Health tips | నెయ్యితో బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా..?

Health tips : నెయ్యి..! ఇది అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..? అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే నెయ్యితో బరువు పెరుగుతారనడం కేవలం అపోహేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా రోజూ మితంగా నెయ్యి తీసుకుంటే బరువును తగ్గించుకునే అవకాశం ఉన్నదంటున్నారు. రోజులో 1 నుంచి 2 టీ స్పూన్లకు మించకుండా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు.
నెయ్యితో ప్రయోజనాలు
శక్తి ఉత్పత్తి
రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండవచ్చు. నెయ్యి శక్తిని ఉత్పత్తి చేసే ఒక పవర్‌హౌస్ లాంటిది. అందుకే మహిళలకు గర్భధారణ సమయంలో నెయ్యి తిన్సాల్సిందిగా సూచిస్తారు.
చర్మానికి మేలు
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడం ద్వారా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంలో నిగారింపు, ఆరోగ్యకరమైన చర్మం పొందాలంటే ఆహారంలో నెయ్యిని కలుపుకోవాల్సిందే.
పీరియడ్స్ సమస్యకు చెక్
శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాక బాధపడే మహిళలు ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎముకలు బలోపేతం
నెయ్యిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తద్వారా దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.