Telangana Urea Shortage | యూరియాపై పాలిటిక్స్! మూడు పార్టీల రాజకీయం.. పొంచి ఉన్న బ్లాక్ మార్కెట్ దందా!
త్వరలో కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాల నుంచి యూరియా రాష్ట్రానికి రానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. వచ్చిన యూరియా పంపిణీకి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే బ్లాక్ మార్కెట్ దారుల దందా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల రైతుల అవసరాన్ని గుర్తించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

విధాత ప్రత్యేక ప్రతినిధి/ ఆగస్ట్ 21 :
Telangana Urea Shortage | యూరియా కోసం రైతుల వార్ తీవ్రమవుతోంది. రైతుల్లో క్రమంగా తీవ్ర అసహనం పెరుగుతోంది. రైతుల అసంతృప్తికి రాజకీయ జోక్యం పెరుగడంతో నిరసన సెగలుగక్కుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖానాపురంలో అడ్డుకుంటున్న పోలీసులను మహిళా రైతు కాళ్లుపట్టుకునే దృశ్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మూడు రాజకీయ పక్షాలు ఇప్పుడు రైతులపైన ప్రేమ కనబరుస్తున్నారు. తాజాగా ప్రత్యక్షంగా రైతులకు మద్దతు తెలియజేయడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పరిశోధకులు పదేపదే చెబుతున్నారు. ఈ హితబోధలు మాటలకే పరిమితమవుతున్నాయి. రైతులను సకాలంలో చైతన్యం చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.
యూరియాకు పెరిగిన డిమాండ్
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ పీక్ స్టేజ్‌కి చేరింది. సీజన్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేసినప్పటికీ ఇప్పుడు కుండపోత వర్షాలతో వ్యవసాయపనులు జోరందుకున్నాయి. దీంతో యూరియాకు తీవ్రమైన డిమాండ్ పెరిగింది. ఒక వైపు డిమాండ్, మరో వైపు కొరతతో రైతులు పనులు పక్కనపెట్టి ‘యూరియా’ కోసం పడిగాపులు గాస్తున్నారు. ఇది సహజంగానే రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంటిల్లిపాది పనులు చేస్తేనే వ్యవసాయ పనులు గట్టెక్కుతాయి. ఈ క్రమంలో యూరియా కోసం కాలం వెచ్చించడం రైతుల్లో అసహనానికి కారణమవుతోంది. ఎరువుల దుకాణాల వల్ల నో స్టాక్ బోర్టు దర్శనమిస్తుండగా సహకార సంఘాలు, ఆగ్రోస్ ద్వారా యూరియాను రేషన్ తరహాలో పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి పడిగాపులు గాసినా కావాల్సిన యూరియా లభిస్తుందా? అంటే గ్యారంటీ లేదు. దీంతో ఎక్కడ చూసిన రైతులు బారులు తీరుతుండగా లైనులో నిలబడలేక చెప్పులు, సంచులు, పాసు పుస్తకాలు క్యూలో పెడుతున్నారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తున్నప్పటికీ కొరత ఉందనే ప్రచారం కారణంగా కొందరు రైతులు ముందస్తు జాగ్రత్త వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతోంది. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు నిన్నమొన్నటి వరకు తెరవెనుక ఉండగా తాజాగా వారికి మద్ధతుగా ఆందోళనల్లో పాల్గొనడంతో పరిస్థితి పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. ఖానాపురం, ఉప్పరపల్లి, దంతాలపల్లి, రాయపర్తి, జనగామ, పరకాల, మహబూబాద్ ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్ధతుగా యూరియా కోసం వేచిచూస్తున్న ప్రాంతాలకు వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పలుచోట్ల భారీగా పోలీసులను మోహరించారు. రాజకీయ మద్ధతు లభించడంతో అప్పటికే ఆందోళనతో ఉన్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
రాజకీయ మూడు ముక్కలాట
రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా పైన రాజకీయ మూడు ముక్కలాట సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కక్ష పూరిత చర్య వల్ల యూరియా కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్, మంత్రులు తుమ్మల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నడ్డాను కలిసి విన్నవించారు. రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన కోటలో కోత విధించడం వల్ల కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రావాల్సిన 9.80లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకుగానూ కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని ప్రకటించారు. దీని వల్ల రాష్ట్ర రైతులకు తక్షణం అవసరమైన 3లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. దీనిపై పార్లమెంటు సాక్షిగా ఎంపీలు నిరసన చేపట్టారు. యూరియా కొరతను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, బీజేపీకి తాబేదారుగా మారిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా తమను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్ర నిర్లక్ష్యమంటున్న బీజేపీ
రాష్ట్రానికి కావాల్సిన యూరియా కేంద్రం సరఫరా చేసిందని బీజేపీ నాయకులు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల సమస్య ఏర్పడుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులను విమర్శించడం సరికాదంటున్నారు. కేంద్రం తప్పులేదని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ఆగ్రహం
సీఎం రేవంత్ చేతగాని తనం వల్ల యూరియా కొరత ఏర్పడిదంటూ, కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగావడంలేదంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. రైతులు పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, కవిత తదితరులు తాజాగా ప్రత్యక్ష నిరసనల్లో భాగస్వామ్యమయ్యారు.
బ్లాక్ మార్కెట్ పడగనీడ
ప్రస్తుతం కేంద్రం నుంచి యూరియా సరఫరాకు సానుకూల స్పందన లభించిందని మంత్రి తుమ్మల చేసిన ప్రకటన రైతులకు కొంత ఊరట నిచ్చింది. త్వరలో కర్ణాటకతోపాటు ఇతర ప్రాంతాల నుంచి యూరియా రాష్ట్రానికి రానున్నట్లు ప్రకటించారు. వచ్చిన యూరియా పంపిణీకి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే బ్లాక్ మార్కెట్ దారుల దందా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల రైతుల అవసరాన్ని గుర్తించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ కావడంతో రైతుల నుంచి బాగా డిమాండ్ ఉన్నందున కొద్ది రోజులు అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటే సత్ఫలితాలొస్తాయని, లేదంటే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు దండుకునే అవకాశముందని రైతులు చెబుతున్నారు. అన్నదాతకు సున్నం పెట్టిన పార్టీలు కూడా రైతుల పై మొసలికన్నీరు కారుస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి..
Diamond Hunt| కూలీ చేతికి దొరికిన రూ.40లక్షల వజ్రం!
Hyderabad Weather | హైదరాబాద్‌లో రాత్రిళ్లు కుండపోత వర్షాల వెనుక గుట్టు
Telangana Liquor Shop Tenders| మద్యం దుకాణాల టెండర్స్ కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్
GHMC Deputation Corruption | జీహెచ్ఎంసీలో తిష్ఠ వేసిన ‘డిప్యూటేషన్’