష్ట్రాల జాబితా (ఈ రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయ‌ని ఆర్‌బీఐ చెబుతున్నది.)

రాష్ట్రం (జీఎస్‌డీపీలో రుణ వాటా శాతంలో)
జ‌మ్ముకశ్మీర్ : 51 .0
నాగాలాండ్ : 47.8
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ : 45.9
పంజాబ్ : 44.5
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : 40.5
మిజోరం : 38.8
సిక్కిం : 38.2
ప‌శ్చిమ‌బెంగాల్ : 38.0
మేఘాల‌య : 37.6
బీహార్ : 37.0

ఇవి కూడా చదవండి..

Airport Cafe | ఇక నుండి ఎయిర్ పోర్టుల్లో టీ రూ.10, సమోసా రూ.20 అంతే!
Nizamabad Corporation : నిజామాబాద్ కార్పోరేషన్ లో బిగ్ ట్విస్ట్..ప్రతిపక్షానికి బీజేసీ సై !
Neem Datun | ఆన్‌లైన్‌లో వేప పుల్ల‌లు.. ధ‌ర తెలిస్తే షాకే..!
ఇండియా-పాకిస్థాన్ బార్డర్‌లో కంచెకు సీసాలు ఎందుకు వేలాడదీస్తారో తెలుసా? దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా!