NSP Left canal crisis | నల్లగొండ రైతులు చేసిన పాపం ఏంటి?
ఇప్పుడు కాలువలకు నీళ్లు విడుదల చేస్తే నవంబర్ నాటికి వరి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత పంట చేతికి వచ్చినా ఇబ్బందేననేది రైతుల మాట. తుఫాన్లు, అకాల వర్షాలు దెబ్బతీస్తాయని రైతులు చెబుతున్నారు. దీనికితోడు పంటలకు తెగుళ్లు వచ్చి సరైన దిగుబడి రాదేమోనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతున్నది.

- కృష్ణానదికి భారీగా వస్తున్న వరద నీరు
- సాగర్‌లో 556 అడుగుల నీటిమట్టం
- అయినా ఎడమ కాలువకు నీళ్లివ్వరేం?
- ఉమ్మడి జిల్లా అన్నదాతల ఆగ్రహం
NSP Left canal crisis | హైదరాబాద్, జూలై 16 (విధాత): ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 558.40 అడుగులకు చేరింది. కానీ, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీళ్లివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా తమ పంటలను ఎండబెట్టారని రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు కష్టాలు తీరలేదని అంటున్నారు.
ఎస్ఎల్‌బీసీకే నీటి విడుదల
ఎగువన కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆలమట్టి సహా ఇతర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరింది. తుంగభద్రకు కూడా వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. వరద ప్రవాహం తగ్గడంతో జూలై 15న గేట్లు మూసివేశారు. నాగార్జునసాగర్‌కు 65,900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 558.40 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టులో 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం 228 టీఎంసీల నీరుంది. అంటే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద ఒక పంటకు నీరు ఇవ్వవచ్చు. సాగర్ ప్రాజెక్టులోని ఎడమ, కుడి విద్యుత్ ప్రాజెక్టుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. ఎస్ఎల్ బీసీ ( ఎమ్మార్పీ) ప్రాజెక్టు పరిధిలో తాగు నీటి అవసరాల కోసం 1650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని భూముల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడానికి అవసరమైన ఇన్ ఫ్లో ఇంకా రావాల్సి ఉంది. అయితే రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరద నీరు వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.
బోర్ల కిందే వ్యవసాయం
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేదు. దీంతో కొందరు రైతులు ఇప్పటికే బోర్ల ద్వారా వరి సాగును ప్రారంభించారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇది కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కాలువలకు నీళ్లు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత లేదు. సరైన టైంలో నీటిని విడుదల చేస్తేనే ఉపయోగమని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు కాలువలకు నీళ్లు విడుదల చేస్తే నవంబర్ నాటికి వరి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత పంట చేతికి వచ్చినా ఇబ్బందేననేది రైతుల మాట. తుఫాన్లు, అకాల వర్షాలు దెబ్బతీస్తాయని రైతులు చెబుతున్నారు. దీనికితోడు పంటలకు తెగుళ్లు వచ్చి సరైన దిగుబడి రాదేమోనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతున్నది.
లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు నీటి విడుదల ఎప్పుడు?
కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుతున్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కృష్ణా నదికి సరైన వరద రావడం లేదు. 1990 దశకంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేసేవారు. ఎగువన కర్ణాటక రాష్ట్రం ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో పాటు ఇతరత్రా చెక్ డ్యామ్ లాంటి చిన్న చిన్న రోడ్ కమ్ బరాజ్ ల నిర్మాణంతో దిగువకు నీటి ప్రవాహం తగ్గింది. కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితేనే దిగువకు నీరు విడుదల అవుతోంది. గత ఏడాది ఆగస్టు 2న నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది ఇంకా నీటిని విడుదల చేయలేదు. ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నీటి విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా కూడా ఆయకట్టుకు నీటి విడుదల విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎడమకాలువ ఆయకట్టుకు నీళ్లివాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎన్ ఎస్ పీ ఎస్ఈ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. ఎన్ ఎస్ పీ అధికారులకు నీటి విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
నల్గొండ జిల్లా నుంచి కీలక మంత్రులు.. అయినా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా అధికార పార్టీ దక్కించుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తమకు కంచుకోట అని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు కానీ, జిల్లా రైతాంగం సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. లెఫ్ట్ కెనాల్ కు సకాలంలో నీటిని విడుదల చేయకుండా ఎప్పుడో నీళ్లిస్తే లాభం ఏంటని నిలదీస్తున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.