Mushroom Farming | పుట్ట‌గొడుగుల సాగు.. ఏడాదికి రూ. 18 ల‌క్ష‌లు సంపాదిస్తున్న స్కూల్ పిల్లాడు..

Mushroom Farming | పుట్ట‌గొడుగులు( Mushroom ) అని తీసిపారేయ‌కండి.. ఈ పుట్ట‌గొడుగుల‌తో ఓ విద్యార్థి( Student ) ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఏడాదికి రూ. 18 ల‌క్ష‌లు సంపాదిస్తూ.. యువ రైతుల‌కు( Young Farmers ) ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాడు. మ‌రి ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే బీహార్( Bihar ) వెళ్లాల్సిందే.

  • By: raj    weeds    Jul 01, 2025 11:37 AM IST
Mushroom Farming | పుట్ట‌గొడుగుల సాగు.. ఏడాదికి రూ. 18 ల‌క్ష‌లు సంపాదిస్తున్న స్కూల్ పిల్లాడు..

Mushroom Farming | జీవితంలో ఎద‌గ‌డానికి, డ‌బ్బు సంపాదించ‌డానికి ఉద్యోగం అక్క‌ర్లేదు. కాస్త తెలివి ఉంటే.. చ‌దువు, ఉద్యోగంతో సంబంధం లేకుండా కోట్లు సంపాదించొచ్చు అనే దానికి ఓ స్కూల్ పిల్లాడే ఆద‌ర్శం. ఓ విద్యార్థి.. త‌న స్కూల్ ఏజ్‌లోనే పుట్ట‌గొడుగుల సాగు( Mushroom Farming ) చేస్తూ.. ఇప్పుడు ఏడాదికి రూ. 18 ల‌క్ష‌లు సంపాదిస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. మ‌రి ఆ అబ్బాయి మాట‌ల్లోనే అత‌ని స‌క్సెస్ స్టోరీ తెలుసుకుందాం..

నా పేరు ప్ర‌భు రంజ‌న్. మాది బీహార్‌( Bihar )లోని పాట్నా జిల్లాలోని న‌బ‌త్‌పూర్‌. చ‌దువు ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి లేదు. అయినా కూడా ఎక్క‌డా చ‌దువులో ఫెయిల్ కాలేదు. ప‌దో త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు ఒక ఆలోచ‌న వ‌చ్చింది. త‌క్కువ వ‌న‌రుల‌తో ఎక్కువ ఆదాయం సంపాదించ‌డం ఎలా అని. దాంతో బిజినెస్ గురించి ఆలోచించేవాడిని. ఏ వ్యాపారం ప్రారంభిద్దామ‌న్నా డ‌బ్బులు ల‌క్ష‌ల్లో కావాల్సి వ‌స్తుంద‌ని గ్ర‌హించాను. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఆదాయం వ‌చ్చే మార్గాల‌పై దృష్టి సారించాను. అలా పుట్ట‌గొడుగుల సాగు గురించి తెలుసుకున్నాడు. మా తాత‌లు, మా నాన్న కేవ‌లం గోధుమ‌, రైస్ మాత్ర‌మే పండిస్తున్నారు. అయితే ఈ రెండింటి గ‌డ్డి పుట్ట‌గొడుగుల సాగుకు ఉప‌యోగ‌క‌రమ‌ని తెలుసుకున్నాను. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పుట్ట‌గొడుగుల సాగు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

బీహార్‌లోని గ‌యాలో రూ. 5 వేలు వెచ్చించి.. పుట్ట‌గొడుగుల‌కు సంబంధించిన గుడ్ల‌ను కొనుగోలు చేశాను. 200 బ్యాగుల్లో వాటిని ఉంచి సాగు ప్రారంభించాను. త‌ర్వాత 30 రోజుల్లో పుట్ట‌గొడుగులు చేతికొచ్చాయి. ఆ త‌ర్వాత స్థానిక మార్కెట్‌లో 300 కేజీల బ‌ట‌న్ మ‌ష్రూమ్స్‌ను రూ. 150 చొప్పున‌(ప్ర‌తి కేజీకి) అమ్మాను. రూ. 45 వేలు సంపాదించాను.

ఇక పుట్ట‌గొడుగుల‌ను రెండు ర‌కాలుగా సాగు చేయొచ్చు. ఒక‌టి సీజ‌న్‌లో, మ‌రోక‌టి ఏడాదంతా కోల్డ్ చాంబ‌ర్ల‌లో నిల్వ ఉంచి. నేను సీజ‌న్ ప్ర‌కార‌మే పుట్ట‌గొడుగులు పండిస్తున్నాను. ఈ సాగులో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన ఎదుర్కొని, అధిక దిగుబ‌డి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను. ప్ర‌తి సీజ‌న్‌లో 200 బ్యాగుల్లో పుట్ట‌గొడుగులు సాగు చేసి రూ. 50 వేల దాకా సంపాదించాను. ప్ర‌స్తుతం ప్ర‌తి సీజ‌న్‌లో 1500 బ్యాగుల్లో 3 వేల కేజీల దాకా పండిస్తున్నాను. ప్ర‌తి ఏడాది 12 వేల కేజీల దాకా విక్ర‌యిస్తున్నాను. కేజీ పుట్ట‌గొడుగుల‌ను రూ. 150 దాకా విక్ర‌యించి.. ఏడాదికి రూ. 18 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌ను సాధిస్తున్నాని ప్ర‌భు రంజ‌న్ పేర్కొన్నారు. ప్ర‌తి సీజన్‌లో అన్ని ఖ‌ర్చులు పోనూ రూ. 2.5 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాన‌ని చెప్పాడు.

తాను ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఈ పంట పండించ‌డం ప్రారంభించాను. ఒక వైపు పుట్ట‌గొడుగుల సాగు చేస్తూనే, మ‌రో వైపు చ‌దువు కొన‌సాగిస్తున్నాన‌ని ప్ర‌భు తెలిపాడు. ప్ర‌స్తుతం డిగ్రీ హాన‌ర్స్ చ‌దువుతున్న‌ట్లు చెప్పాడు.